iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అత్యంత సంచలనంగా మారిన అంశం మూడు రాజధానులు. దాని చుట్టూ చెలరేగిన రాజకీయ ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఏపీ రాజకీయాల్లోనే ఇది కీలక నిర్ణయంగా మారింది. వైఎస్ జగన్ సర్కారు తన విధానాల పరంపరలో తీసుకున్న సీఆర్డీయే రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు అనేది రాష్ట్ర రాజకీయాలనే కాకుండా, ఏపీ అభివృద్ధి క్రమానికి కూడా మూలమలుపు కాబోతోంది. దాంతో అటు చట్టసభల్లో, ఇటు న్యాయస్థానంలోనే కాకుండా అమరావతి కేంద్రంగా స్థానిక టీడీపీ నేతల ఆందోళనల పర్వంలో కూడా ఈ నిర్ణయం ప్రకంపనలు పుట్టించింది. చివరి అంకానికి చేరుకున్న సమయంలో ప్రస్తుతం ఇది గవర్నర్ కోర్ట్ కి చేరింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోననే చర్చ సాగుతోంది.
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటు విషయం చాలా పెద్ద చర్చకు దారితీసింది. కేంద్రం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయగా నివేదిక కూడా వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తన ప్రయోజనాలకు అనుగుణంగా మరో కమిటీని వేసి, చివరకు పలు రకాల ఊహాగానాల తర్వాత అమరావతిని ఎంపిక చేసింది. కానీ ఆ తర్వాత రాజధాని అభివృద్ధి విషయంలో ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చి పనులను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుత అవసరాలను వదిలేసి 2050 నాటికి తగ్గట్టుగా రాజధాని రూపొందించాలనే తపనలో చివరకు డిజైన్లు కూడా ఖరారు చేయలేకపోయింది. తాత్కాలిక భవనాలతో సరిపెట్టి ఎన్నికల సమరంలో దిగింది. ప్రజాగ్రహానికి గురికావడంతో చివరకు బాబు తనయుడు లోకేశ్ కూడా రాజధాని పరిధిలో ఓటమి పాలయ్యారు.
అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ పరిపాలనలో కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. అనుభవజ్ఞుడినని చెప్పుకునే చంద్రబాబు చేయలేని అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తొలుత గ్రామీణ పాలనా వ్యవస్థలో సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా సమూల మార్పులు తీసుకొచ్చారు. కరోనా సమయంలో వాటి ఫలితాలను గమనించిన ప్రపంచమంతా ప్రశంసించే స్థాయికి చేరారు. ఆ తర్వాత జిల్లాల విభజన ద్వారా మరో పెద్ద మార్పుకు నాంది పలకాలని ఆశించారు. దానికి కసరత్తులు కూడా చేశారు. రాష్ట్ర, స్థానిక పాలనకు మధ్యంతరంగా సంధానకర్తలుగా ఉండాల్సిన జిల్లా యంత్రాంగంలో మార్పులకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రతీ జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లను నియమించడం అందులో భాగమే. అయితే హఠాత్తుగా మూడు రాజధానుల అంశం ముందుకు తీసుకొచ్చి సమగ్రాభివృద్ధి దిశగా సాగేందుకు పూనుకున్నారు.
డిసెంబర్ 19 నాడు అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ హింట్ ఇచ్చారు. అంతకుముందే వేసిన జీఎన్ రావు కమిటీతో పాటుగా బోస్టన్ గ్రూప్ కమిటీ, మంత్రులతో హైపవర్ కమిటీ వంటివి ప్రకటించారు. జనవరి మొదటి వారానికి వచ్చిన వాటి రిపోర్టుల ఆధారంగా జనవరి లో మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అసెంబ్లీలో బిల్లులు ఆమోదించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లులను అసెంబ్లీ ఆమోదించినప్పటికీ శాసనమండలిలో జరిగిన పరిణామాలతో జనవరి 22నాడు సెలక్ట్ కమిటీ పేరుతో మండలి చైర్మన్ నిర్ణయం మరింత వేడి రాజేసింది. చివరకు మండలి రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించేందుకు కారణం అయ్యింది.
ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం, మండలిలో టేబుల్ కావడంతో అనివార్యంగా 30 రోజుల్లో మండలి ఆమోదం కూడా లభించినట్టుగానే అని నిబంధనలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం బిల్లుని గవర్నర్ కి పంపించారు. ఆయన వెంటనే ఆమోదిస్తారా, లేక ఆలశ్యం చేస్తారా అనే అంశమే ఇప్పుడు ఏపీ భవిష్యత్ నిర్ణయించబోతోంది. అటు విశాఖలో కార్యనిర్వాహక రాజదాని, అమరావతి కేంద్రంగా శాసన రాజధాని, కర్నూలు లో న్యాయ రాజధాని ద్వారా మూడు ప్రాంతాల అబివృద్ధికి దోహదం చేసే ఈ చట్టాన్ని అడ్డుకోవాలని టీడీపీ తొలి నుంచి ప్రయత్నం చేస్తోంది. మండలిలో ఉన్న బలాన్ని అందుకు వాడుకుంది. కానీ తీరా చూస్తే ఇప్పుడు అన్ని గండాలు అధిగమించిన ప్రభుత్వం వేగంగా అడుగులు వేయడంతో గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే న్యాయస్థానాల్లో పలు కేసులు వేసింది. చివరకు మే 28 నాడు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టు ఆధారంగా కూడా ఏపీ హైకోర్టులో విచారణ సాగింది. శాసనపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే రాజధాని తరలింపు అంటూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దానికి అనుగుణంగా ప్రక్రియ సాగుతోంది.
గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఈ రెండు బిల్లులపై న్యాయపరమైన వివరణ కోరే అవకాశం కనిపిస్తోందని కొందరి అభిప్రాయం. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి విషయంలో ఇచ్చిన ఆర్డినెన్స్ కి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడంతో ఈసారి జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దానికి అనుగుణంగా ఇప్పటికే న్యాయసలహా తీసుకున్నట్టు కూడా సమాచారం. అయితే కేంద్రం కూడా రాజధాని అనేది రాష్ట్రం పరిధిలోని అంశంగా తేల్చేసింది. తమకు అభ్యంతరం లేదన్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరుణంలో న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా గవర్నర్ ఆమోద ముద్ర పడబోతున్నట్టు ఎక్కువమంది భావిస్తున్నారు. గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి వద్దకు బిల్లుని పంపిస్తారా లేదా అన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుంది. హైకోర్ట్ తరలింపు విషయంలో గెజిట్ మార్పునకు అనుగుణంగా బిల్లు రాష్ట్రపతికి చేరే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఏమయినప్పటికీ గవర్నర్ ఈ వారంలోగా బిల్లుకి ఆమోదముద్ర వేస్తే ఇక ఏపీలో మూడు రాజధానుల పర్వానికి తెరలేసినట్టు అవుతుంది. దాంతో ఏపీ పాలనా వ్యవస్థ కొత్త పంథాలో సాగబోతోందని చెప్పవచ్చు.