iDreamPost
iDreamPost
ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. ఒకవైపు కరోనా ప్రకంపనలు తగ్గకుండానే వేర్వేరు కారణాల వల్ల జరుగుతున్న వరస మరణాలు బాలీవుడ్ ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే షూటింగులు లేక, థియేటర్లు మూతబడి కకావికలం అయిన పరిశ్రమను ఈ పరిణామాలు కృంగదీస్తున్నాయి. నిన్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్ 34 ఏళ్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం మీడియాతో పాటు సినిమా ప్రేమికులను కుదిపేసింది. ఆన్ లైన్ లో ఎక్కడ చూసినా ఈ ఘటన తాలూకు వార్తలు, ఫొటోలతో హోరెత్తిపోయింది. సానుభూతి వెల్లువలా వచ్చి పడింది. సుశాంత్ ని తలుచుకుంటూ కోట్లలో అభిమానులు తమ సంతాపాన్ని వివిధ రూపాల్లో వ్యక్తపరిచారు.
ఈ ఏడాది చూసుకుంటే ఇర్ఫాన్ ఖాన్ మృతి ఇప్పటికీ జనం మర్చిపోలేదు. అనారోగ్యమే కారణం అయినప్పటికీ పోవాల్సిన వయసు కాకపోవడం ఎందరినో కలవరపరిచింది. సీనియర్ మోస్ట్ హీరో రిషి కపూర్ కాలం చేయడం కూడా జీర్ణించుకోలేని విషయం. సహజ మరణమే అయినప్పటికీ ఆయన యాక్టివ్ నెస్ ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఇంకో ఐదారేళ్లు ఈజీగా బ్రతుకుతారనే నమ్మకం వ్యక్తం చేసేవాళ్ళు. కానీ విధి తలంపు ఇంకోలా ఉంది. ఇటీవలే ప్రముఖ దర్శకులు బసూ చటర్జీ కన్నుమూశారు. ఈయన వయసు 93 సంవత్సరాలు. రజనీగంధా, చమేలి కా షాధీ లాంటి సినిమాల ద్వారా పేరు తెచ్చుకున్న బసూ లోకాన్ని విడిచి వెళ్లడం శోచనీయమే అయినప్పటికీ వయసు రిత్యా ఆయన సంపూర్ణ జీవితాన్ని అనుభవించే వెళ్లారు.
ఇక పాత తరం హీరోయిన్ నిమ్మి కూడా 88 ఏళ్ల వయసులో ఈమధ్యే కాలం చేసారు. నవాబ్ ధనూ ఈవిడ అసలు పేరు. ఆమ్, పూజా కే ఫూల్ లాంటి చిత్రాల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలా క్రమం తప్పకుండా బాలీవుడ్ ప్రముఖులు ఒకే ఏడాది తొలిసగంలోనే స్వర్గానికేగడం నిజంగా బాధాకారం. మిగిలినవాళ్ళ విషయం పక్కనబెడితే ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పూత్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్ళు వెళ్లిపోవడం మాత్రం ఎప్పటికీ తీరని లోటే. ఎంత డబ్బు, సంపద ఉన్నా ఆ రెండే మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేయలేవని నిరూపించేందుకు ఇంత కన్నా ఉదాహరణలు వేరే కావాలా. అందులోనూ కరోనా లాంటి ప్రమాదం చుట్టూ పొంచి ఉన్న వేళ ఈ సెలెబ్రెటీల వీడ్కోలు ఎవరికైనా బాధ కలిగించేవే.