నేడే చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌.. ఆ 15 నిమిషాలే కీలకం

యావత్‌ దేశం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అరుదైన, అద్భుత దృశ్యం మరి కొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌తో ఇండియా సాధించబోయే అరుదైన విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతి భారతీయుడు ఉవ్విళూరుతున్నాడు. కేవలం భారతీయులే కాక యావత్‌ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. మరి కొన్ని గంటల్లో విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై దిగనుంది. ఈ అపురూప ఘట్టాన్ని విజయవంతంగా ఆవిష్కరించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యూల్‌ జాబిల్లికి మరింత చేరువైంది. అయితే.. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యే క్రమంలో చివరి 15 నిమిషాలు అత్యంత కీలకం అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఎందుకో వారి మాటల్లోనే..

ఆగస్ట్‌ 23, బుధవారం సాయంత్రం 5.45 గంటల తర్వాత ల్యాండింగ్‌ ప్రక్రియల మొదలు కానున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ల్యాండింగ్‌ మాడ్యూల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ.. నిర్దేశిత ల్యాండింగ్‌ ప్రదేశంలో.. విక్రమ్‌ దిగేందుకు సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ మేరకు సూర్యుడి వెలుగు రాగానే విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. నేడు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై ల్యాండ్‌ కానుంది. ఆ వెంటనే.. ల్యాండర్‌ కాళ్లకు అమర్చిన సెన్సార్లు.. జాబిల్లి ఉపరితలాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఇంజన్లు ఆఫ్ అవుతాయి.

ఆ 15 నిమిషాలే అత్యంత కీలకం..

ల్యాండర్‌ సెన్సార్లు.. చంద్రుడిని తాకిన తర్వాత 15 నిమిషాల టెన్షన్‌కు తెరపడి చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ అవుతుంది. అయితే ఈ చివరి 15 నిమిషాల ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైనది కావడంతో ఏం జరుగుతుందో.. అనే ఆందోళన ఇస్రో శాస్త్రవేత్తల్లో నెలకొంది. సురక్షిత ల్యాండింగ్‌ కోసం సొంతంగా ఇంధనాన్ని మండించుకుని.. సరైన ప్రదేశాన్ని ల్యాండర్‌ స్కాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా ల్యాండర్‌ స్వయంగా చేసుకోవాల్సి ఉన్నందున.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఏదేమైనా.. విక్రమ్‌ కచ్చితంగా సేఫ్‌గా ల్యాండవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక పూజలు, యాగాలు..

ఇదిలావుంటే.. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్‌ దేశం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా మతాలకతీతంగా.. ప్రార్థనలు, పూజలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సాధువులు యాగం చేపట్టారు. అటు.. వారణాసిలోనూ చంద్రయాన్‌ 3 సక్సెస్‌ కావాలని పలువురు ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్‌ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు నమాజ్‌ చేశారు. మొత్తంగా.. చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌ కావాలని.. అంతరిక్ష రంగంలో భారత్‌ చరిత్ర సృష్టించాలని దేశమంతా ఒక్కటై కోరుకుంటుంది.

Show comments