ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ భార్య టీనా.. వెంటాడుతున్న ఆ కేసు!

  • Author singhj Published - 03:10 PM, Tue - 4 July 23
  • Author singhj Published - 03:10 PM, Tue - 4 July 23
ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ భార్య టీనా.. వెంటాడుతున్న ఆ కేసు!

ప్రముఖ బిజినెస్​మన్ అనిల్ అంబానీ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొంటున్నారు. విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)ను ఉల్లంఘించారంటూ వివిధ సెక్షన్ల కింద దాఖలైన కేసులో ఆయన సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ముంబైలోని ఈడీ ఆఫీసులో ఇన్వెస్టిగేషన్ మొదలైంది. నిన్న సాయంత్రం వరకూ ఈ విచారణ కొనసాగింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్​మెంట్ యాక్ట్ (ఫెమా) కేసు అనిల్ అంబానీని వీడటం లేదు. ఈ కేసులో తాజాగా ఆయన భార్య టీనా అంబానీ కూడా ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఇవాళ పొద్దున సౌత్ ముంబైలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన టీనా అంబానీని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో సోమవారం అనిల్ అంబానీని క్వశ్చన్ చేసిన అధికారులు.. ఇవాళ టీనాను విచారిస్తున్నారు. ఈ వారంలో మరోమారు అనిల్ అంబానీని ప్రశ్నించేందుకు నోటీసులు జారీ అయ్యాయి. విదేశాల్లోని బయటకు వెల్లడించని కొన్ని ఆస్తులు, ఫండ్స్ మళ్లింపునకు సంబంధించి వీరిని ఈడీ విచారిస్తోంది. కాగా, రెండు స్విస్ బ్యాంక్ అకౌంట్స్​లో రూ.814 కోట్లను వెల్లడించకుండా, రూ.420 కోట్ల ట్యాక్స్​ను ఎగ్గొట్టారనే ఆరోపణలపై గతేడాది ఇన్​కమ్ ట్యాక్స్ విభాగం అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది.

అనిల్ అంబానీకి ఐటీ జారీ చేసిన నోటీసులు, జరిమానాపై బాంబే హైకోర్టు సెప్టెంబర్​లో మధ్యంతర స్టే ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఎస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ మీద దాఖలైన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ ఎదుట 2020లో అనిల్ అంబానీ హాజరయ్యారు. ఇదే కేసును ఇప్పుడు మళ్లీ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు తిరగదోడారు. ఎస్​ బ్యాంకు నుంచి తీసుకున్న లోన్ల వ్యవహారం ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ కేసులో ఇదివరకే ఎస్​ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ బ్యాంకు లోన్ల వ్యవహారం అనిల్ మెడకు చుట్టుకుంది. ఈ రుణాల వ్యవహారంలో ఆయన ఫెమా, ఎక్స్ఛేంజ్ రూల్స్​ను ఉల్లంఘించారని చెబుతున్నారు.

Show comments