బాలీవుడ్‌కు ఈ ఏడాది బాగానే కలిసొస్తోంది. గత కొన్నేళ్ల నుంచి ఉత్తరాదిన హిందీ చిత్రాల కంటే సౌత్ మూవీస్‌దే హవా నడుస్తోంది. ‘బాహుబలి’ సిరీస్ నుంచి మొదలుకొని ‘కేజీఎఫ్’ సిరీస్, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కాంతార’, ‘కార్తికేయ 2’ వరకు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను పలు దక్షిణాది చిత్రాలు షేక్ చేశాయి. ఒకవైపు సౌత్ సినిమాలను బాగా ఆదరిస్తూ కోట్లాది రూపాయల కలెక్షన్లను కట్టబెడుతున్న నార్త్ ఆడియెన్స్.. మరోవైపు హిందీ ఫిల్మ్స్‌ను మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కొంతవరకు మార్పు కనిపిస్తోంది. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రమంగా కోలుకుంటున్నట్లే కనిపిస్తోంది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచి హిందీ చిత్ర పరిశ్రమలో మళ్లీ జోష్ నింపింది. ఈ సినిమాతో ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపాడు షారుక్. ‘పఠాన్’తో పాటు మరికొన్ని హిందీ మూవీస్ ఈ సంవత్సరం మంచి హిట్స్‌గా నిలిచాయి. అలాంటి వాటిలో ఒకటి ‘ది కేరళ స్టోరీ’. రిలీజ్‌కు ముందే వివాదాలతో హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చి కాంట్రవర్సీలతో పాటు కాసుల వర్షాన్ని కురిపించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించడం గమనార్హం.
‘ది కేరళ స్టోరీ’ థియేటర్లలోకి వచ్చి దాదాపుగా రెండు నెలలు కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. దీనికి ఓ బలమైన కారణం ఉందని నెటిజన్స్ అంటున్నారు. ‘ది కేరళ స్టోరీ’ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను విక్రయించడానికి మేకర్స్ భారీగా డిమాండ్ చేశారట. భారీ మొత్తం ఇస్తే అమ్ముతామని చెప్పడంతో ఓటీటీ సంస్థలు వెనకడుగు వేశాయట. అయితే మొత్తానికి ఓటీటీలోకి వచ్చేందుకు ‘ది కేరళ స్టోరీ’ రెడీ అవుతోందని టాక్. అదా శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమా హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 దక్కించుకుందని సమాచారం. ఈ నెలాఖరు నుంచి ‘ది కేరళ స్టోరీ’ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అటు నిర్మాణ సంస్థ గానీ ఇటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.