iDreamPost
android-app
ios-app

సినిమాలకు సమంత బ్రేక్‌.. అసలు కారణం తెలిసిపోయింది!

సినిమాలకు సమంత బ్రేక్‌.. అసలు కారణం తెలిసిపోయింది!

స్మైలింగ్‌ క్వీన్‌ సమంత సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్నారంటూ మీడియాలో గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా బాధపడుతున్న ఆమె.. చికిత్స కోసం ఓ సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమె ఇప్పటికే తీసుకున్న అడ్వాన్సులను వెనక్కు కూడా ఇచ్చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే, ఈ వార్తల్లో పూర్తి స్థాయిలో వాస్తవం లేదని తేలింది. సమంత బ్రేక్‌కు సంబంధించిన అసలు విషయాలు తాజాగా, బయటకు వచ్చాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సమంత సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్న సంగతి నిజమే. అయితే, అది సంవత్సరం రోజులు కాదు.. కేవలం ఆరు నెలలు మాత్రమే ఆమె సినిమాలకు దూరంగా ఉండనున్నారు. ఈ ఆరు నెలలు కూడా ఆమె అమెరికాలో ఉండనున్నారు. అక్కడే మైయోసైటిస్‌కు చికిత్స తీసుకోనున్నారు. ఇక, ప్రొడ్యూసర్లకు అడ్వాన్సులు తిరిగివ్వటం కూడా అవాస్తవమే. సమంత కమిట్‌ అయిన సినిమాలన్నీ ప్రస్తుతం షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. తెలుగులో ఖుషీ.. తమిళంలో చెన్నై స్టోరీతో పాటు.. హిందీలో సిటడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు.

ఈ మూడింటికి సంబంధించి షూటింగ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ షూటింగ్‌లు పూర్తవగానే.. సమంత అమెరికా వెళ్లిపోనున్నారు. చికిత్స అనంతరం మళ్లీ ఇండియాకు తిరిగిరానున్నారు. వచ్చిన తర్వాత కొత్త సినిమాలకు సైన్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమంతకు మైయోసైటిస్‌ ఉన్నట్లు రెండేళ్ల క్రితం తెలిసింది. ఆ వ్యాధి కారణంగా ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. మానసికంగా, శారీరకంగా చాలా కృంగిపోయారు. నెలల చికిత్స తర్వాత ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నారు. షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే, వ్యాధి పూర్తిగా నయం కాలేదు. ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అమెరికాలో చికిత్స కోసం వెళుతున్నారు.