రజనీ సార్‌ కాపాడండి.. లేదంటే ఆత్మహత్యే శరణ్యం: ప్రముఖ దర్శకుడు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ‘జైలర్‌’ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు జనాలు బాగా ఆకట్టుకున్నాయి. 1957లో చోటు చేసుకున్న వాస్తవ సంఘటలన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జైలర్ సినిమాకు నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. 300 కోట్ల రూపాయలతో ఈ సినిమాను సన్ పిక్చర్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఆగస్టు 10వ తేదీన జైలర్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అదే టైటిల్‌తో మలయాళంలో మరో సినిమా రిలీజ్ కావడం వివాదంగా మారింది. ఈ క్రమంలో రజనీ జైలర్‌ టైటిల్‌ వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లబోతుంది అని.. ఈ విషయంలో రజనీకాంత్‌ స్పందించకపోతే తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ ఆ సినిమా నిర్మాత, దర్శకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ వివరాలు..

రజనీ హీరోగా జైలర్‌ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇదే పేరుతో మలయాళీ దర్శకుడు సక్కిర్‌ మడథిల్‌ కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో, ‘జైలర్‌’ టైటిల్‌ విషయంలో వివాదం రాజుకుని.. అది కాస్త తీవ్ర రూపం దాల్చింది. దీనిపై తాజాగా మలయాళీ చిత్ర దర్శకుడు సక్కిర్‌ మడథిల్‌ స్పందించాడు. తాను డైరెక్ట్‌ చేస్తోన్న సినిమా పేరు కూడా జైలర్‌ అని.. సినిమా బడ్జెట్‌ రూ. 5 కోట్లు అని తెలిపాడు.

తనది చిన్న చిత్రమని కానీ.. ఇదే టైటిల్‌తో.. రజనీకాంత్‌ హీరోగా పెద్ద బడ్జెట్‌తో జైలర్‌ సినిమా తెరకెక్కుతుంది అని తెలిపాడు. రజనీ సినిమా వల్ల తాను భారీగా నష్టపోతానని వెల్లడించాడు. హీరో రజనీకాంత్‌ అంటే తనకెంతో ఇష్టమని ఆయన చెప్పారు. ఈ సినిమాపైనే తన జీవితం ఆధారపడి ఉందని.. ఈ విషయంలో రజనీ స్పందించాలని కోరాడు సక్కిర్‌ మడథిల్‌.

2021 ప్రారంభంలోనే తాను జైలర్‌ అనే టైటిల్‌ను రిజిస్టర్‌ చేపించానని సక్కిర్‌ మడథిల్‌ తెలిపాడు. కానీ కొద్దిరోజుల తర్వాత రజనీ-నెల్సన్‌ కూడా ఇదే టైటిల్‌తో పోస్టర్‌ రిలీజ్‌ చేశారని.. అప్పుడే తనకు అసలు విషయం తెలిసిందని మలయాళ దర్శకుడు చెప్పుకొచ్చాడు. విషయం తెలిసిన వెంటనే తాను.. టైటిల్‌ మార్చుకోమని సన్‌ పిక్చర్స్‌ను కోరానని.. దీనిపై ఇప్పటికే పలు మార్లు వారిని అభ్యర్థించానని.. అయినా ఫలితం లేదని చెప్పుకొచ్చాడు. కనీసం కేరళలో అయినా రజనీ జైలర్‌ సినిమా టైటిల్‌ను మార్చి విడుదల చేయాలని ఆయన కోరుతున్నాడు.

ఈ సినిమా కోసం నా కుమార్తె నగలు తాకట్టు పెట్టా: సక్కిర్‌ మడథిల్‌

‘‘నేనే నిర్మాతగా మారి.. తక్కువ బడ్జెట్‌లో చిన్న సినిమా తీశాం. దీని కోసం సుమారు రూ.5 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ మొత్తాన్ని సమకూర్చుకోవడం కోసం నా కుమార్తె నగలు, ఇల్లు కూడా బ్యాంకులో తాకట్టు పెట్టానుఘారు కూడా అమ్ముకున్నాను. అయినా డబ్బులు సరిపోలేదు. దాంతో త్వరగా చెల్లించవచ్చని ఎక్కువ వడ్డీకి బయట నుంచి అప్పులు తీసుకువచ్చి ఈ సినిమాను నిర్మించాను. కానీ అనుకోకుండా ఈ టైటిల్‌ క్లాష్‌ వివాదం వచ్చింది. దాంతో ఒక్కో సారి నాకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వస్తోంది. కనీసం రజనీకాంత్ సార్‌ అయినా నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సక్కిర్‌ తెరకెక్కించిన ‘జైలర్‌’ సెప్టెంబర్‌లో కేరళలో విడుదల కానుంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై సన్‌ పిక్చర్స్‌ ఎలా స్పందిస్తుందో తేలాల్సి ఉంది.

Show comments