రూ. 252 కోట్ల అప్పులే నితిన్ దేశాయ్ ప్రాణం తీశాయా?

  • Author ajaykrishna Published - 10:03 AM, Thu - 3 August 23
  • Author ajaykrishna Published - 10:03 AM, Thu - 3 August 23
రూ. 252 కోట్ల అప్పులే నితిన్ దేశాయ్ ప్రాణం తీశాయా?

పాపులర్ బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ అకాల మరణం.. సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న తన సొంత స్టూడియోలో నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టూడియో క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది అతని గది వద్దకు వెళ్లగా.. ఆయన మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. నితిన్ దేశాయ్ మరణం వెనుక కారణాలు ఏంటని తెలుసుకునే విధంగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే స్పష్టం చేశారు.

ఇక తాజా నివేదికల ప్రకారం.. నితిన్ దేశాయ్ మరణానికి సంబంధించి కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఆయనకు సుమారు రూ. 252 కోట్లు అప్పులు ఉన్నాయని.. ఆర్థికంగా ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నితిన్ దేశాయ్ పలు ఆర్థిక సంస్థల నుండి ఫిక్స్‌డ్ టర్మ్ లోన్ తీసుకున్నాడట. అదే అతన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిందని అంటున్నారు. దాదాపు రూ. 180 కోట్ల అప్పులు.. వడ్డీతో కలిపి రూ.252 కోట్లకు చేరిందట. ఈ విషయమై సదరు ఆర్థిక సంస్థ.. తన స్టూడియోని సీజ్ చేయడానికి రెడీ అయ్యిందట. ఎడెల్వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ రాయగడ కలెక్టరేట్‌ కు దరఖాస్తు చేసింది.

ఆ తర్వాత ఎన్‌.డి స్టూడియో సీజ్‌ కు సంబంధించి దరఖాస్తు తన వద్దకు చేరిందని రాయగడ రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ సందేశ్ షిర్కే చెప్పారు. జూలై 25న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ కార్పొరేట్.. దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని ఎడెల్వీస్ అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ అంగీకరించింది. 2022 జూన్ 30 నాటికి మొత్తం రూ. 252.48 కోట్లుగా తేలింది. నితిన్ దేశాయ్.. సీఎఫ్‌ఎం అనే ఆర్థిక సంస్థ నుండి రూ.180 కోట్ల అప్పు తీసుకున్నారు. 2 ఏళ్ళ ఒప్పందం ప్రకారం.. 2016, 2018లో 40 ఎకరాల భూమి, 3 వేర్వేరు ఆస్తులను తనఖా పెట్టాడు. 2020 నుండి అనుకోని కారణాల వలన అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు. కొన్నాళ్ళకు అప్పు ఇచ్చిన సిఎఫ్ఎం సంస్థ.. నితిన్ దేశాయ్ ఖాతాలన్నీ ఎడెల్వీస్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. అప్పటికి అప్పులు తీర్చే పరిస్థితి లేక.. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అలా చివరికి వేరే దారి లేక నితిన్ దేశాయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

Show comments