Dharani
Dharani
కేంద్ర ప్రభుత్వం సరికొత్త స్కీమ్‌ని ప్రకటించింది. దీనిలో భాగంగా విజేతలు ఏకంగా కోటి రూపాయల వరకు క్యాష్ ప్రైజ్ పొందే అవకాశం లభించనుంది. అంత భారీ మొత్తంలో ప్రైజ్ మనీ అంటే.. ఏం చేయాలి.. ఏమైనా పోటీనా అని ఆలోచిస్తున్నారా.. అలాంటివి ఏం కాదు. కేవలం మీరు షాపింగ్ చేశాక తీసుకున్న బిల్లులను మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు. మీరే ఏకంగా రూ. 10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు క్యాష్ ప్రైజ్ అందుకోవచ్చు. అతి త్వరలో ఈ యాప్‌ను లాంఛ్ చేయనుంది కేంద్రం. మరి ఇంతకు ఈ కొత్త పథకం పేరు ఏంటి.. ఎందుకు కేంద్రం దీన్ని తీసుకువచ్చింది అంటే..
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ‘‘మేరా బిల్ మేరా అధికార్’’ పేరుతో ఈ స్కీమ్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్‌వాయిస్ ప్రోత్సాహక పథకం కింద ఈ యాప్‌లో రిటైలర్, వ్యాపారుల నుంచి స్వీకరించిన జీఎస్‌టీ ఇన్వాయిస్ బిల్లును అప్‌లోడ్ చేసిన వ్యక్తుల నుంచి లక్కీ డ్రా ద్వారా కొందరు వినియోగదారులకు నెలవారీగా లేదా త్రైమాసికంగా రూ. 10 లక్షల నుండి రూ. 1 కోటి వరకు నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు ఈ అంశానికి సంబంధించిన ఇద్దరు అధికారులు తెలిపారు. మేరా బిల్ మేరా అధికార్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో అందుబాటులో ఉండనుందని వెల్లడించారు. అయితే వినియోగదారులు తాము అప్లోడ్ చేసే ఇన్వాయిస్‌లో జీఎస్‌టీ ఐఎన్ నంబర్ కచ్చితంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
ఈ యాప్ వినియోగంలోకి వచ్చాక.. వినియోగదారులు దీనిలో నెలకు 25 బిల్లుల వరకు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే బిల్లు విలువ కనీసం రూ. 200 అయినా ఉండాలి. యాప్‌లో బిల్లులు అప్‌లోడ్ చేసిన వారి నుంచి.. కంప్యూటర్ ఆధారితంగా లక్కీ డ్రా తీసి 500 వినియోగదారులకు క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి నెల, 3 నెలల్లో రెండు సార్లు ఈ లక్కీ డ్రాను తీయనున్నారని తెలిపారు. గెలిచిన వారికి నగదు బహుమతిగా రూ. 10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుందన్నారు. అతి త్వరలోనే కేంద్రం ఈ యాప్‌ని లాంచ్ చేయబోతుందని.. ఆగస్ట్ నెలాఖరు వరకు ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
జీఎస్టీ ఎగవేతను అరికట్టేందుకు కేంద్రం కఠిన నింబధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసింది. వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లు దాటిన వ్యాపారాలకు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ తప్పనిసరి చేస్తూ ఆగస్టు 1 నుంచే కొత్త రూల్స్ అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక మేరా బిల్ మేరా యాప్ ద్వారా.. వ్యాపారులు ఇక మీదట జీఎస్‌టీ ఎగ్గొట్టకుండా చూసేలా.. దీనిలో సామాన్యులను కూడా భాగం చేస్తోంది. రివార్డు ప్రైజ్ కోసం కస్టమర్లు కచ్చితంగా వ్యాపారుల నుంచి ఇన్వాయిస్ తీసుకుంటారని.. ఒకవేళ బిల్లు ఇవ్వకపోతే నిలదీస్తారని భావిస్తోంది. దీంతో జీఎస్‌టీ ఎగవేతలను తగ్గించే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.