ముగిసిన నారా లోకేశ్ CID విచారణ.. మళ్లీ విచారణకు రావాలంటూ నోటీసులు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు వ్యవహారంలో చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ మళ్లీ షాక్ ఇచ్చింది. మరో సారి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది సీఐడీ. రేపు అనగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో లోకేశ్ ను కోరింది. ఐఆర్ఆర్ కేసులో భాగంగా ఏపీ సీఐడీ నారా లోకేష్ ను నేడు విచారించింది. ఆరు గంటప పాటు ఈ విచారణ కొనసాగింది. కాగా సీఐడీ జరిపిన విచారణలో నారా లోకేశ్ విచారణకు సహకరించకపోవడంతో సీఐడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మరింత సమాచారం కోసం మరో సారి హాజరు కావాలంటూ సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది.

కాగా నేడు నారా లోకేశ్ ను ఏపీ సీఐడీ జరిపిన విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి అధికారులు సుమారు 50 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. లోకేశ్ ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దాటవేసే ధోరణి కనబర్చినట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు లోకేశ్ తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కీలక అంశాలకు సంబంధించి పొంతన లేని సమాధానాలతో విచారణకు పూర్తి స్థాయిలో సహకరించనట్లు తెలుస్తోంది. సీఐడీ వేసిన ప్రశ్నలకు నారా లోకేశ్ నీళ్లు నమిలినట్లు సమాచారం. అమరావతిలో హెరిటేజ్ భూముల కొనుగోలు, హెరిటేజ్ బోర్డ్ మీటింగ్ నిర్ణయాలపై లోకేశ్ ను ప్రశ్నించగా తనకు తెలియదనే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఐడీ నారా లోకేశ్ కు మళ్లీ నోటీసులు జారీ చేసింది.

టీడీపీ ప్రభుత్వంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చి భారీ కుంభకోణానికి పాల్పడారని సీఐడీ ఆరోపిస్తుంది. చంద్రబాబుతో కలిసి అప్పటి మంత్రులు పి. నారాయణ, లోకేశ్ ఈ స్కాంకి పాల్పడ్డారని సీఐడీ తెలిపింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చి.. భారీగా లాభ పడ్డారని కోర్టుకు దాఖలు చేసిన మెమోలో సీఐడీ పేర్కొంది. ఈక్రమంలోనే నారా లోకేశ్ ను ఏ-14 నిందితుడిగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. ఇటీవలే కోర్టు ఆదేశాలతో ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు విచారణకు రావాలంటూ లోకేశ్ ను కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం నారా లోకేశ్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి హాజరయ్యరు.

Show comments