iDreamPost

అదే జ‌గ‌న్ పీఏ అయితే?

అదే జ‌గ‌న్ పీఏ అయితే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మీడియా రెండుగా చీలిపోయింది. జ‌గ‌న్‌కి అనుకూలంగా సాక్షి (సొంత పేప‌ర్ కాబ‌ట్టి అనుకూలంగా అనే ప‌దం కూడా క‌రెక్ట్ కాదేమో!) , జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు. వీళ్లు ఎవ‌రికి వాళ్లు ప్ర‌జాప‌క్షం అనుకుంటారు కానీ, ఎవ‌రి ప్ర‌జ‌లు వాళ్ల‌కు ఉంటారు.

చంద్ర‌బాబు పీఏ ఇంటిపై ఐటీ దాడులు జ‌రిగాయి. సాక్షిలో రావాల్సిన వార్త‌లు సాక్షిలో వ‌చ్చాయి. అస‌లు దీనికి చంద్ర‌బాబుకి ఏం సంబంధ‌మ‌ని ఆంధ్ర‌జ్యోతిలో రాశారు. జ‌గ‌న్ త‌న కోసం పెట్టుకున్న ప‌త్రిక కాబ‌ట్టి సాక్షిలో అలాగే రాస్తార‌ని అనుకుందాం.

మ‌రి జ్యోతి, ఈనాడు రాజ‌కీయాల‌కి అతీతంగా, విలువ‌ల‌కి క‌ట్టుబ‌డి, జ‌ర్న‌లిజం ప్ర‌యోజ‌నాల‌ని కాపాడే ప‌త్రిక‌లు క‌దా, పాఠ‌కులు అనుకున్నా అనుకోక‌పోయినా ఆ ప‌త్రిక‌ల య‌జ‌మానులు అలాగే అనుకుంటున్నారు, లేదా న‌మ్మిస్తున్నారు. మ‌రి ఆ శ్రీ‌నివాసులు ఎవ‌రు, చంద్ర‌బాబు పీఏగా ఎంత సంపాదించాడు, ఇవేమీ రాయ‌లేదు ఎందుకు?

ఎవ‌డో బ‌క‌రా ప‌దివేలు లంచం తీసుకుంటే “రెవెన్యూలో తిమింగ‌లం” అని హెడ్డింగ్ పెట్టి వాడి బ‌యోడేటా అంతా బ‌జారున పెడ‌తారు క‌దా, మ‌రి ఈ శ్రీ‌నివాసులు బ‌యోడేటా ఏంటి?

అదే ఖ‌ర్మ‌గాలి జ‌గ‌న్ పీఏ మీద ఐటీ దాడులు జ‌రిగి ఉంటే వ‌రుస క‌థ‌నాలు వ‌చ్చేవి కాదా? అత‌ని జీవిత చ‌రిత్ర మొత్తం అచ్చులో చూపించేవారు కాదా? పీఏ ఇంత తింటే , ఇక జ‌గ‌న్ ఎంత‌? “అమ్మ జ‌గ‌న్ పీఏ” అని వ్యంగ్య హెడ్డింగ్‌లు పాఠ‌కులు చూసేవాళ్లు కాదా?

చంద్ర‌బాబు పీఏ కావ‌డంతో జ‌ర్న‌లిజం నిద్ర‌పోతోందా? జ‌ర్న‌లిజం స్కూళ్ల‌లో విద్యార్థుల‌కు “స‌త్యం కోసం నిల‌బ‌డాలి, పోరాడాలి” అని బోధ‌న‌లు చేయిస్తారు క‌దా!

మ‌రి స‌త్యం అంటే, ఎవ‌రికి అనుకూలంగా ఉంటే అదే స‌త్య‌మా?

మ‌న‌కు న‌చ్చితే నిప్ప‌లాంటి నిజం.

న‌చ్చ‌క‌పోతే బూడిదా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి