iDreamPost

రాష్ట్రానికి మళ్లీ వర్షం ముప్పు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్! రాబోయే వారం రోజులు..!

  • Author singhj Published - 07:52 AM, Sat - 5 August 23
  • Author singhj Published - 07:52 AM, Sat - 5 August 23
రాష్ట్రానికి మళ్లీ వర్షం ముప్పు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్! రాబోయే వారం రోజులు..!

వాన ముసురు తెలంగాణను వీడటం లేదు. ఇటీవల పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రాజధాని హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వానలకు ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కొన్ని రోజులు స్కూళ్లు, ఆఫీసులకు తాళాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిటీలో ట్రాఫిక్​ జామ్స్​తో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వరదలకు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఎట్టకేలకు భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రజా జీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్న వేళ మరోమారు వాతావరణ శాఖ తెలంగాణకు వర్షం హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. ఈ తీవ్రవాయుగుండం తీరం దాటిందని తెలిపారు. రుతుపవనాలు బలపడటంతో రాష్ట్రంలో మరోమారు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. నేడు (ఆగస్టు 5న) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ హైదరాబాద్ శాఖ పేర్కొంది. రుతుపవనాల ఎఫెక్ట్​తో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్​లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది.

రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్​గిరి, రంగారెడ్డి, ములుగు, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి