iDreamPost

దేశంపైనే కుంభ‌వృష్టి, తెలంగాణ‌లో రెడ్ అలెర్ట్

దేశంపైనే కుంభ‌వృష్టి, తెలంగాణ‌లో రెడ్ అలెర్ట్

దేశంపైనే కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, మ‌హారాష్ట్ర‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అవ‌స‌ర‌మైతే త‌ప్ప బైట‌కు రావ‌ద్ద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అల‌ర్ట్ జారీ చేసింది. ఆంధ్ర‌లో చాలాచోట్ల రాత్రంత వ‌ర్షం కురిసింది. మ‌ళ్లీ సాయంత్రానికి భారీ వ‌ర్షాలు కురుస్తాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు భారీ వ‌ర్షాల‌ను త‌ట్టుకోవ‌డానికి విప‌త్తు నివార‌ణ సంస్థ‌ల‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నాయి.

ఇక‌, మహారాష్ట్రలో కనీసం 130 గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. 128 గ్రామాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. అందుకే మహారాష్ట్రతోపాటు కర్ణాటక, తెలంగాణలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో మ‌రో ఐదురోజులు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.
తెలంగాణ, కోస్తా ఆంధ్ర, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. ఇక‌, ఒడిశా, గోవా, మరఠ్వాడా, సెంట్రల్ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ మరియు కర్ణాటక,ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ల్లో గ‌ట్టిగా వ‌ర్షాలు ప‌డ్డాయి.

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ అంత‌టా, విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. చెరువులు, చిన్న ప్రాజెక్టులు నిండిపోయాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో 20.6 సెంటీమీటర్లు, నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో 19.1, భైంసాలో 16.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వ‌చ్చే మూడు రోజులు భారీ వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి