iDreamPost

సస్పెన్షన్ మీద స్టే ఇవ్వలేము.. తేల్చేసిన తెలంగాణ హైకోర్టు..

సస్పెన్షన్ మీద స్టే ఇవ్వలేము.. తేల్చేసిన తెలంగాణ హైకోర్టు..

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 7న ప్రారంభంకాగా, అదేరోజు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కూడా. అయితే బడ్జెట్ ప్రసంగానికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంగా బీజేపీ ఎమ్మెల్యేలయిన రాజాసింగ్, రఘునందన్‌ రావు, ఈటెల రాజేందర్‌ లను బడ్జెట్ సెషన్‌ మొత్తం సస్పెండ్ చేయాలని మంత్రి తలసాని సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టడంతో వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సభ నుంచి సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వులను వెంటనే కొట్టేసి, తాము అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. అంతేకాక సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. అయితే సస్పెన్షన్ జరిగినప్పటినుంచి హైకోర్టులో ఎలా అయినా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్న వారికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ వాదనలు ముగిసిన తర్వాత, ఇరు పక్షాల వాదనాలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసి శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేయాలనే అంశంపై హైకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సస్పెన్షన్ మీద స్టే ఇవ్వడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. స‌స్పెన్ష‌న్‌పై స్టే విధించేందుకు నిరాక‌రించిన కోర్టు త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల‌కు వాయిదా వేసింది. అయితే ఈ విషయం మీద సోషల్ మీడియాలో పలు రకాల సెటైర్లు కనిపిస్తున్నాయి. ఇదే మరో రాష్ట్రంలో అయితే పరిస్థితి వేరేగా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి