iDreamPost

సీఎం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ : ప్ర‌ధాని వ‌ద్ద‌కు తెలంగాణ పంచాయితీ

సీఎం వ‌ర్సెస్ గ‌వ‌ర్న‌ర్ : ప్ర‌ధాని వ‌ద్ద‌కు తెలంగాణ పంచాయితీ

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే తెలంగాణలో అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించారు. ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రి ప్రారంభోత్స‌వానికి కూడా ఆమెకు ఆహ్వానం లేదు. అలాగే.. రాజ్ భ‌వ‌న్ లో ఉగాది సంబరాల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి, మంత్రులకు ఆహ్వానాలు అందినా ఒక్క‌రూ హాజ‌రుకాలేదు. బీజేపీ అన్నా, కేంద్ర ప్ర‌భుత్వం అన్నా భ‌గ్గ‌మంటున్న టీఆర్ఎస్ స‌ర్కారు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైకి కూడా దూరంగా ఉంటోంది. ఈ ప‌రిణామాల‌తో గ‌వ‌ర్న‌ర్ కినుక వ‌హించారు. ప‌లు సంద‌ర్భాల్లో త‌న అసంతృప్తిని, ఆగ్ర‌హాన్ని వెలిబుచ్చారు. ఇప్పుడు నేరుగా హ‌స్తిన‌కు చేరి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దృష్టికి రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ప‌లు అంశాల‌పై ఫిర్యాదు చేశారు.

మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సైల మధ్య జరుగుతున్న వివాదం హస్తినకు చేరింది. నేడు ప్రధాని మోడీని తెలంగాణ గవర్నర్ తమిళిసై కలిశారు. ఇటీవల గవర్నర్ ప్రసంగం లేకుండానే.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.అనేక విషయాల్లో అసలు తనను పట్టించుకోలేదని తమిళిసై వివరించారు. అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ..

‘‘వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపా. పుదుచ్చేరి-తెలంగాణ మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరాను. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు.. ఫ్రెండ్లీ గవర్నర్‌ను. నేను రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటా. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు ప్రధానిని కలవలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరా. నాపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోంది. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు. గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు అని ఆరోపించారు.

తెలంగాణలో ప్రోటోకాల్ వివాదంపై కూడా ప్రధానికి ఫిర్యాదు చేశారు. ‘‘ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉంది. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలి. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలి.’’ అని పేర్కొన్నారు. కొద్దికాలంగా రాష్ట్ర ప్ర‌భుత్వతీరుపై గ‌వ‌ర్న‌ర్ ఆక్షేప‌ణ వ్య‌క్తం చేస్తున్నారు.మీడియా ముఖంగా కూడా త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఉగాది సంబ‌రాల‌కు ప్ర‌జాప్ర‌తినిధులే కాకుండా.. చివ‌ర‌కు ఉన్న‌తాధికారులు కూడా హాజ‌రుకాలేదు. దీనిపై త‌మిళి సై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఇప్పుడు నేరుగా మోడీని క‌లిసి రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను ప్రోటోకాల్ వివాదాల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి