iDreamPost

Sai Chand: తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతి!

Sai Chand: తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ మృతి!

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం ఎంత కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలుసు. అలాంటి ఉద్యమాలకు ఊపిరిపోసింది పాటలు, ఉద్యమ గాయకులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి గాయకుల్లో సాయిచంద్ కూడా ఒకరు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గుర్రంగూడ సాయిచంద్ మృతిచెందారు. 39 ఏళ్ల అతి చిన్న వయసులోనే గుండెపోటుతో సాయిచంద్ మరణించడం రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని ఫామ్ హౌస్ లో సాయిచంద్ తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్ హౌస్ కి వెళ్లిన సాయి చంద్.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సాయి చంద్ ను కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సాయిచంద్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఉద్యమ కళాకారుడిగా, రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన సాయిచంద్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది.

విద్యార్థిగా ఉన్న సమయం నుంచే సాయిచంద్ గాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సాధించారు. పలు జానపద పాటల కార్యక్రమాల్లో కూడా సాయిచంద్ అలరించారు. ఉద్యమ సమయంలో తన పాటలతో స్ఫూర్తిని రగిలించారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా, సభ ఉన్న ఉన్నా సాయిచంద్ పాట వినిపించాల్సిందే. అలాంటి సాయిచంద్ గొంతు మూగబోయిందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు సహా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి