iDreamPost

డేంజర్ లో టీమిండియా.. మరో శ్రీలంక, వెస్టిండీస్ అయ్యే ప్రమాదం?

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో శ్రీలంక, వెస్టిండీస్ జట్ల పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక వెలుగు వెలిగిన టీమ్స్ ఇప్పుడు లెక్కలో కూడా లేకుండా పోయాయి. అలాంటి ఒక ప్రమాదం ఇప్పుడు టీమిండియాకి పొంచి ఉంది.

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో శ్రీలంక, వెస్టిండీస్ జట్ల పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక వెలుగు వెలిగిన టీమ్స్ ఇప్పుడు లెక్కలో కూడా లేకుండా పోయాయి. అలాంటి ఒక ప్రమాదం ఇప్పుడు టీమిండియాకి పొంచి ఉంది.

డేంజర్ లో టీమిండియా.. మరో శ్రీలంక, వెస్టిండీస్ అయ్యే ప్రమాదం?

వరల్డ్ కప్ 2023 ఆఖరి అడుగులో టీమిండియా తడబడింది. అయితే ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ దేశమే టీమిండియా వైపు నిలబడింది. అయితే ఈ ఒక్క టోర్నీలో ఆఖరి మ్యాచ్ లో భారత జట్టు తడబడితే తప్పేం కాదు. ఒక్క వరల్డ్ కప్ ఫైనల్లో ఓడినంత మాత్రాన జట్టును తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడు టీమిండియా విషయంలో కొత్త భయాలు నెలకొన్నాయి. మరో శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మాదిరి టీమిండియా మారబోయే ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మీరు గమనించారా?

క్రికెట్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పెరుగుతోంది. ఈ ఆటకు ఇంత ప్రాచుర్యం రావడానికి కృషి చేసిన జట్లలో కచ్చితంగా వెస్టిండీస్, శ్రీలంక జట్లు ఉంటాయి. కానీ, ఇప్పుడు ఆ టీమ్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మైదానంలో వెస్టిండీస్ ఆటగాళ్లను చూసి భయపడే పరిస్థితుల నుంచి.. అసలు ఆ జట్టు ప్రపంచకప్ 2023కు క్వాలిఫై కూడా కాలేని పరిస్థితికి వచ్చింది. ఇంక శ్రీలంక విషయానికి వస్తే.. పేరుకు వరల్డ్ కప్ 2023లో పాల్గొన్నా కూడా గ్రూప్ స్టేజ్ లో ఆఖరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ జట్లకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చాలామంది ఆలోచించకపోవచ్చు. కానీ, అందుకు సింపుల్ గా ఒక సమాధానం చెప్పచ్చు. జట్టులో సీనియర్లు లేకపోవడం. అవును.. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ ఇలాంటి ఘోర పరిస్థితిలో ఉండటానికి కారణం జట్టులో ఎలాంటి సీనియర్స్ లేకపోవడమే.

ఒకప్పుడు శ్రీలంక జట్టును చూస్తే.. జయసూర్య, మహేళ జయవర్దనే, కుమార్ సంగక్కర, దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్, మలింగా, కులశేఖర.. ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఉండేవాళ్లు. టీ20, వన్డే, టెస్టు ఏ ఫార్మాట్ అయినా కూడా శ్రీలంక జట్టు అంటే భయపడే పరిస్థితి ఉండేది. అయితే ఆ తర్వాత సీనియర్లు అందరూ జట్టును వీడటం, ఆ బోర్డు కూడా సీనియర్లు ఉన్నప్పుడే జూనియర్లను సిద్ధం చేయడంపై దృష్టి సారించకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే ఇప్పుడున్న శ్రీలంక జట్టును తక్కువ చేయాల్సిన అవసరం లేదు. టీమ్ లో టాలెంటెడ్ ఆటగాళ్లు లేరా అంటే? నిస్సంక, కుశల్ పెరేర, కుశల్ మెండిస్, తీక్షణ, మదుశనక వంటి కావాల్సినంత మంది టాలెంటెడ్ యంగ్ స్టర్స్ ఉన్నారు. కానీ, వారిని గైడ్ చేసేందుకు జట్టులో ఒక్క సీనియర్ ఆటగాడు కూడా లేడు. అదే శ్రీలంక టీమ్ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేలా చేసింది.

ఇంక వెస్టిండీస్ సంగతి చూస్తే.. ఆ జట్టులో ఎంతో మంచి ప్లేయర్స్ ఉన్నారు. అత్భుతమైన షాట్స్ తో రెచ్చిపోయే హెట్ మేయర్స్, పూరన్, షాయ్ హోప్, జేసన్ హోల్డర్, బ్రాత్ వైట్, రోవ్మన్ పోవెల్.. ఇలా మంచి ప్లేయర్స్ మన ఐపీఎల్ లో ఎంతో బాగా రాణిస్తున్నారు. కానీ, ఒక జట్టుగా మాత్రం విజయాలు సాధించలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం జట్టులో ఒక సీనియర్ ఆటగాడు లేకపోవడమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే టీమిండియాలో కనిపిస్తోంది. జట్టులో ఉన్న సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీళ్లు జట్టులోకి వచ్చినప్పుడు విరాట్ కోహ్లీ.. సచిన్ టెండుల్కర్ ను చూసి తనని తాను మార్చుకున్నాడు. రోహిత్ శర్మ.. కెప్టెన్ ధోనీని చూసి ఇప్పుడు ఒక గొప్ప కెప్టెన్ అయ్యాడు. వీళ్లకి సీనియర్స్ ను చూసి తమ ఆటను మలుచుకునే అవకాశం దక్కింది.

ప్రస్తుతం టీమిండియాలో యంగ్ స్టర్స్ కు ఢోకా లేదు. ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్ ఇలా ఎంతో మంది టాలెంట్ కలిగిన కుర్రాళ్లు ఉన్నారు. కానీ.. రోహిత్, కోహ్లీలాంటి సీనియర్లు గనుక జట్టుకు దూరమైతే వాళ్లు ఎవరిని చూసి ఆటను మెరుగుపరుచుకోవాలి? హెడ్ కోచ్, స్టాఫ్ ఎంతమంది ఉన్నా కూడా.. మైదానంలో ఒక సీనియర్ ఉండి కర్రాళ్లను సమన్వయ పరుస్తూ ఉండాలి. ఒత్తిడిలోకి వెళ్లకుండా వారిని గైడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గనుక టీమిండియా నుంచి రోహిత్, కోహ్లీ తప్పుకున్నా.. బీసీసీఐ వారిని దూరం పెట్టినా కూడా.. మన జట్టు పరిస్థితి శ్రీలంక, వెస్టిండీస్ టీమ్స్ మాదిరి మారే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రోహిత్, కోహ్లీ విషయంలో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుని.. వారిని జట్టులో కొనసాగాలే చూడాలంటూ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి.. కోహ్లీ, రోహిత్ తప్పుకుంటే టీమిండియాకి ప్రమాదమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి