iDreamPost

ఢిల్లీ.. ఢిల్లీ.. జగన్‌.. జగన్‌…

ఢిల్లీ.. ఢిల్లీ.. జగన్‌.. జగన్‌…

గా..గా.. గాడ్జి… గాడ్జిల్లా.. గాడ్జిల్లా.. అంటూ దాదాపు తొంభయ్యేళ్ళకు పైగా వయస్సు ఉన్న వృద్ధుడు ఆసుపత్రి బెడ్‌మీద పడుకుని ఉలిక్కిపడుతూ పలవరింతలు పలకే సీన్‌ ఒకటి ఉంటుంది. 1998లో వచ్చిన గాడ్జిల్లా సినిమాలో టైటిల్స్‌ ముందు వచ్చే సీన్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తుంది.

సరిగ్గా తెలుగుదేశం పార్టీ నాయకులను చూస్తుంటే ఈ సీనే గుర్తుకొస్తోందిప్పుడు. ఢిల్లీ.. ఢిల్లీ.. జగన్‌.. జగన్‌.. వెళుతున్నాడు.. అంటూ మైకుముందుకొచ్చి పలవరింతలు పలుకుతున్న సీన్స్‌ ప్రస్తుతం పచ్చపాత టీవీ తెరలు, ప్రింట్‌మీడియా హెడ్‌లైన్స్‌లో హోరెత్తిపోతున్నాయి. ఆ సినిమాలోనంటే వృద్ధుడు గాడ్జిల్లాను చూసి జడుసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం పలవరింతలు పడ్డాడు. కానీ ఇక్కడ ఏపీలో టీడీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారన్న సందేహం ఉభయతెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు బలంగాపూ ఏర్పడుతోంది.

ముఖ్యమంత్రి అన్నాక కేంద్రంతో పనులు ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రధానితో భేటీ అవుతుంటారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఇదే విధంగా ఢిల్లీకి వెళ్ళొస్తుండేవారు. కానీ ఇంతకు ముందెన్నడే ఏ ప్రతిపక్షమూ లేవనెత్తనన్ని అనుమానాలను మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలకు పుట్టుకొచ్చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి సయోధ్య కుదరకుండా ఎప్పుడూ వివాదాలతోనే నడవాలన్నది వీరి ఉద్దేశమా అన్న అనుమానాలు కూడా జనంలో లేకపోలేదు. లేకపోతే మేం దగ్గరవుదామనుకుంటుంటే.. ప్రధానిని అస్సలు ఖాళీ ఉండనీయడం లేదన్న దుగ్దే కారణమా అని కూడా అనుకోవాల్సి వస్తుందంటున్నారు.

అసలే అధికారంలో ఉండగా చేసిన దిశానిర్దేశం లేని పనులతో లాక్కోలేక, పీక్కోలేక రాష్ట్రం కునారిల్లిపోతోంది. ఆకాశమంతెత్తు ప్రచారం చేసుకున్న అణువంత కూడా పోలవరం గానీ, అమరావతి గానీ పూర్తి చేసింది లేదు. కానీ ఇందుకోసం కేంద్రం కేటాయించిన నిధులు మాత్రం పప్పుబెల్లాల్లా తెచ్చుకు వాడేసుకున్నారు. కేంద్రానికి బిల్లులు కూడా చూపించలేదని అధికార వైఎస్సార్‌సీపీ అవకాశం దొరికినప్పుడల్లా అప్పట్లో వారు చేసిన ఘనకార్యాలను ఎద్దేవా చేస్తూనే ఉంది. దీనికి సమాధానం మాత్రం చెప్పకుండా ప్రతిపక్షం దాటవేస్తూనే ఉంది. దీనికి తోడు ప్రారంభించిన ప్రతి పనిలోనూ అంతులేని అవినీతి. వీటిని దర్యాప్తు చేయడానికి ప్రత్యేక సంస్థలు, కోర్టులు ఉండాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.

ఇన్ని డొల్లలు తమ క్రింద పెట్టుకుని, ఇప్పుడు అధికారంలో ఉన్న సీయం ప్రధాని వద్దకెళితే వీళ్ళెందుకు ఉలిక్కిపడుతున్నారన్న చర్చ ప్రజల్లో జోరుగానే సాగుతోంది. తప్పుచేసి బైటతిరిగేవాడికి ఎవర్ని చూసినా తన తప్పుగురించి తెలిసిపోయిందేమోనన్న ఫీలింగ్‌ కలగడం సహజం. అదే రీతిలో ఢిల్లీ నుంచి దర్యాప్తు మొదలైతే తమ తప్పులెక్కడ బైటపడతాయోన్న బెంగతో కూడిన భయం వల్ల వచ్చిన ఆందోళనతోనే సదరు నాయకులు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నట్టు ప్రజలు ఖరారు చేస్తున్నారు. అందుకే ఢిలీ.. జగన్‌… ఢిల్లీ.. జగన్‌ అంటూ ప్రతిపక్షపార్టీ నేతల పలవరింతలంటున్నారు.

ఏమో టీడీపీ నాయకులు బలంగా అనుమానిస్తున్నట్టు కేంద్రం నుంచి దర్యాప్తు వచ్చేస్తే వీరి ఆందోళనలకు ఒక సార్ధకత చేకూరుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి