iDreamPost

ఇస్తానంటే.. వద్దంటున్నారా.. యువత దూరం

ఇస్తానంటే.. వద్దంటున్నారా.. యువత దూరం

పార్టీ అధికారంలో లేకపోతే ఆ పార్టీ పదవి గుదిబండతోనే సమానం అంటారు తలపండిన రాజకీయ నాయకులు. ఫోర్సులేని పదవిలోకొచ్చినా తమ వ్యక్తిగత పనులు, వ్యాపారాలు తదితర కార్యకలాపాలకు విఘాతం తప్పదన్నది వారి భావన అయ్యుండొచ్చు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటేందనే చెప్పాలి. మంచి టైమ్‌లో పదవులు అనుభవించిన వాళ్ళంతా ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ బరువును మోయాల్సిన పూర్తి బాధ్యత చంద్రబాబుమీదే పడిపోయింది. దీంతో ప్రక్షాళన మొదలు పెట్టి, ఒకొక్కటి సర్దుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ తెలుగుయువత అధ్యక్ష పదవికి తగిన వాడ్ని ఎంపిక చేయడానికి నానా తంటాలు పడుతున్నారని రాజకీయవర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

ఈ పదవిపై పనెక్కువ ప్రయోజనం తక్కువ అన్న భావన ఉండడంతో పాటు, ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి బరువును మోసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన యువ నేతకు ఇస్తామన్నా తనకు వద్దంటున్నాడట. అలాగే ఉత్తరాంధ్ర యువ నేతకిచ్చేందుకు అభ్యంతరాలున్నాయట. ఇంకా ఇద్దరు ముగ్గురి పేర్లు పరిశీలించినప్పటికీ ఎవరికి వారే తమకు వద్దనడమో, వాళ్ళకిచ్చేందుకు ఇతరులకు అభ్యంతరాలు ఉండడమో జరుగుతోందంటున్నారు.

ప్రస్తుతం ప్రజల్లోకి పార్టీని వేగంగా తీసుకువెళ్ళడంలో యువతదే కీలక పాత్ర. అయితే సదరు యువ విభాగానికి సరైన అధ్యక్షుడు లేకపోతే పరిస్థితి ఏంటన్న మీమాంశలో టీడీపీ అధిష్టాం కొట్టాడుతోందట. ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇటేవలే అధ్యక్షులను ప్రకటించారు. అలాగే మహిళా అధ్యక్షులను కూడా ప్రకటించేసారు. కానీ తెలుగుయువత అధ్యక్షుడిని ఎంపికలేక దాదాపు కొన్ని నెలలుగా ఆ పోస్టు ఖాళీగానే ఉంటోందట. ఒకప్పుడు ఈ పదవి కోసం పలువురు కీలక నేతలే పోటీలే నిలబడేవారని ఆ పార్టీ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. అటువంటిది పదవి ఇస్తామంటే కూడా ముందుకొచ్చేవారే కన్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో బళ్ళూ–ఓడల సామెతను గుర్తు చేసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి