iDreamPost

ఈ రంగులన్నీ ఎవరి హయాంలో వేశారు బాబూ ? సమాధానం చెప్పగలడా ?

ఈ రంగులన్నీ ఎవరి హయాంలో వేశారు బాబూ ? సమాధానం చెప్పగలడా ?

పిల్లి పాలు తాగుతూ తనను ఎవరు చూడలేదని అనుకుంటుంది. అలాటిందే చంద్రబాబునాయుడు నైజం కూడా. తాను చేస్తే ఒప్పు అదే పనిని ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం తప్పంటూ నానా యాగీ చేయటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకే చెల్లింది. పంచాయితీ కార్యాలయాలకు వైసిపి రంగులు వేయటంపై నానా గోల చేస్తున్నాడు. మరి తన హయాంలో తాను చేసిందేమిటి ? ప్రభుత్వ నిధులతో నిర్మించిన అనేక పథకాల భవనాలకు పసుపు రంగు వేసిన సంగతిని చంద్రబాబు మరచిపోయినట్లున్నాడు.

టిడిపి హయాంలో రక్షితమంచి నీటి పథకాలు, అన్న క్యాంటిన్లు, మరుగుదొడ్లు నిర్మించారు. వాటన్నింటికీ పార్టీ రంగు అయిన పసుపునే వేయించారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలీకుండా, అనుమతి లేకుండానే జరిగిందా ? కొన్ని వందల నిర్మాణాలకు పార్టీ రంగులు వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా ఓ ఎత్తైతే పార్టీ అధికారంలోకి రాకముందు నిర్మించిన రక్షితమంచి నీటి పథకాల నిర్మాణాలకు అప్పటికే ఉన్న రంగులను తీయించేసి పసుపు రంగులు వేసేశారు. తమ హాయంలో ప్రభుత్వ పథకాలకు పార్టీ రంగులు వేయటం చంద్రబాబుకు తప్పుగా కనబడలేదు.

అలాగే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ జెండా రంగు వేసేశారు. అదీ తప్పుగా అప్పటి పాలకులకు కనబడలేదు. విచిత్రమేమిటంటే అప్పట్లో చంద్రబాబు కూడా వాటిని పట్టించుకోలేదు. మరి ఇపుడే ఎందుకు ఇంత గోల చేస్తున్నారు ? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీదున్న కోపాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మీద చూపిస్తున్న విషయం అర్ధమైపోతోంది. నిజానికి పథకాలకు ఏ రంగున్నా ఎవరూ పట్టించుకోరన్న విషయం మొన్నటి ఎన్నికల్లో నిర్ధారణ అయ్యింది. 2019 ఎన్నికలకు ముందు ఎక్కడ చూసినా పసుపు రంగే కనిపించేది. కానీ ఎన్నికల్లో టిడిపికి చరిత్రలోనే ఎప్పుడూ ఎదురుచూడనంత ఘోర ఓటమి ఎదురైంది.

అంటే కనిపించే రంగుల వల్ల కాదు జనాలు ఓట్లేసేదన్న విషయం అర్ధమైపోయింది. తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పార్టీకే జనాలు ఓట్లేస్తారనే విషయం స్ఫష్టమైంది. కాబట్టి పంచాయితీ భవనాలకు వైసిపి రంగులు అన్న అంశాన్ని వదిలేసి జనాలకు ఏ విధంగా మళ్ళీ దగ్గరవ్వాలన్న విషయంపై చంద్రబాబు దృష్టి పెడితే బాగుంటుంది. చిన్న చిన్న విషయాలనే బూతద్దంలో చూస్తు నానా యాగీ చేస్తుంటే ఇపుడున్న సీట్లు కూడా భవిష్యత్తులో దక్కేది అనుమానమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి