iDreamPost

టీడీపీ త‌ల‌నొప్పుల‌కు అదే అస‌లు కార‌ణం..

టీడీపీ త‌ల‌నొప్పుల‌కు అదే అస‌లు కార‌ణం..

తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ‌కాలం పాటు చేదోడుగా ఉన్న వ‌ర్గం ఇప్పుడు చేజారిపోయింది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో దాని ఫ‌లితాలు రుచిచూశారు. అయినా పాఠాలు నేర్చుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. బీసీల‌కు పెద్ద పీట వేసిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. అప్ప‌ట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన స‌మ‌యానికి ఎస్సీలు కాంగ్రెస్ తో ఉండ‌డం, ఇత‌ర కీల‌క సామాజిక‌వ‌ర్గాల్లో కాపులు, మైనార్టీలు అటూ ఇటూ మారుతూ ఉన్న‌ప్ప‌టికీ బీసీలు మాత్రం త‌మ‌కు త‌గిన పార్టీగా టీడీపీని భావించారు. అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ కూడా బీసీ నేత‌లు ప‌లువురికి కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. నాటి కాంగ్రెస్ పార్టీ క‌న్నా మిన్న‌గా టీడీపీ బీసీల‌కు అండ‌గా ఉంటుంద‌నే అభిప్రాయం క‌లిగించారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన కొన్ని ప‌థ‌కాలు, పాల‌నా విధానంలో తీసుకొచ్చిన పలు మార్పులు దోహ‌దం చేశాయి.

చంద్ర‌బాబు కాలంలో కూడా బీసీలు టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. గ‌డ్డు ప‌రిస్థితుల్లో కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ స్థిరంగా కొన‌సాగ‌డానికి అదే ప్ర‌ధాన కార‌ణం. కానీ జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ కార‌ణంగా టీడీపీ ఓట్ బ్యాంకుకి చిల్లు ప‌డింది. మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే టీడీపీ ఓట్ల శాతం లెక్క‌ల్లో ఇది స్ప‌ష్టం అయ్యింది. రాయ‌ల‌సీమ‌లో టీడీపీకి ఉన్న కొద్ది పాటి బ‌లం కూడా కుచించుకుపోవ‌డం, ఉత్త‌రాంధ్ర‌లో ఆపార్టీకి అండ‌గా నిలిచిన వ‌ర్గాలు దూరం కావ‌డం బ‌హిర్గ‌త‌మ‌య్యింది. అదే స‌మయంలో కృష్ణా,గుంటూరు గోదావ‌రి జిల్లాల్లో కూడా బీసీ సామాజిక‌వ‌ర్గాలు వైఎస్సార్సీపీకి ఓట్లేసిన విష‌యంలో గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌యంగా మారింది.

టీడీపీ 39 శాతం లోపు ఓట్లు మాత్ర‌మే సాధించిన త‌రుణంలో దూర‌మ‌యిన వ‌ర్గాల‌ను మ‌ళ్లీ ఆక‌ట్టుకునేలా ఆపార్టీ వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. కానీ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ లో కూడా టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతోంది. అచ్చెన్నాయుడు వంటి ఒక‌రిద్ద‌రు నేత‌ల‌ను ముందు పెట్టే ప్ర‌య‌త్నం చేసినా అది ఫ‌లించడం లేదు. ప్ర‌స్తుతం టీడీపీ పూర్తిగా ఒకే సామాజిక‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీగా ముద్ర ప‌డుతున్న త‌రుణంలో దానిని చెరిపేసేందుకు అనుగుణంగా చ‌ర్య‌లు క‌నిపించ‌డం లేదు. టీడీపీ శిబిరం మొత్తం ఆ వ‌ర్గం చెప్పు చేత‌ల్లో ఉంద‌నే వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ప‌రిణామాలుంటున్నాయి. అందుకు అమ‌రావ‌తి కోసం ఆతృత ప‌డిన తీరు ఓ ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తోంది. అదే ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో టీడీపీకి అంతో ఇంతో మిగిలిన బీసీల‌ను కూడా దూరం చేస్తోంది.

విశాఖ‌లో చంద్ర‌బాబుని అడ్డుకున్న స‌మ‌యంలో తాము ఆ న‌గరానికి ఎంతో చేశామ‌ని చంద్ర‌బాబు అండ్ కో చెప్పుకున్న‌ప్ప‌టికీ వారికి అండ‌గా పెద్ద‌గా ప్ర‌జా మ‌ద్ధ‌తు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు అంత దూకుడు ప్ర‌ద‌ర్శిచండానికి అదో ప్ర‌ధాన కార‌ణం. చంద్ర‌బాబుకి ఆహ్వానం ప‌లికేందుకు, ఆయ‌న వెంట న‌డిచేందుకు విశాఖ‌కు చెందిన కీల‌క నేత‌లే కాకుండా పార్టీ శ్రేణులు కూడా సిద్ధం కాలేదు. దాంతో ఎయిర్ పోర్ట్ వ‌ద్ద టీడీపీ సంద‌డి నామ‌మాత్రంగా మారింది. దానిని వైఎస్సార్సీపీ శ్రేణులు అనుకూలంగా మ‌ల‌చుకున్నాయి. దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించినా టీడీపీ నేత‌లు దానిని ఎదుర్కోవ‌డం సాధ్యం కాలేదు. ఇరువ‌ర్గాలు పోటాపోటీగా ఉంటే పోలీసులు కూడా పాల‌క‌ప‌క్షాన్ని శాంతింప‌జేసి ప్ర‌తిప‌క్షాన్ని ముందుకు వెళ్ల‌డానికి అవ‌కాశం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి వ‌చ్చేది. కానీ దానికి భిన్నంగా టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబుకి స్వాగ‌తం చెప్పే కార్య‌క్ర‌మానికి రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దానికి ప్ర‌ధాన కార‌ణం ఇన్నేళ్లుగా ఆపార్టీకి బ‌లంగా ఉన్న బీసీ వ‌ర్గాలు మొఖం చాటేయ‌డ‌మేన‌ని చెబుతున్నారు.

ఈ ప‌రిణామాల‌తో టీడీపీ మ‌రింత ఇక్క‌ట్ల‌లో కూరుకుపోయే ప‌రిస్థితి దాపురిస్తోంది. చాలాకాలం త‌ర్వాత తొలిసారిగా పార్టీ అధినేత విశాక వ‌స్తున్న‌ట్టు తెలిసినా, అడ్డుకునే ప్ర‌య‌త్నాల్లో అధికార‌ప‌క్షం ఉంద‌ని తెలిసినా అనేక మంది చ‌లించ‌క‌పోవ‌డంతో ఇక టీడీపీకి పునాదుల్లోనే స‌మ‌స్య‌లు మొద‌ల‌యిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించ‌డం ఇక చంద్ర‌బాబుకి త‌ల‌కు మించిన భారంగా మార‌బోతోంది. టీడీపీ మ‌నుగ‌డ‌కే పెద్ద స‌మ‌స్య‌గా మారుతున్న సంకేతాలు ఇస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి