iDreamPost

గతాన్ని మరిచిపోయిన యనమల..!

గతాన్ని మరిచిపోయిన యనమల..!

గతం మరచిపోవడం లేదా గతాన్ని గుర్తుపెట్టుకోలేపోవడం సాధారణ ప్రజలకు ఎంతో నష్టం చేకూరుస్తుంది. అయితే కొంతమంది రాజకీయ నాయకులకు మాత్రం గతం గుర్తుపెట్టుకోలేపోవడం లేదా గుర్తులేనట్లుగా ప్రవర్తించడం వారికి వరం లాంటిది. గతం మరచిపోయినట్లుగా లేదా గుర్తులేనట్లుగా మాట్లాడడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరి తేరారు. తమ పార్టీ ప్రభుత్వ పాలనలో తాము వ్యవహరించిన తీరు.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు మరచి.. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గుంటూరు జైల్‌ భరో కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతూ పోలీసులు టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేయడమే యనమల ఆగ్రహానికి కారణమైంది. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము వ్యవహరించిన తీరును మరచిపోయిన యనలమ వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. హౌస్‌ అరెస్ట్‌లు అప్రజాస్వామికమన్నారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం గర్హనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అణచివేతలు ఏపీలో ఉన్నాయని వాపోయారు. దరఖాస్తు చేసినా అనుమతి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా ఉందా..? అని యనమల ప్రశ్నించారు.

యనమల మాటలు విన్నవారు ఏడాదిన్నర క్రితం వరకూ టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని విస్తుబోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో చిన్న, పెద్ద నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన వివిధ వర్గాల ప్రజలను గొంతునొక్కిన విషయం ఇంకా ప్రజలు మరచిపోలేదు. కాపు ఉద్యమాన్ని అడుగు కూడా కదలనీయలేదు. ఎమ్మార్పీఎస్‌ ఛలో విజయవాడను భగ్నం చేశారు. తమకు జీతాలు ఇవ్వాలంటూ «నిరసనకు పూనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్భంధించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వైసీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌లు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా నెలలు తరబడి 144 సెక్షన్, సెక్షన్‌ 30లను నిత్యం ఏదో ఒక మూలన అమలు చేశారు. ఈ రెండు సెక్షన్లు అమలు చేయని రోజు చంద్రబాబు పాలనలో లేదంటే అతిశయోక్తికాదు. అన్ని వర్గాల ప్రజలు తమ గళాలను ఎత్తకుండా అణచివేచిన టీడీపీ ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు సీనియర్‌ నేతగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అనుమతిలేని టీడీపీ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటేనే.. ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా.. ఉందా..? అని ప్రశ్నిస్తున్న యనమల తమ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గుర్తుకు వస్తే ఎలా స్పందిస్తారో..?!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి