iDreamPost

వడ్డీయే కాదు.. చక్రవడ్డీ కూడానట..!

వడ్డీయే కాదు.. చక్రవడ్డీ కూడానట..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని, ఇది కక్షపూరితంగా వ్యవహరించడమేనంటూ టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. వారి ఆవేశం కట్టలు తెంచుకుని.. అధికార పార్టీని బెదిరించే స్థాయికి చేరుకుంటోంది. తమ పార్టీ నేతలపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ టీడీపీ యువనేత నారా లోకేష్‌ ఇటీవల పలు సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేశారు.

ఫోర్జరీ పత్రాల ద్వారా బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌4 వాహనాలుగా మార్చి విక్రయించినందుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేసిన సందర్భంలో లోకేష్‌ తాము అధికారంలోకి వస్తే వడ్దీతో సహా చెల్లిస్తామన్నారు. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెం నాయుడును అరెస్ట్‌ చేసినప్పుడు, హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు కూడా ఇదే డైలాగ్‌ చెప్పారు. బహుసా టీడీపీ నేతలకు ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయోమోనన్న సందేహం లోకేష్‌ మాటలు విన్న వారిలో కలిగాయి.

టీడీపీ భావినేత, ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్నట్లు భావి ముఖ్యమంత్రి అయిన నారా లోకేష్‌ మాత్రమే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా లోకేష్‌కు మించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ పార్టీ నేతలపై కేసులు పెడితే.. చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు తాజాగా హెచ్చరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రతి చోటా కేసులు పెడుతున్నారని కాల్వ విమర్శించారు. టీడీపీ కార్యకర్తలు అందరూ కష్టపడి మళ్లీ చంద్రబాబును సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. నిజాయతీగా ఉన్న వారిపై కేసులు పెడితే చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి