iDreamPost

చంద్రబాబుపై అలిగిన బోండా ఉమా

చంద్రబాబుపై అలిగిన బోండా ఉమా

అందరికీ గుర్తుండే ఉంటుంది..2017లో ఏపీ క్యాబినెట్ విస్తరణ సందర్భంగా తనకు చోటు దక్కలేదని బోండా ఉమా చిందులేశారు. చంద్రబాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పట్ల తన గుస్సా ప్రదర్శించారు. ఆ తర్వాత మళ్ళీ సర్థుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ ని వీడుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా పావులు కదిపారు. చివరకు కాకినాడలో కాపు కులానికి చెందిన మాజీలతో ఓ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఆ మీటింగ్ కి నాయకత్వం వహంచిన తోట త్రిమూర్తులు ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల పంచకర్ల రమేష్ కూడా కండువా కప్పుకున్నారు. కానీ కమలంలోకి వెళ్లాలనే ఆలోచన చేసిన బోండా ఉమా వెనకడుగు వేశారు. బీజేపీతో భవిష్యత్ ఉండదనే నిర్ణయానికి రావడంతో మళ్లీ టీడీపీలో క్రియాశీలకంగా మారారు.

అంతా జరగి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ పార్టీ కోసం ఎంతో కష్టపడిన తనకు గుర్తింపు రావడం లేదని మరోసారి ఆవేదనతో ఉన్నారు. పార్టీ అదిష్టానంపై ఆయన కినుక వహించారు. ముఖ్యంగా తమ కాపు కులస్తులకు తగిన న్యాయం జరగడం లేదని ఆయన వాదనకు దిగుతున్నట్టు కనిపిస్తోంది. కిమిడి కళా వెంకట్రావును అధ్యక్ష స్థానం నుంచి తొలగించిన తరుణంలో తన లాంటి వారికి పోలిట్ బ్యూరో లో అవకాశం కల్పిస్తారని ఆయన సన్నిహితుల ముందు చెప్పుకున్నట్టు తెలుస్తోంది. కానీ చంద్రబాబు భిన్నంగా ఆలోచించారు. బోండాకి తగిన పదవి కేటాయించేందుకు ఆయన సుముఖత చూపలేదు.

దాంతో ఇటీవల ప్రకటించిన పార్టీ కార్యనిర్వాహక వర్గంలో తనకు తగిన హోదా ఇవ్వలేదని బోండా అలకపూనినట్టు కనిపిస్తోంది. చివరకు చంద్రబాబు తీరు మీద ఆయన అసహనంతో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ జగన్ ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన తనకు తగిన హోదా రాలేదని వాపోతున్నట్టు చెబుతున్నారు. దానిని గ్రహించిన టీడీపీ అధినేత నేరుగా బోండా ఉమాకి ఫోన్ చేసి వివరణ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు.

అయినప్పటికీ ఉమాలో ఇంకా అసంతృప్తి కనిపిస్తోందని అనుచరులు అంటున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండడం లేదని సన్నిహితుల ముందు ఆయన చెబుతున్న నేపథ్యంలో ఉమా వ్యవహారం ఆసక్తికరమే. ప్రస్తుతానికి ఆయనకు మరో దారి లేనందున అర్థమనస్కంగానయినా మళ్లీ టీడీపీలో కొనసాగినప్పటికీ వ్యవహారశైలిలో మార్పు ఉంటుందని మాత్రం అంతా భావిస్తున్నారు.

బోండా ఉమా మాత్రమే కాకుండా ఇంకా పలువురు కీలక నేతలు కూడా కినుక వహించినట్టు టీడీపీలో ప్రచారం సాగుతోంది. కిమిడి కళా వెంకట్రావు కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సమాచారం. చంద్రబాబు తమను అవమానించినట్టు ఎచ్చెర్లలోని కళా వెంకట్రావు అనుచరులు కూడా చెబుతున్నారు. దాంతో వారు పక్క చూపులు చూసే అవకాశం లేకపోలేదని ఓ అంచనా. ప్రస్తుతం వెంటనే అలాంటి కీలక ప్రకటనలు రాకపోయినప్పటికీ త్వరలోనే కిమిడి కుటుంబం టీడీపీకి దూరమయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తంగా టీడీపీ అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితి నుంచి ఇలాంటి కుంపట్ల కారణంగా మరింత కుదేలయ్యే సంకేతాలు స్పష్టం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి