iDreamPost

ఊ అంటావా పవన్..ఊఊ అంటావా పవన్, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీడీపీ నేతలు

ఊ అంటావా పవన్..ఊఊ అంటావా పవన్, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీడీపీ నేతలు

జనసేన ఆవిర్భావ దినోత్సవం అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ విధానం గురించి ఆయన స్పష్టం చేస్తారని జనసేన ఇప్పటికే ప్రకటించింది. దాంతో ప్రస్తుతం బీజేపీతో బంధంలో ఉన్న పవన్ కళ్యాణ్‌ దానిని కొనసాగిస్తారా లేదా అన్నదే కీలకంగా మారింది. చంద్రబాబు చెప్పినట్టుగా వన్ సైడ్ లవ్ ఎన్నాళ్లన్నది తేలిపోయే అవకాశం కనిపిస్తోంది. అందుకే బాబు లవ్ కి పవన్ ఊ అంటారా లేక ఊఊ అంటారా అన్నది తేలిపోతుందనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఏపీలో మరోసారి 2014 నాటి కూటమి కోసం చంద్రబాబు తపన పడుతున్నారు. జగన్ ని అడ్డుకోవాలంటే అంతా ఒక్కటై పోరాడాల్సిందేనని ఆయన అంచనా వేస్తున్నారు. కానీ బీజేపీ అందుకు ససేమీరా అంటోంది. మరోసారి చంద్రబాబుని భుజాన మోయాల్సిన అవసరం లేదని అనుకుంటోంది. మరోవిధంగా చెప్పాలంటే టీడీపీ తమకు అడ్డుగా ఉందనే అంచనాలో కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఓడితే టీడీపీ ఇక అంతర్థానం అయిపోయే ముప్పు ఉందని భావిస్తోంది. దాంతో టీడీపీ అడ్డుతొలగించుకునే అవకాశంగా లెక్కలేస్తోంది. టీడీపీ అడ్డుతొలగితే తామే ప్రత్నామ్నాయం అని అనుకుంటోంది.

టీడీపీ, బీజేపీ చెరో దిశలో ఆలోచిస్తుండగా మనసు టీడీపీతో, మనిషి బీజేపీతో ఉన్న పవన్ కళ్యాణ్‌ పరిస్థితి ఏమిటన్నదే అస్పష్టంగా మారింది. బీజేపీని ఒప్పించి బాబు దగ్గరకు చేర్చాలని పవన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ నిజంగా అది సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బీజేపీని వీడి టీడీపీత జతగట్టే ఆప్షన్ కూడా పవన్ కి ఉంది. కానీ అందుకు బీజేపీ అడ్డంకులు పెడుతుందనే అనుమానాలు పవన్ కాలు కదపకుండా అడ్డుకుంటున్నాయి. ఒకవేళ బీజేపీని ఎదురించి పవన్ నేరుగా మరోసారి బాబుకి భజన చేసినా ఈసారి సీన్ లోకి చినబాబు వస్తారు. నారా లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ సిద్ధపడతారా అనేది కూడా సందేహమే. లోకేష్ కి పవన్ త్యాగం చేస్తే ఇక జనసేన ఖేల్ ఖతం అవుతుంది. కాబట్టి అంతటి సాహసానికి పీకే సిద్ధమవుతారనే అంచనాలు కనిపించడం లేదు

ఏదేమయినా జగన్ ని ఎదుర్కోవడానికి అయితే మూడు పార్టీలు లేదా బీజేపీతో కలిసి సాగడం మినహా పవన్ కి మరో దారి లేదనే అభిప్రాయం కూడా ఉంది. ఈ వ్యవహారాల్లోనే పవన్ తన పార్టీ 8వ ఆవిర్భావ సభలో స్పష్టతనిస్తారని పార్టీ చెబుతోంది. ఆపార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ని మీడియా ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు అస్పష్టంగా సమాధానం చెప్పారు. ముందస్తు అంచనాలతో చంద్రబాబు ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యం మీద ప్రకటించే నిర్ణయం కోసం టీడీపీ ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. పవన్ మద్ధతు దక్కితే మూడు నాలుగు జిల్లాల్లో తమ నెత్తిన పాలుపోసినట్టవుతుందనే అంచనా టీడీపీ శ్రేణుల్లో ఉంది. దానికోసమే వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. పవన్ మాత్రం ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి అవలంభించే అవకాశం కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం మీద తన సహజధోరణిలో విమర్శలు చేయడం మినహా వచ్చే ఎన్నికల్లో జనసేన స్టాండ్ గురించి క్లారిటీ ఇచ్చేందుకు ఆయన సంసిద్ధంగా లేరని భావిస్తున్నారు. దాంతో భిన్నవాదనల నేపథ్యంలో పవన్ ఏం ప్రకటన చేస్తారనే దానికోసం టీడీపీ నేతల్లోనే ఎక్కువ ఆసక్తికనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి