iDreamPost

అనిత వ్యాఖ్యలు మరీ విడ్డూరం!

అనిత వ్యాఖ్యలు మరీ విడ్డూరం!

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటని రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. సీఎం జగన్‌ శుభాకాంక్షలు చెప్పడంపై ఆమె సోమవారం స్పందిస్తూ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యం జరిగినందుకు గర్వంతో మహిళాసాధికారత జపం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. జీతాలు పెంచండి.. ఉద్యోగ భద్రత కల్పించండని అడిగిన అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని పోలీసులతో కొట్టించడమేనా మహిళాసాధికారత? అన్నారు.

అనిత టీడీపీలో కొనసాగడం సిగ్గుచేటు కాదా?

మహిళా సాధికారత కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడానికే అర్హత లేదన్నట్టు మాట్లాడుతున్న అనిత… మహిళలను అత్యంత క్రూరంగా అవమానపరచిన తెలుగుదేశం పార్టీలో ఎలా కొనసాగుతున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ పాలనలో మహిళా ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని జట్టుపట్టుకొని ఈడ్చినప్పుడు అనితకు సిగ్గుగా అనిపించలేదా?కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కు టీడీపీ నేతలే సూత్రధారులు అన్న సంగతి బయటపడినప్పుడు కూడా ఆమెకు మహిళా జాతికి అవమానం జరిగింది అన్న విషయం తెలియదా? మొన్నకు మొన్న టీడీపీ నేత వినోద్‌జైన్‌ ఒక బాలికను లైంగికంగా వేధించినప్పుడు ఆ పార్టీలో కొనసాగుతున్నందుకు అనితకు సిగ్గు చేటు అనిపించలేదా? అని అడుగుతున్నారు.

అంగన్‌వాడీ సిబ్బందిని గుర్రాలతో తొక్కించింది, లాఠీచార్జి చేయించింది టీడీపీ హయాంలో అన్న సంగతి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీని చంద్రబాబు అమలు చేయకపోవడంతో ఆ వ్యవస్థ కుప్పకూలి పోయింది. సీఎం జగన్‌ ఆ వ్యవస్థకు ఇప్పుడు జవసత్వాలు కల్పిస్తూ మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

ఈ లెక్కలు మహిళా సాధికారతకు తార్కాణం కాదా..?

గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 79.76 లక్షల మంది మహిళలకు బ్యాంకుల్లో ఉన్న రూ.25.17వేల కోట్ల అప్పును వైఎస్సార్‌ ఆసరా పథకం పేరుతో నాలుగు విడతల్లో అందజేయడానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో 12,758.28 కోట్లను అందజేసింది. ఈ డబ్బును వారు తిరిగి చెల్లించనక్కరలేదు. మరోవైపు 45 – 60 మధ్య వయసు మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు రూ.75 వేల చొప్పున అందజేసేందుకు వైఎస్సార్‌ చేయూత పథకం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.9,179 కోట్లు అందజేసింది. ఈ పథకం లబ్ధిదారులు 25 లక్షల మంది. ఇదికాక పొదుపు సంఘాలపై మహిళలు తీసుకున్న వడ్డీనీ ఏటా ఎప్పటికప్పుడు ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆ విధంగా ఈ రెండేళ్లలో రూ.2,354 కోట్లు వారి ఖాతాలకు జమ చేసింది.

ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 33 నెలల కాలంలో రూ.61,106 కోట్ల మేర రుణాలు ఇవ్వడం ఒక రికార్డు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది అనడానికి ఈ లెక్కలే తార్కాణమని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఇవి కాదని వంగలపూడి అనిత చెప్పగలరా? అని సవాల్‌ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి