iDreamPost

భయంకరమంటున్నారు.. ఎన్నికలు కావాలంటున్నారు..

భయంకరమంటున్నారు.. ఎన్నికలు కావాలంటున్నారు..

తెలుగుదేశం పార్టీ నేతల రాజకీయం ఎవరికీ ఓ పట్టాన అర్థం అయ్యేట్టు లేదు. రెండు నల్కాల ధోరణి అవలంభించడంలో నారా చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా అనే మాట ఇప్పటికే వినిపిస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తన రెండు నాల్కల ధోరణి మారదని తెలుగుదేశం పార్టీ అధినేత నిరూపిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నేతల రెండు కళ్ల సిద్ధాంతం తాజాగా మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నా.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు నిన్న గురువారం డిమాండ్‌ చేశారు. పైగా వైసీపీ ఎన్నికలను అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేకతకు భయపడి వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలను సిద్ధం లేదంటూ ఎద్దేవా చేశారు.

నిన్న ఇలా అచ్చెం నాయుడు మాట్లాడారో లేదో.. ఈ రోజు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భిన్నమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో కోవిడ్‌ వల్ల భవిష్యత్‌ భయంకరంగా ఉండబోతోందని హెచ్చరించారు. ఏపీలో పాజిటివ్‌ రేటు 10.91 శాతం ఉంటే.. జాతీయ స్థాయి సగటు 7.87 శాతం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 30 జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే.. అందులో ఐదు జిల్లాలు ఏపీలోనే ఉన్నాయని పేర్కొన్నారు. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో కరోనా అధికంగా ఉంటుందన్నారు. భవిష్యత్‌ లో కరోనా వల్ల భయంకరమైన పరిస్థితులు ఉండే ప్రమాదం ఉందని చంద్రబాబు హెచ్చరించారు.

కరోనా వైరస్‌ తీవ్రతపై చంద్రబాబు ఇలా హెచ్చరిస్తుంటే.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెం నాయుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలని డిమాండ్‌ చేస్తుండడం టీడీపీ అనుసరిస్తున్న ద్వంద విధానానికి అద్దం పడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై భిన్న ప్రకటనలు చేస్తున్న టీడీపీ నేతలు.. ప్రజల్లో అయోమయ పరిస్థితిని సృష్టిస్గున్నట్లు విమర్శలొస్తున్నాయి. అచ్చెం నాయుడు డిమాండ్‌ చేసినట్లు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా..? లేదా.. కరోనా వల్ల భయంకరమైన పరిస్థితులు ఉంటాయని చంద్రబాబు హెచ్చరికను పరిగణలోకి తీసుకుని, పరిస్థితులు సద్దుమణిగిన తర్వాతే ఎన్నికలు జరపాలా..? అనే దానిపై ఆ పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి