iDreamPost

ఈ ఎన్నికలతో బాబుకి ఒరిగిందేమిటీ, ప్రజలకు కలిగిన లాభమేంటి??

ఈ ఎన్నికలతో బాబుకి ఒరిగిందేమిటీ, ప్రజలకు కలిగిన లాభమేంటి??

ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజానుకూలంగా పనిచేయాలి. ప్రజల మనసులు గెలిచేలా మసులు కోవాలి. అందుకోసం ప్రభుత్వ విధానాలను తప్పుబట్టాలి. అందులో వైఫల్యాలను ఎండగట్టాలి. తద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాలి. ఆ క్రమంలో ప్రజాసమస్యలను ప్రస్తావించడం, వాటి పరిష్కారినిక ప్రయత్నించడం ద్వారా మాత్రమే మార్గం సుగమం అవుతుంది. అధికార పార్టీ వాటిని తోసిపుచ్చుతున్న కొద్దీ ప్రజల్లో పెరిగే వ్యతిరేకత విపక్షానికి అదనపు బలాన్నిస్తుంది. గతంలో జగన్ అదే పంథాలో వివిధ ఆందోళనలు, దీక్షలు నిర్వహించి జననేతగా ఎదిగారు.

కానీ ఇప్పుడు చంద్రబాబు విపక్ష నేతగా దానికి భిన్నమైన దారిని ఎన్నుకున్నారు. ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ద్వారా తాను అధికారంలోకి రాగలనని ఆయన భావిస్తున్నారు. పాలకపక్షాన్ని ఇరకాటాన పెట్టాలనే పనిలో పడ్డారు. అందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తున్నారు. ఆ క్రమంలో తాను ప్రజలకు మరింత దూరమవుతున్నాననే విషయాన్ని గుర్తించడం లేదు. ప్రజలకు సంబంధం లేని అంశాల్లో ఎంత హంగామా చేసినా జనం పట్టించుకోరని, పైగా తన వాదన బలహీనపడే ప్రమాదం ఉంటుందని ఆయన గ్రహించడం లేదు. అనుభవజ్ఞుడిగా హూందాతనంతో వ్యవహరించాల్సిన వేళ దానిని విస్మరించడం ద్వారా మరింత పలుచనయ్యే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు.

ఉదాహరణకు రాజ్యసభ ఎన్నికలను చూడవచ్చు. ఎమ్మెల్యేల నుంచి పెద్దల సభకు పార్లమెంట్ కి వెళ్ళే నేతలను ఎన్నికునేందుకు రెండేళ్లకోమారు నాలుగు సీట్లు ఖాళీ అవుతాయి. అదే రీతిలో ఈసారి కూడా నలుగురు ఎంపీలు రిటైర్డ్ కావడంతో వారి స్థానంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి 85 శాతం సీట్లు గెలిచిన వైఎస్సార్సీపీకి నాలుగు స్థానాలు సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. టీడీపీ గెలిచిన 23 మందిలో కూడా ఇప్పటికే కొందరు టీడీపీకి దూరమయిన తరుణంలో ఆపార్టీ కనీసం పోటీకి నిలబడే అవకాశం కూడా లేదు. అయినా చంద్రబాబు పోటీకి సిద్ధపడ్డారు. తన పార్టీకే చెందిన 23 మంది ఓట్లలో ఎంతమంది తన అభ్యర్థికి ఓటేస్తారోననే ధీమా టీడీపీకి లేదు. అయినప్పటికీ ఆయన తయారయిపోయారు. తద్వారా ప్రజల్లో పరువు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా తగ్గడం లేదు.

నాలుగు స్థానాలలో వైఎస్సార్సీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. అందులో సగం సీట్లు బీసీలకు కేటాయించడం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికే టీడీపీకి దూరమవుతున్న బీసీలలో వైఎస్సార్సీపీ మరింత బలపడే మార్గాన్ని అన్వేషించి, ఆచరిస్తోంది. అదే సమయంలో టీడీపీ గెలిచే అవకాశం ఒక్క శాతం కూడా లేని సమయంలో తన అభ్యర్థిగా దళిత నేత  వర్ల రామయ్యను రంగం మీదకు తెచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన్ని ఊరించి, ఊరించి చివరకు కన్నీరు పెట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చినా రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు ఓడిపోయే స్థానంలో ఆయన్ని బరిలో దింపారు. ఇది ఎందుకు చేస్తున్నారన్నది టీడీపీ దగ్గర కూడా తగిన సమాధానం చెప్పలేని పరిస్థితి. పోనీ పోటీ మూలంగా ఏం సాధిస్తారన్నది కూడా చెప్పలేని పరిస్థితి. తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా తన పట్ల పూర్తి విశ్వాసం లేని సమయంలో చంద్రబాబు చేసిన ఈ ఎత్తుగడ తలబొప్పి కట్టించేలా కనిపిస్తోంది. అయినా ఆయన మాత్రం తన పార్టీ అభ్యర్థిని పోటీ నిలపడం, చివరకు ఏకగ్రీవం కావాల్సిన ఎన్నికలను పోటీ వరకూ తీసుకురావడం జరిగిపోయింది.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్సార్సీపీ కూడా ఇదే రీతిలో వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో ప్రతీసారి పోటీ తప్పకపోయేది. అయినప్పటికీ ఫలితం లేన పోటీ వల్ల కలిగే ప్రయోజనం లేదని, అయినా ప్రజలకు సంబంధం లేని అంశాలలో పట్టింపులెందుకన్నట్టుగా ఆనాటి విపక్షనేతగా జగన్ వ్యవహరించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని ప్రతీ విషయంలోనూ ఇబ్బంది పెట్టాలని ఆశిస్తున్నట్టు రుజువు చేసుకుంటున్నారు. తద్వారా తానే ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్న విషయాన్ని విస్మరిస్తున్నారు.

ఇలాంటి రాజ్యసభ ఎన్నికలను కరోనా సమయంలో నిర్వహించాల్సి రావడానికి ప్రధాన కారణం ప్రతిపక్షమే అని చెప్పవచ్చు. బడ్జెట్ కోసం అసెంబ్లీ తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశం కాగా, ఇప్పుడు అనేక మంది ఎమ్మెల్యేలు వయోభారంతో కూడా కరోనా వేళ ఓటు కోసం రావాల్సిన పరిస్థితిని చంద్రబాబు తీసుకొచ్చారు. కనీసం కరోనా విరుచుకుపడుతున్న సమయంలోనైనా పెద్ద మనసుతో వ్యవహరించి నామినేషన్ ఉపసంహరించుకుంటే టీడీపీకి గౌరవం మిగిలేది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు తన స్థాయిని మరింత తగ్గించుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి