iDreamPost

సమస్యల పై ‘తమిళ సై ‘

సమస్యల పై ‘తమిళ సై ‘

తెలంగాణ గవర్నర్ తమిళి సై సమస్యల పరిష్కారం పై దూకుడు పెంచారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు వచ్చేవారికి భరోసా ఇచ్చి పంపుతున్నారు. త్వరలో ప్రజాదర్బార్ నిర్వహించబోతున్నారు. తండాల్లో బసకు రెడీ అవుతున్నారు. తమిళిసై ఇంత చురుగ్గా వ్యవహారాలు చక్కబెట్టేందుకు కారణం ఏంటి? భూసమస్యపై ఒక్క ట్వీట్‌కే పరిష్కారం చూపించారు. క్యాబ్ డ్రైవర్ల సమ్మెను ఒకే ఒక్క సమావేశంతో విరమింపజేశారు.

 తెలంగాణ గవర్నర్ గా  రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకోడానికి గవర్నర్‌గా రాలేదని.. స్వల్పకాలంలోనే బలమైన సందేశాన్ని తమిళిసై  ప్రజల్లోకి పంపుతున్నారు. గవర్నర్‌గా వచ్చీ రాగానే.. తెలంగాణ పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకునేందుకు సమయం కేటాయించారు. ఆ తర్వాత మెల్లగా తనదైన పాలన ప్రారంభించారు. తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటికి గవర్నర్ ఛాన్స్‌లర్‌గా ఉంటారు. అందుకే ముందు యూనివర్శిటీలపై దృష్టి పెట్టారు. తొలుత వర్శిటీ స్థితిగతులపై సమీక్ష చేశారు. కీలకమైన సూచనలు చేశారు. అప్పుడే తమిళి సై తనదైన ముద్ర వేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. దీన్ని గవర్నర్ నిజం చేస్తున్నారని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది.

 రాజ్యాంగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి. ఈ విషయంలో తమిళిసై మొహమాటాలకు పోలేదు. అలాగని వివాదమూ చేయదలచుకోలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో పరిస్థితులను కొన్ని రోజులు సమీక్షించిన తర్వాతే రంగంలోకి దిగారు. తెలంగాణ పరిస్థితులను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. సలహాలు, సూచనలు తీసుకుని తిరిగొచ్చాక వెంటనే ఆర్టీసీ అధికారులను పిలిపించి మాట్లాడారు. రవాణామంత్రికి ఫోన్  చేసి సమ్మె విషయంలో తనకు వస్తున్న ఫిర్యాదులను ప్రస్తావించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి