iDreamPost

భారతి కన్నీటి కష్టాలు.. చదువుకుంటుంటే కొట్టుకుంటూ తీసుకొచ్చారు!

భారతి కన్నీటి కష్టాలు.. చదువుకుంటుంటే కొట్టుకుంటూ తీసుకొచ్చారు!

అన్నీ ఉన్నా చదువుకోవడానికి సాకులు చెప్పే వాళ్లు.. ఎందుకురా చదవడం లేదంటే.. ఈ స్కూల్ లో చేర్పిస్తే ఎలా చదువుతాను అనేవాళ్లు.. నేను చదవాలంటే అది కొనివ్వు- ఇది కొనివ్వు అని గొంతెమ్మ కోర్కెలు కోరో వాళ్లని చాలా మందినే చూసుంటారు. కానీ, తింటానికే తిండి లేక కడుపు కాలుతున్నా.. మంచినీళ్లతో కడుపు నింపుకుని చదివిన వాళ్లని చూశారా? ఛార్జీలకు డబ్బులు లేకపోతే నడుచుకుంటూ వెళ్లి చదువుకున్న వాళ్లని చూశారా? పొత్తిళ్లలో కూతుర్ని పెట్టుకుని రాత్రి నిద్రపోకుండా చదువుకున్న వాళ్లని చూశారా? అయితే అనంతపురం జిల్లాకు చెందిన భారతిని చూడండి. చదువుకోవాలంటే ఆశయం ఉండాలి కానీ.. హంగులు ఆర్భాటాలు కాదని నిరూపించింది. కూలి పనులు చేసుకుంటూ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్ డీ చేసీ శభాష్ అనిపించుకుంది.

భారతి ఐడ్రీమ్ మీడియాకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ముఖాముఖిలో తన చదువు, తాను పడిన కష్టాల గురించి చెప్పారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన భారతికి చదువుకోవాలి అనేది కల. కానీ, వాళ్లు ముగ్గురు ఆడపిల్లలు కావడంతో చదువు అనేది పెద్ద కలగానే మిగిలిపోయింది. కానీ, అమ్మమ్మ-తాతలు ఆమె బాధ్యత తీసుకున్నారు. భారతి తీసుకెళ్లి తమ వద్దే పెట్టుకున్నారు. ఆమెకు చదువు చెప్పించారు.. బాగా చదువుకును ప్రయోజకురాలివి కావాలని కోరుకున్నారు. పదో తరగతికి వచ్చిన తర్వాత నాగులగుండానికి చెందిన మేనమామ శివప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు తాను చదువుకోవాలి అనుకుంటున్న విషయాన్ని భర్తకు చెప్పలేదు. వాళ్ల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది.

చదువు అంటే భారం అవుతుందనే భయంతో నోరు మెదపలేదు. కానీ, ఓసారి తాను చదువుకోవాలి అనుకుంటున్న విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ విషయం విన్న శివప్రసాద్ ఎంతో సంతోషించాడు. 7వ తరగతి వరకు చదువుకున్న శివప్రసాద్ కు విద్య విలువ బాగా తెలుసు. అందుకే తాను చదువుకోకపోయినా.. భార్యను చదివించాలి అనుకున్నాడు. శింగనమలలో టెన్త్ వరకు చదివిన భారతి.. ఇంటర్ పామిడి జూనియర్ కాలేజ్ లో పూర్తి చేసింది. రోజూ కూలికి పోతే గానీ కడుపు నిండని పరిస్థితి. భర్త ఒక్కడే కష్టపడి కుటుంబాన్ని లాక్కురాలేడని భారతికి తెలుసు. అందుకే కొన్నిరోజులు కాలేజ్ కి వెళ్లి.. కొన్ని రోజులు కూలి పనులు చేస్తూ ఉండేది. రోజుకు రూ.25 వస్తే గగనంగా ఉండేది. ఆ డబ్బులోనే పుస్తకాలు, బస్సు ఛార్జీలు, తిండీ తిప్పలు అన్నీ చూసుకోవాలి.

చదువుకోవాలి అంటే తిండి తినలేని పరిస్థితి. అలాగే ఒక పూట తిని రెండో పూట నీళ్లు తాగి కడుపు నింపుకుంది. ఒకరు కష్టపడుతుంటే చేయి అందివ్వకపోయినా పర్లేదు. కానీ, వాళ్ల మీద రాళ్లు వేయకుండా ఉంటే చాలు. అలా భారతికి చేయందించిన వాళ్లు ఎవరూ లేరు. కానీ, రాళ్లేసిన వాళ్లకి అయితే కొదవ లేదు. ఆమె చదువుకుంటుంటే.. పెళ్లై అమ్మాయివి ఎలా చదువుకుంటావ్ అని కొట్టుకుంటూ తనని తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుని భారతి కళ్ల నీళ్లు పెట్టుకుంది. పేదరికే.. భారతి చదువుని ఆపలేకపోయింది. అలాంటి అయినవాళ్లు, బంధువుల బెదిరింపులు ఆమెను ఎందుకు ఆపుతాయి. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా భారతి డిగ్రీ, పీజీ కూడా పూర్తి చేసింది. భర్త శివప్రసాద్ ప్రతి విషయంలో భార్యకు అండగా ఉన్నాడు. చదువుకోవాలి అనే ఆశను తాతయ్య ఆమెలో పుట్టిస్తే.. దానిని పదిలంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శివప్రసాద్. భార్య చదువుకుంటే తమ జీవితాలు బాగవుతాయని శివప్రసాద్ కూడా కలలు కన్నాడు.

పీజీ తర్వాత ఏం చేయాలి అని వాళ్లకు అర్థం కాలేదు. ఇక్కడితో ఆగిపోతే ఆమె చదువు తమ కుటుంబానికి అక్కరకు రాదని భావించింది. అందుకే పీజీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. కెమెస్ట్రీ అంటే కష్టమైన సబ్జెక్ట్ అని అందరికీ తెలుసు. కానీ, అలాంటి ఛాలెంజ్ తీసుకుని సాధించి చూపించాలని భారతి నిర్ణయించుకుంది. ఆర్గానిక్ కెమెస్ట్రీలో పీజీ చేసేందుకు సిద్ధమైంది. కానీ, పీజీ చేసేందుకు టాలెంట్ మాత్రమే కాదు.. కాస్త ఆర్థిక స్థితి కూడా ఉండాలి అని చెప్పారు. కానీ, ఆమె ఎలాగైనే పీజీ చేయాలి అని బలంగా కోరుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటిలో ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభ వద్ద ‘బైనరీ మిక్చర్స్’లో పీహెచ్ డీ చేసేందుకు అవకాశం దక్కించుకుంది. ఉదయం కూలికి పోతూ రాత్రిపూట చదువుకుంటూ తన లక్ష్యాన్ని సాధించింది.

ఇప్పుడు తనకంటూ పెద్దగా కోర్కెలు లేవని చెబుతోంది. తన చదువుకు తగ్గట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వస్తే.. తన కుమార్తెను డాక్టర్ చేయడమే తన కలంటోంది. అలాగే తన సిస్టర్స్ కు కూడా ఆడపిల్లలు ఉన్నారు. వారిని కూడా బాగా చదివించాలి అనేది తన కోరికంటోంది. తన చదువు నలుగురు ఆడపిల్లలు స్ఫూర్తి కావాలని, జీవితంలో సెటిల్ కాకుండా తనలా పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ భారతి సూచిస్తోంది. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదని తన విజయమే అందుకు ఉదాహరణ అంటూ భారతి చెబుతోంది. భారతి సాధించిన విజయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతి పీహెచ్ డీ సాధించడం తమ గ్రామానికే గర్వకారణంగా చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి