iDreamPost

భర్త ఆటో డ్రైవర్‌.. పిల్లల బాగోగులు చూసుకుంటూనే PhD పట్టా

  • Published Aug 29, 2023 | 10:56 AMUpdated Aug 29, 2023 | 10:56 AM
  • Published Aug 29, 2023 | 10:56 AMUpdated Aug 29, 2023 | 10:56 AM
భర్త ఆటో డ్రైవర్‌.. పిల్లల బాగోగులు చూసుకుంటూనే PhD పట్టా

ప్రతి అమ్మాయికి బాగా చదువుకోవాలని.. జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలనే కోరిక ఉంటుంది. అయితే ఆర్థిక పరిస్థితులు, సామాజిక కట్టుబాట్లు వంటి కారణాల వల్ల.. ఎందరో మహిళల కలలు.. కల్లలుగానే మిగిలిపోతున్నాయి. చాలా మంది ఆడవారికి పుట్టింట్లోనే వారి కలలను సాకారం చేసుకునేందుకు మద్దతు లభించడం కష్టం. కన్నవాళ్లే పట్టించుకోనప్పుడు.. ఇక కట్టుకున్న భర్త, మెట్టినింటి వారు.. వాటిని నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తారు.. మద్దతుగా నిలుస్తారు అనుకుంటే దానికంటే అత్యాశ మరొకటి ఉండదు.

అయితే భార్య కల, ఆశయాలను తెలుసుకుని.. వాటి సాకారం దిశగా ఆమెను ప్రొత్సాహించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు. తాజాగా ఈ కోవకు చెందిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్థిక కష్టాలు, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికి.. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో.. పీహెచ్‌డీ చేసింది ఓ గృహిణి. భర్త ఆటో డ్రైవర్‌ అయినప్పటికి.. భార్య చదువుకు మద్దతుగా నిలిచాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తోన్న ఆ దంపతుల కథ మీకోసం..

ఈ ఆదర్శ దంపతుల పేర్లు ఈపూరి షీలా, కరుణాకర్‌. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు. షీలా తల్లి బాల్యంలోనే మరణించారు. ఈ క్రమంలో ఆమె స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదివింది. ఆ తర్వాత తెనాలిలో ఇంటర్‌ పూర్తి చేసింది. అనంతరం జేఎంజే మహిళా కాలేజీలో బీకాం ఫస్టియర్ చదువుతుండగా.. 2003లో ఆటోడ్రైవర్‌ రావూరి కరుణాకర్‌తో ఆమెకు వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత.. భార్య షీలాకు చదువు అంటే ఆసక్తి అని గమనించాడు కరుణాకర్‌.

దాంతో ఆమెను డిగ్రీ పూర్తి చేసేలా ప్రోత్సాహించాడు. అయితే డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా.. ఆర్థిక సమస్యలు కుటుంబాన్ని చుట్టుముట్టాయి. దాంతో.. కుటుంబానికి ఆర్థికంగా మద్దతుగా నిలవడం కోసం షీలా.. 2004లో అక్షరదీప్తి పథకంలో ప్రేరక్‌గా చేరింది. 2008లో ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన కంప్యూటర్‌ శిక్షణలో చేరి పీజీడీసీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, డిగ్రీ పూర్తి కాకపోవడంతో.. ఉద్యోగం రాలేదు

రాజీవ్‌ గాంధీ ఫెలోషిప్‌కు ఎంపిక..

మొత్తానికి 2009లో డిగ్రీ ఫైనలియర్‌ పూర్తి చేసింది షీలా. ఆ తర్వాత తెనాలిలోని ఓ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేసింది. ఆ తర్వాత.. ఎయిడెడ్‌ కాలేజీలో లెక్చరర్‌ పోస్టుకు దరఖాస్తు చేయగా.. పీహెచ్‌డీ తప్పనిసరి అని చెప్పటంతో.. తాను పీజీ చేసిన కాలేజీలోనే అధ్యాపకురాలిగా పనిచేసింది షీలా. 2014లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్‌యూఆర్‌సీటీ నోటిఫికేషన్‌ రావడంతో.. భర్త ప్రోత్సాహంతో దరఖాస్తు చేసింది. యూనివర్సిటీలో డాక్టర్‌ ఎన్‌.రత్నకిషోర్‌ గైడ్‌గా ఫుల్‌టైం రీసెర్చ్‌ స్కాలర్‌గా చేరింది. కానీ మళ్లీ ఆర్థిక కష్టాలు మొదలు కావడంతో.. కొంతకాలం గ్యాప్‌ వచ్చింది. ఇలా ఉండగా.. అదృష్టవశాత్తూ 2016లో రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యింది షీలా. దాంతో ఆమె కష్టాలు తీరిపోయాయి.

గవర్నమెంట్‌ లెక్చరర్‌ కాలవాలన్నదే ఆశయం..

ఇక అదే ఏడాది అనగా.. 2016 సెప్టెంబరులో ఏపీసెట్‌ అర్హత సాధించింది షీలా. ఆ తర్వాత 2017లో డిస్టెన్ ఎడ్యుకేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ ఎంహెచ్‌ఆర్‌ఎం పూర్తి చేసింది. గతేడాది ఆఖరులో ‘సర్వీస్‌ క్వాలిటీ ఇన్‌ హెల్త్‌కేర్‌ సెక్టార్‌’ (ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవల నాణ్యత) అనే అంశంపై పరిశోధన చేసింది షీలా. ఆమె సమర్పించిన థీసిస్‌కు జూలై 4న పీహెచ్‌డీ పట్టా అందుకుంది. యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవంలో భాగంగా నేడు అనగా మంగళవారం నాడు ఆమె డాక్టరేట్‌ను అందుకుంది. ప్రస్తుతం తెనాలిలోని వీఎస్‌ఆర్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కళాశాలలో కామర్స్‌ అధ్యాపకురాలిగా పని చేస్తుంది షీలా. గవర్నెంట్‌ లెక్చరర్‌ కావాలన్నదే తన ఆశయం అని చెబుతుంది.

షీలాకు ఇంజినీరింగ్‌ చదువుతున్న కుమారుడు, ఇంటర్‌ చదువుతున్న కుమార్తె ఉన్నారు. భర్తతో పాటు పిల్లలు కూడా తనను ప్రోత్సాహించారు అని చెప్పుకొచ్చింది షీలా. తమ కుటుంబం కోసం భర్త ఎంతో కష్టపడ్డారని.. తాను ఏం సాధించినా అది తన భర్త ఘనతే అని చెప్పుకొచ్చింది షీలా. భర్త ప్రోత్సాహంతో పీహెచ్‌డీ పూర్తి చేశానని.. ఓవైపు పిల్లల బాగోగులు చూసుకుంటూనే పీహెచ్‌డీ పూర్తి చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నానని.. డిగ్రీ ఫస్టియర్‌లో ఆగిపోయిన చదువు.. ఇలా పీహెచ్‌డీ వరకు కొనసాగుతుందని అనుకోలేదని తెలిపింది షీలా. ప్రస్తుతం పీహెచ్‌డీ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి