iDreamPost

మండలి రద్దు బిల్లుని అడ్డుకోవడానికి ఢిల్లీలో బలమైన లాబీ జరుగుతుందా ??

మండలి రద్దు బిల్లుని అడ్డుకోవడానికి ఢిల్లీలో బలమైన లాబీ జరుగుతుందా ??

అభివృద్ధి వికేంధ్రీకరణలో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను శాసనమండలిలో అడ్డుకోవడంతో పాటు ఆ బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా తన విచక్షణాధికారం ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో దానిమీద పెద్దఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాలకు శాసనమండలిలో విపక్షం పదే పదే ఆటంకాలు కల్పించడం, బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించడం తరువాత నాటకీయంగా అత్యంత వేగంగా జరిగిన పరిణామాలలో రాష్ట్రప్రభుత్వం తనకున్న అధికారాలు వినియోగించుకొని శాసన మండలిని రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై సభలో సుదీర్ఘ చర్చ జరగడం, అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం చక చక జరిగిపోయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని అధికారికంగా కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే.

కేంద్ర హోం శాఖ పరిశీలన తరువాత ఈ తీర్మానాన్ని కేంద్రంలో ఉభయసభలు ఆమోదించి, రాష్ట్రపతి కి పంపించి అయన అనుమతి తో గజిట్ విడుదల చేసిన తర్వాతే అధికారికంగా శాసనమండలి రద్దు అయిన్నట్టు లెక్క. అయితే ఈ మొత్తం ప్రక్రియకు ఎంత సమయం పడుతుందనే అనే అంశం కేంద్రం పార్లమెంట్, రాజ్యసభల్లో బిల్లు ప్రవేశ పెట్టడం పై ఆధారపడి ఉంది. మాములుగా అయితే ఇలాంటి సందర్భాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను బట్టి బిల్లుల భవితవ్యం ఆధారపడి ఉంటుందనేది భహిరంగ రహస్యమే.

శాసనమండలి రద్దుతో పాటు రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఈ బిల్లులను అడ్డుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన నేపథ్యంలో ఒక పక్క రాష్ట్ర బీజేపీలో కొందరు నేతలతో పాటు జనసేన, సిపిఐ నేతలు తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ కూడా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తుండడంతో ఇప్పుడు ఈ శాసనమండలి రద్దు బిల్లు పై కేంద్రం ఏవిధంగా వ్యవహరించనుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది.

అయితే ఈ బిల్లు ని అడ్డుకోవడానికి ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరి లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలో మంగళవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీలో భాగంగా తమ పార్టీ యంపి లు, ఎమ్మెల్సీలతో విడివిడిగా సమావేశమైన చంద్రబాబు నాయుడు మండలి రద్దు నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మండలి రద్దు బిల్లుపై తానూ కేంద్రంలోని  బిజెపి పెద్దలతో మాట్లాడుతున్నానని, మండలి రద్దు కాకూండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని ఎమ్మెల్సీలతో అన్నట్టు తెలిసింది.

మండలి రద్దు బిల్లు కేంద్ర హోం శాఖ దగ్గరికి వెళ్లిన తరుణంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడని ఆ పార్టీ ఎమ్మెల్సీలు తమ ఆంతరంగికుల దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరో వైపు చంద్రబాబు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు విడివిడిగా బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మండలి రద్దు అంశాన్ని రెండు సభల్లో తమ ద్వారా గానీ, బీజేపీలోకి వెళ్లిన సుజనా లాంటి వారితోగానీ ప్రస్తావించే ఏర్పాట్లు చేశామని బాబు చెబుతున్నట్లు సమాచారం. ఒకవైపు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించడం మరోవైపు కేంద్ర పెద్దలపై ఒత్తిడి చేసేలా వ్యూహం
రూపొందించినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

అవసరమైతే తమ పార్టీకి చెందిన సగం మందికిపైగా ఎమ్మెల్సీలను బీజేపీలోకి పంపి వారి పదవులను కాపాడేలా చంద్రబాబు స్కెచ్‌ గీసినట్లు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. తమ ఎమ్మెల్సీలు బీజేపీలోకి వెళ్లినా తన మాటే వింటారని అదే సమయంలో బీజేపీ బలం పెరిగినట్లు కనబడుతుందని చంద్రబాబు చెబుతున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా పార్లమెంట్‌ ముందుకు మండలి రద్దు బిల్లు రాకుండా ఉండేందుకు తమ అధినేత అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే అవి ఎంత వరకూ ఫలిస్తాయోనని తెలుగుదేశం ఎమ్మెల్సీలు సందేహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఒక్క తెలుగుదేశమే కాక రాజధాని మార్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నబీజేపీలోని కొందరు నేతలు కేంద్రంలో తమకున్న పరిచయాల ద్వారా శాసనమండలి రద్దు బిల్లు కి అడ్డుకట్ట వేయాలని కేంద్ర హోమ్ హోం శాఖ వద్ద లాబీయింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫిభ్రవరి మొదటి వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం శాసన మండలి బిల్లు పై ఏ విధంగా వ్యవహరించనుందో చూడాలి. మెజారిటీ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఈ పార్లమెంట్ సెషన్ కేవలం బడ్జెట్ అంశాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఒక పక్క రాష్ట్ర కాంగ్రెస్ మండలి రద్దుని వ్యతిరేకిస్తున్న తరుణంలో రాజ్యసభలో బలమున్న కాంగ్రెస్ ఈ శాసన మండలి బిల్లు పై ఏవిధంగా వ్యవహరిస్తుందోనన్న సందేహలున్నాయి.

ఒకవేళ ఈ బిల్లు రానున్న వేసవికాల సమావేశాలలో అయిన పార్లమెంట్ లో చర్చకి వస్తే శాసనమండలి రద్దుకి కేంద్రం సుముఖంగానే ఉందని అనుకోవచ్చు. అదే జరిగితే జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు కేంద్రం ఆమోదం ఉందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యత ఉందని భావించవచ్చు. ఏది ఏమైనా విపక్షాల లాబీయింగ్ ఫలించి కేంద్రం మండలి రద్దు బిల్లు పై తాత్సారం చేస్తుందా ?? లేదా విపక్షం చెబుతున్నట్టు కాలయాపన చేసే యోచనతో మండలి రద్దు బిల్లుని స్ఠాన్డింగ్ కమిటీ పరిశీలనకు పంపుతుందా?? లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బిల్లుకి కేంద్రం ద్వారా త్వరగా ఆమోద ముద్ర వేయించుకుంటుందా ?? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి