iDreamPost

పుతిన్ కి అమెరికన్ యాక్షన్ స్టార్ వత్తాసు, రష్యన్ ప్రతినిధిగా ఉక్రెయిన్ లో స్టీవెన్ సీగల్ పర్యటన

పుతిన్ కి అమెరికన్ యాక్షన్ స్టార్ వత్తాసు, రష్యన్ ప్రతినిధిగా ఉక్రెయిన్ లో స్టీవెన్ సీగల్ పర్యటన

అమెరికన్ యాక్షన్ స్టార్ స్టీవెన్ సీగల్ రష్యా తరఫున ఉక్రెయిన్ దళాలపై పోరాడుతున్న పోస్టు ఒకటి ఆమధ్య ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది. కానీ కొన్నాళ్ళకు అది ఫేక్ అని తేలింది. మరికొన్నాళ్ళకు ఆ ఫేక్ పోస్టుకు దగ్గరగా ఉన్న కంటెంట్ తో ఒక వీడియో రిలీజైంది. టీవీజడ్ వేజ్దా(TVZVEZDA) అనే రష్యన్ న్యూస్ వెబ్ సైట్ దీన్ని పబ్లిష్ చేసింది. ఇది ఫేక్ కాదు నిజమే! ఇందులో స్టీవెన్ సీగల్ రష్యా తరఫున యుద్ధమైతే చేయలేదు గానీ పుతిన్ వాదనకు గట్టి మద్దతు తెలిపాడు. తూర్పు ఉక్రెయిన్ లోని ఒలెనివ్కా జైలు శిథిలాల మధ్య నిలబడి సీగల్ రష్యా తరఫున మాట్లాడాడు.

ఒలెనివ్కాలో ఏం జరిగింది?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఈ శుక్రవారం తెల్లవారుజామున ఒలెనివ్కా జైలుపై దాడి జరిగింది. దాడిలో దాదాపు 50 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు చనిపోయారు. అయితే దీనికి కారణం మీరంటే మీరంటూ రష్యా, ఉక్రెయిన్ లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా సరఫరా చేసిన హైమర్ (HIMAR) రాకెట్ ను ప్రయోగించి ఉక్రెయిన్ వర్గాలు జైలును ధ్వంసం చేశాయని రష్యా వాదిస్తోంది. ఉక్రెయిన్ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. జైలు లోపల జరిగిన విస్ఫోటనమే దీనికి కారణమని చెబుతోంది. ఈ ప్రాంతంలో పర్యటించి నిజం నిగ్గు తేల్చడానకి తటస్థ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలను రష్యా తిప్పికొడుతోంది. కానీ తనకు అనుకూలంగా మాట్లాడేవారిని మాత్రం వరసగా రంగంలోకి దింపుతోంది. ఇందులో భాగంగానే స్టీవెన్ సీగల్ జైలు ధ్వంసమైన ప్రాంతంలో పర్యటించాడు.

స్టీవెన్ సీగల్ వీడియోలో ఏముంది?

రష్యా విదేశాంగ శాఖ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించిన స్టీవెన్ సీగల్ జైలుపై దాడికి రాకెట్టే కారణమని తేల్చి చెప్పాడు. అక్కడి పరిస్థితులను బట్టి  చూస్తే అది బాంబు పేలుడు అయ్యే అవకాశమే లేదన్నాడు. దీన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కుట్రగా సీగల్ అభివర్ణించాడు. రష్యాకు పట్టుబడ్డ తమ “నాజీలు” నోరు తెరవకుండా ఉండడానికే ఆయన ఈ దాడి చేయించాడన్నది సీగల్ వాదన. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, సెర్బియా, నికరాగ్వా, ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా ఇది ఉక్రెయిన్ జరిపిన హైమర్స్ దాడి అనే నిర్ధారించినట్లు రష్యన్ న్యూస్ వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది.

సీగల్ వాదనలో నిజమెంత?

సీగల్ వాదనను కొందరు నిపుణులు తోసిపుచ్చుతున్నారు. అమెరికా నుంచి వెలువడే ది పోస్ట్ అనే డిజిటల్ పత్రిక, ఫోటోలను పరిశీలించిన నిపుణులు ఇది హైమర్స్ దాడి కాదని తేల్చినట్లు చెబుతోంది. భీకరమైన మంటల వల్లే ఇంత విధ్వంసం జరిగిందని వారంటున్నారు.

సీగల్ కీ పుతిన్ కీ ఎక్కడ కుదిరింది?

అమెరికాకి బద్ద శత్రువైన రష్యాకి స్టీవెన్ సీగల్ వత్తాసు పలకడమేంటనేగా మీ డౌటు. 70 ఏళ్ళ స్టీవెన్ సీగల్ పుట్టింది అమెరికాలోనే అయినా జపాన్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అక్కడే కొంతకాలం ట్రెయినర్ గా పని చేశాడు. ఆ తర్వాత అమెరికా తిరిగి వచ్చి ట్రెయినర్ గా కొనసాగాడు. సినిమాల్లో స్టంట్స్ చేశాడు. 35 ఏళ్ళ వయసులో అమెరికన్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. సీగల్ తన సినిమాల్లో ఎక్కువగా రష్యన్ క్యారెక్టర్లే పోషించాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి సీగల్ గొప్ప అభిమాని. మార్షల్ ఆర్ట్స్ అంటే ప్రేమ, మాస్కోపై అమెరికా వైఖరి నచ్చకపోవడం లాంటి కారణాల వల్ల పుతిన్, సీగల్ మంచి స్నేహితులయ్యారు. జీవించి ఉన్న గొప్ప ప్రపంచ నాయకుల్లో పుతిన్ ఒకరని సీగల్ ప్రశంసించాడు. దెబ్బకు సీగల్ కి 2016లో ఓకేసారి అటు రష్యన్ పౌరసత్వం, ఇటు సెర్బియన్ పౌరసత్వం లభించాయి. 2018లో అమెరికాలో రష్యా ప్రత్యేక రాయబారిగా సీగల్ నియమితుడయ్యాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి