iDreamPost

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు.. తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు.. తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు

ఉక్రెయిన్ అనగానే చాలామంది మెడికల్ విద్యపట్ల ఆసక్తి ఉన్నవారికి ఆధారంగా ఉంటుంది. అందుకే వేలమంది విద్యార్థులు ఏటా ఉక్రెయిన్ కి వెళ్లి మెడిసిన్లో చేరడం ఆనవాయితీగా వస్తోంది. గడిచిన పదేళ్లకాలంలో ఇది పెరిగింది. ప్రస్తుతం సుమారుగా 3వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలలో విద్యనభ్యసిస్తున్నారు. వారిలో అత్యధికులు యుద్ధం కారణంగా ఆ దేశంలో చిక్కకుపోయారు. వాస్తవానికి యుద్ధం ఎంత తీవ్రస్థాయికి చేరుతుందనే అంచనా చాలామందిలో లేకపోవడం వల్ల అక్కడే ఉండిపోయినట్టు విద్యార్థులు చెబుతున్నారు. అదే సమయంలో ఇండియాకు తిరిగి రావాలని ఆశించిన వారికి టికెట్ ధరలు అమాంతంగా పెరగడం వల్ల అదనపుభారం అనే అంచనాతో ఆగిపోయారని కూడా అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే సీఎం జగన్ చొరవ తీసుకున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని కోరారు. అదే సమయంలో ఏపీ విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారిలో ధైర్యాన్ని నింపే కార్యక్రమాన్ని ఏపీఎన్‌ఆర్టీఎస్‌ చేస్తోంది. నో ఫ్లయింగ్‌ ఆంక్షలు ఉండటంతో విమాన సర్వీసులు నడవడంలేదని, అవి మొదలుకాగానే విద్యార్థులందరినీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు ఎన్ఆర్టీఎస్ చెబుతోంది.

ఇప్పటికే అక్కడి నుంచి 30 మందిని స్వస్థలాలకు క్షేమంగా తీసుకువచ్చినట్టు సీఈవో దినేష్ వెల్లడించారు. మిగిలిన విద్యార్థులు అంతా ధైర్యంగానే ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ సూచనలమేరకు ఎవరూ బయట సంచరించవద్దంటూ వారికి సూచించామని తెలిపారు. ఉక్రెయిన్‌ నుంచి విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చే బాధ్యతను ఇద్దరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర అంతర్జాతీయ సహకార ప్రత్యేక అధికారి, రిటైరైన విదేశీ వ్యవహారాల అధికారి గీతేష్‌ శర్మతో పాటు నోడల్‌ అధికారి రవిశంకర్‌లకు ఈ బాధ్యతలను అప్పగించింది. గీతేష్‌ శర్మను 7531904820 నంబర్‌లో, రవిశంకర్‌ను 9871999055 నెంబర్లలో సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఇతర అత్యవసర సాయంకోసం ఏపీఎన్‌ఆర్టీఎస్‌ అధికారులను 0863–2340678 నంబర్, లేదా 91–8500027678 నంబర్‌ను వాట్సప్‌ ద్వారా సంప్రదించాలని కోరింది. అంతేకాక.. ఉక్రెయిన్‌లో భారతీయుల కోసం ప్రత్యేంగా +380–997300428, +380–997300483 హెల్ప్‌లైన్‌ నంబర్లను అందుబాటులో ఉంచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి