iDreamPost

నెల్లూరు మాజీ మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

నెల్లూరు మాజీ మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

నెల్లూరు కార్పొరేషన్‌కు ఈ సారి ప్రత్యేకంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ల జాబితా సరిగా లేకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో నెల్లూరు నగర పోరు జరగడం లేదు. కోర్టు కేసులు రెండుమూడు నెలల్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నెల్లూరు నగర పోరు జరగబోతోంది.

ఇప్పుడే కాదు నెల్లూరు మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారినప్పటి నుంచి ఇదే పరిస్థితి. దాదాపు 120 సంవత్సరాలపాటు మున్సిపాలిటీగా ఉన్న నెల్లూరు 2004లో కార్పొరేషన్‌గా మారింది. కొన్నేళ్లు ప్రత్యేక అధికారి పాలన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ మేయర్‌ పీఠాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత మరికొన్నేళ్లు కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారి పాలన నడిచింది.

రెండో దఫా 2014లో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది. టీడీపీ అధికారంలో ఉంది. వైసీపీ నెల్లూరు నగర, సిటీ అసెంబ్లీలను గెలుచుకుని బలంగా మారింది. మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ ఉనికి అక్కడక్కడా కనిపిస్తోంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎవరు మేయర్‌ పీఠాన్ని గెలుచుకుంటారనే ఉత్కంఠ నాడు నెలకొంది.

Also Read: Times Now – C Voter – బెంగాలీలు మళ్లీ మమతానురాగాలే, తమిళనాట పొద్దు పొడుస్తున్నట్టే

54 డివిజన్లు ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో మేయర్‌ పీఠం దక్కాలంటే 28 మంది కార్పొరేటర్లు అవసరం. పోలింగ్‌ ముగిసిన తర్వాత అంచనాలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదనేలా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ రెండూ.. మేజిక్‌ ఫిగర్‌కు రెండు, మూడు సీట్ల దూరంలో నిలిచిపోతాయనే ఊహాగానాలు సాగాయి. అయితే లెక్కింపు తర్వాత సీన్‌ మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ తన పట్టును నిలుపుకుంది. 54 డివిజన్లకు గాను 31 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 15 డివిజన్లలో టీడీపీ, బీజేపీ రెండు చోట్ల గెలుపొందాయి. మిగతా 6 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. ఎవరి మద్ధతు లేకుండా మేయర్‌ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది.

ఎన్నికల ఫలితాల తర్వాత కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారంలో టీడీపీ ఉండడంతో.. మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకునే యత్నాలను ఆరంభించింది. వైసీపీ కార్పొరేటర్లకు వల వేసే ప్రయత్నాలు చేసింది. ప్రలోభాలకు తెరతీసింది. ఒకానొక దశలో మేయర్‌పీఠం టీడీపీ గెలుచుకోబోతోందనే ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే వైసీపీ కార్పొరేటర్లు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకపోవడంతో టీyీ పీ ప్రలోభాల రాజకీయం విఫలమైంది.

31 మంది కార్పొరేటర్లతో నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీ పాలక వర్గం ఏర్పాటైంది. నెల్లూరు నగర రెండో మేయర్‌గా అబ్ధుల్‌ అజీజ్‌ ఎంపికయ్యారు. బలం లేకపోయినా.. ప్రలోభాల ద్వారా వలసలు ప్రోత్సహించి మేయర్‌ పీఠాన్ని గెలుచుకోవాలని విఫలయత్నం చేసిన టీడీపీ.. వైసీపీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత కూడా ఆ పనిని చాపకింద నీరులా సాగించింది.

Also Read:అధికారములో ప్రవచనాలు , విపక్ష పాత్రలో పరుష పదజాలం ఇదీ బాబు తీరు ..

ఈ సారి మేయర్‌ అబ్ధుల్‌ అజీజ్‌పై దృష్టి క్రేందీకరించింది. ఆక్వా వ్యాపారి అయిన అబ్ధుల్‌ అజీజ్‌కు వల వేసింది. కొద్ది నెలలకే టీడీపీ నేత, నాటి పట్టణ, పురపాలక మంత్రి పి.నారాయణ ప్రయత్నాలు ఫలించాయి. అబ్ధుల్‌ అజీజ్‌ పలువురు కార్పొరేటర్లతో కలసి 2014 ఆగస్టులో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

వైసీపీ తరఫున రాజకీయ రంగ ప్రవేశం చేసిన అబ్ధుల్‌ అజీజ్‌.. 2014 నెల్లూరు నగర ఎమ్మెల్యే సీటును ఆశించారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఓడిపోయారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత అనిల్‌.. వైఎస్‌ జగన్‌ వెంట నడిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో నగర ఎమ్మెల్యే సీటు అనిల్‌కుమార్‌కు దక్కింది. అబ్ధుల్‌ అజీజ్‌కు మేయర్‌ అవకాశం కల్పిస్తామని వైసీపీ అధినేత హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వైసీపీ అబ్ధుల్‌ అజీజ్‌ను మేయర్‌ను చేసింది. అయితే మేయర్‌గా ఎన్నికలైన కొద్ది నెలలకే అజీజ్‌ పార్టీ ఫిరాయించారు.

మేయర్‌గా ఉన్న అజీజ్‌.. తన చిరకాల కల అయిన ఎమ్మెల్యే పదవి కోసం ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. 2019 ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచే టీడీపీ తరఫున నెల్లూరు సిటీ టిక్కెట్‌ ఆశించారు. అక్కడ నుంచి మంత్రి పి.నారాయణ పోటీ చేయడం ఖరారు చేయడంతో నెల్లూరు రూరల్‌ కోసం ప్రయత్నాలు చేశారు. టీడీపీకి అభ్యర్థుల లేమి, అజీజ్‌కు ఉన్న ఆర్థిక బలం కారణంగా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న అజీజ్‌ కల ఈ సారి నెరవేరింది. అయితే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి, సిట్టింVŠ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చేతిలో అజీజ్‌ ఓడిపోయారు.

Also Read:నెల్లూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగేదేప్పుడు?

సాధారణ ఎన్నికల తర్వాత అజీజ్‌ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సిటీలో అయితే విజయం వరిస్తుందనే భావనలో అజీజ్‌ ఉన్నారు. పైగా సిటీలో టీడీపీకి ప్రస్తుతం అభ్యర్థి లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్‌ అయ్యారు. టీడీపీకి అధికారికంగా రాజీనామా చేయకపోయినా.. ఆ పార్టీ కార్యక్రమల్లో ఎక్కడా కనిపించడం లేదు.

ప్రస్తుతం సిటీ టీడీపీలో ఉన్న పరిస్థితి తనకు టిక్కెట్‌ వచ్చేందుకు కలసి వస్తుందని అజీజ్‌ అంచనా వేస్తున్నారు. మరి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే అజీజ్‌ కల 2024లోనైనా తీరుతుందా..? రాబోయే ఎన్నికల్లో నెల్లూరు సిటీ, రూరల్‌.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? అనేది తేలాలంటే మరోమూడేళ్లు ఆగాల్సిందే. అంతకు ముందే మరికొద్ది నెలల్లో జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల్లో అజీజ్‌ తన సత్తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి