iDreamPost

ఆపత్కాలంలో ఇండియాకు అండగా నిలిచిన ఇజ్రాయెల్ ఉక్కుమహిళ

ఆపత్కాలంలో ఇండియాకు అండగా నిలిచిన ఇజ్రాయెల్ ఉక్కుమహిళ

మార్చి 17,1969న రాజకీయాల నుంచి రిటైరై విశ్రాంతి తీసుకుంటున్న గోల్డా మెయిర్ నెల క్రితం మరణించిన లెవీ ఎష్కోల్ స్థానంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా ఎన్నికైనప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు చుట్టూ శత్రుదేశాల మధ్య, ఏ క్షణంలో ఎవరితో యుద్ధం ముంచుకొస్తుందో అని అప్రమత్తంగా ఉండవలసిన దేశానికి వయసుమళ్ళిన మహిళ నాయకత్వం ఏమిటా అని. అయితే ఆమె గురించి తెలిసిన వాళ్ళు మాత్రం దేశానికి ఈమే తగిన నాయకురాలు అనుకున్నారు.

నాటి రష్యన్ సామ్రాజ్యంలో 1998లో జన్మించిన గోల్డా కుటుంబం ఆమె బాల్యంలో అమెరికాకి వలస వెళ్ళింది. అక్కడ ఆమె యూదుల సంఘాల్లో చురుగ్గా పాల్గొంటూ వివాహం తర్వాత జెరూసలేంకి చేరి ఇజ్రాయెల్ ఏర్పాటులో చురుగ్గా పాలు పంచుకున్నారు. రెండు వేల సంవత్సరాల యూదు జాతీయుల స్వప్నం ఇజ్రాయెల్ దేశం 1948లో ఏర్పడ్డాక వివిధ శాఖల్లో పనిచేసి, ధూమపానం అలవాటు వల్ల లింఫోమా అనే కేన్సర్ బారిన పడిన తర్వాత 1966లో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని పార్టీ వ్యవహారాలకు పరిమితమయ్యాయి. ఫిబ్రవరి 26,1969న అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని లెవీ యాష్కోల్ ఆకస్మిక మరణంతో ఆమె తన విశ్రాంత జీవితం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి వచ్చి, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకె, భారత ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ప్రపంచంలో మూడవ మహిళా ప్రధానిగా మార్చి 17న బాధ్యతలు చేపట్టారు.

సవాళ్ల మీద సవాళ్ళు

1972 సెప్టెంబర్ 5 న జర్మన్ నగరం మ్యూనిక్ ఒలింపిక్ గ్రామంలో ఇజ్రాయెల్ క్రీడాకారులు ఉన్న భవనంలోకి ప్రవేశించిన పాలస్తీనా అనుకూల బ్లాక్ సెప్టెంబర్ అనే సంస్థకి చెందిన ఉగ్రవాదులు క్రీడాకారులను బంధించి ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 234 మంది ఖైదీలను విడిచిపెట్టకపోతే ఇజ్రాయెల్ క్రీడాకారులను చంపేస్తామని బెదిరించినప్పుడు గోల్డా మెయిర్ లొంగలేదు. “మా కమాండోలను అనుమతించండి. మా క్రీడాకారులను రక్షించుకుంటాం” అన్న ఆమె విఙప్తిని కాదని జర్మన్ కమాండోలు చేసిన ఆపరేషన్ క్రీడాకారుల మరణానికి దారి తీసింది. అప్పుడు గోల్డా మెయిర్ తమ గూఢఛారి సంస్థ మొస్సాద్ సభ్యులతో ఒక టీమ్ ఏర్పాటు చేసి, తమ దేశ క్రీడాకారుల మరణానికి కారణమైన బ్లాక్ సెప్టెంబర్ సంస్థ సభ్యులను, వారికి అండగా ఉన్న వారిని అందరినీ వేటాడి చంపించింది.

1973లో సిరియా, ఈజిప్టు దేశాలు తమ దేశమ్మీద దాడికి ఏర్పాట్లు చేస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించడంతో ముందుగా తామే దెబ్బ తీయాలని గోల్డా మెయిర్ చేసిన ప్రతిపాదనను రక్షణ శాఖ మంత్రి అంగీకరించలేదు. ముందుగా దాడి చేయడం వల్ల అంతర్జాతీయ వేదికల మీద తమకు అండగా ఉంటున్న అమెరికా దేశానికి తమకు మద్దతు తెలపడానికి ఇబ్బంది ఎదురవుతోంది అన్న అతని వాదనతో మెయిర్ వెనక్కి తగ్గారు. దాంతో ముందుగా ఈజిప్టు, సిరియాలు దాడి మొదలుపెట్టడంతో మొదట్లో ఇజ్రాయెల్ కొన్ని నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది.

యూదుల పండగ దినమైన యోమ్ కిప్పూర్ నాడు మొదలైన ఈ యుద్ధాన్ని యోమ్ కిప్పూర్ యుద్ధం అని పిలుస్తారు. ప్రత్యర్థులు దెబ్బ కొడుతారేమో అని అనుమానం రాగానే వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకుండా ముందు దెబ్బతీయడం అనే వ్యూహంతో చుట్టూ శత్రుదేశాల మధ్య ఉన్న ఇజ్రాయెల్ నైజానికి విరుద్ధంగా వ్యవహరించిన గోల్డా మెయిర్ పనితీరు మీద ఒక కమిటీ విచారణ జరిపి ఆమె తప్పేమీ లేదని తేల్చింది. డిసెంబర్ 1973లో జరిగిన ఎన్నికల్లో గెలిచినా క్రమేపీ క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా ఏప్రిల్ 1974లో రాజకీయాల నుంచి శాశ్వతంగా రిటైరై ప్రశాంత జీవితం గడుపుతూ 1960 నుంచి పోరాడుతూ ఉన్న కేన్సర్ తో డిసెంబర్ 8,1978న మరణించారు.

1971 యుద్ధంలో భారతదేశానికి అండగా నిలిచిన మెయిర్

1970 సంవత్సరం తర్వాత తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రజల మీద పాకిస్తాన్ సైన్యం సాగించిన దమనకాండ వలన లక్షలాదిగా ప్రజలు అక్కడ నుంచి భారత భూభాగంలోకి తరలిరావడం మొదలైంది. త్వరలో పాకిస్తాన్, భారత దేశాల మధ్య మరో యుద్ధం అనివార్యం అయ్యే పరిస్థితిలో తూర్పు పాకిస్తాన్ ప్రజల పక్షాన పోరాడుతున్న స్థానిక ముక్తివాహిని దళాలకు భారత్ పరోక్షంగా సహాయం చేయడం మొదలుపెట్టింది. ఒకానొక దశలో ముక్తివాహిని దళాలకు అందించడానికి కానీ, ఒకవేళ యుద్ధం జరిగే పరిస్థితి తలెత్తితే అందులో వాడడానికి కానీ భారత్ దగ్గర బాంబులు, గ్రనేడ్లు లాంటి పేలుడు సామాగ్రి లేకుండా పోయింది. ఇజ్రాయెల్ రక్షణ దళాల దగ్గర ఈ సామగ్రి పుష్కలంగా ఉందని తెలిసింది కానీ, దాన్ని పొందాలంటే ఆనాటి పరిస్థితులు ఇజ్రాయెల్ దేశాన్ని సహాయం కోరడానికి అనువుగా లేవు.

ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో ప్రపంచం అమెరికా, రష్యా శిబిరాలుగా చీలిపోయి ఉంది. భారత్, యుగోస్లావియా లాంటి దేశాలు ఎటువైపూ చేరకుండా అలీన విధానాన్ని ప్రతిపాదించి, మరికొన్ని దేశాలతో కలిసి తటస్థంగా ఉండే దేశాల సమాఖ్యని ఏర్పాటు చేసినా, భారత్ తన రక్షణ, సాంకేతిక అవసరాల కోసం రష్యాతో మితృత్వం పాటిస్తే, పాకిస్తాన్ అమెరికా శిబిరంలో చేరింది. ఇజ్రాయెల్ దేశం ఏం చేసినా అమెరికా ప్రతి అంతర్జాతీయ వేదిక మీద దానికి పూర్తిగా అండగా ఉండి కాపాడుతూ వచ్చింది. అప్పట్ భారత దేశం అవలంబించిన విదేశాంగ విధానం పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉండేది. ఐక్యరాజ్యసమితి లాంటి వేదికల మీద ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్య మీద చర్చ జరిగినా, ఓటింగ్ జరిగినా భారత్ పాలస్తీనా పక్షాన నిలిచేది.

అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ సహాయం కోరడం ఎలా అని ఆలోచిస్తుండగా తూర్పు పాకిస్తాన్ ప్రజల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఇజ్రాయెల్ పార్లమెంటులో చర్చ జరిగింది. అప్పుడు చర్చలో పాల్గొన్న సభ్యులందరూ పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. దానికి పాకిస్తాన్ అనుసరించిన ఇజ్రాయెల్ వ్యతిరేక విధానం కూడా ఒక కారణం అయింది.

అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ సెక్రటరీ పరమేశ్వర నారాయణ్ హస్కర్ 1965లో లండన్ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అయిన ష్లోమో జబ్లుడోవిజ్ యూరప్ లోని లీచెన్ స్టెయిన్ అనే చిన్న దేశం కేంద్రంగా ఆయుధాల వ్యాపారం చేస్తుండేవాడు. అతను చిన్న తనంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ నాయకత్వంలో జర్మన్ ప్రభుత్వం యూదుల మీద సాగించిన మారణహోమంలో మరణం అంచులవరకూ వెళ్లివచ్చిన వాడు. హస్కర్ అతన్ని సంప్రదించి పరిస్థితి వివరించాడు. యూదులకు అండగా జరిగిన ఉద్యమాల్లో గోల్డా మెయిర్ తో కలిసి పోరాడిన అతను ఆమెను సంప్రదించాడు. దీర్ఘకాలంలో ఇజ్రాయెల్, భారతదేశాల మధ్య మైత్రి ఏర్పడవలసిన అవసరం గుర్తించిన గోల్డా మెయిర్ భారత దేశానికి ఆయుధాలు అందించడానికి అంగీకరించారు. మూడో కంటికి తెలియకుండా భారతదేశానికి ఇజ్రాయెల్ నుంచి ఆయుధ సామగ్రి సరఫరా అయింది.

తూర్పు పాకిస్తాన్ లో పోరాడుతున్న ముక్తి వాహిని దళాలకు, 1971 భారత పాకిస్థాన్ యుద్ధంలో భారత సైన్యానికి ఈ ఆయుధాలు విజయకారకం అయ్యాయి. పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐకి కానీ, రష్యా కేజిబి, అమెరికా సిఐఏకి కానీ చాలాకాలం తెలియని ఈ రహస్యం ఇందిరాగాంధీని ఉద్దేశించి గోల్డా మెయిర్ ఒక లేఖ రాసి ఆయుధ వ్యాపారి ష్లోమో జబ్లుడోవిజ్ ద్వారా అందజేశారు. అది ప్రస్తుతం న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ లైబ్రరీలో ఉంది. ఇరుదేశాల మధ్య మైత్రి కలకాలం కొనసాగవలసిన అవసరం ఆ లేఖలో రాశారు.

ఇందిరా గాంధీ, గోల్డా మెయిర్ ల శకం ముగిసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, భారత దేశాలు రెండూ ఇస్లామిక్ తీవ్రవాదంతో పోరాడుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా రెండు దేశాల మధ్య స్నేహ బంధం నెలకొంది ఇప్పుడు. దీనికి అర శతాబ్దం క్రితం బీజం వేసింది గోల్డా మెయిర్ ముందు చూపు!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి