iDreamPost

Crime Movies : కలెక్షన్లు కురిపించిన మర్డర్ల కహానీలు

ఇక్కడ నేరం చేసేవాడు ఎవడో తెలుసు. బాధితుడు ఎవరో తెలుసు. కాని ఈ ఇద్దరి మధ్య డ్రామాతో ఏదైతే దర్శకుడు కథనంగా రాసుకుంటాడో అక్కడ దీని సక్సెస్ ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు స్పైడర్ సినిమానే తీసుకుందాం. హత్యలు చేసేవాడు ఎస్జె సూర్య.

ఇక్కడ నేరం చేసేవాడు ఎవడో తెలుసు. బాధితుడు ఎవరో తెలుసు. కాని ఈ ఇద్దరి మధ్య డ్రామాతో ఏదైతే దర్శకుడు కథనంగా రాసుకుంటాడో అక్కడ దీని సక్సెస్ ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు స్పైడర్ సినిమానే తీసుకుందాం. హత్యలు చేసేవాడు ఎస్జె సూర్య.

Crime Movies : కలెక్షన్లు కురిపించిన మర్డర్ల కహానీలు

ఒక చిన్న ముల్లు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోయే మనం అవతలి వ్యక్తి ప్రాణం పోయేలా కత్తితో పొడవడమో లేదా తుపాకీతో కాల్చడమో చేయగలమా. ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది కదూ. మరి కొందరు దీన్ని చాలా తేలికగా ఎలా చేయగలుగుతున్నారు. వీరప్పన్, దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, వరదరాజన్ ముదలియార్ లాంటి ఎందరో మాఫియా డాన్ల ప్రస్థానం వెనుక కొన్ని వేల కుటుంబాల నెత్తుటి గాధలు ఉన్నాయి. కొన్ని లక్షల జీవితాల గాయపు మరకలు ఉన్నాయి. మనకు అవి కనిపించవు. కేవలం వీళ్ళలో ఉన్న హీరోయిజమే ఒక తెలియని ఆరాధన కలిగేలా చేస్తుంది. అదే క్రైమ్ కున్న పవర్.

సరిగ్గా వాడుకోవాలే కాని సినిమా ద్వారా నేర సామ్రాజ్యాన్ని సరైన రీతిలో కనక ఎక్స్ ప్లాయిట్ చేయగలిగితే కాసుల వర్షం కురిపించుకోవచ్చని బాలీవుడ్ లో గోవింద్ నిహలని నుంచి అనురాగ్ కశ్యప్ దాకా తెలుగులో రామ్ గోపాల్ వర్మ నుంచి వెంకట్ రాంజీ దాకా ఎందరో నిరూపిస్తూనే ఉన్నారు. వీటిని కాస్త లోతైన కోణంలో విశ్లేషించే ప్రయత్నమే ఈ ఆర్టికల్. సినిమాటిక్ ఫార్ములాలో చూపించే క్రైమ్ ని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఓపెన్ క్రైమ్. రెండోది హిడెన్ క్రైమ్. మొదటిది చూద్దాం.

ఓపెన్ క్రైమ్

ఇక్కడ నేరం చేసేవాడు ఎవడో తెలుసు. బాధితుడు ఎవరో తెలుసు. కాని ఈ ఇద్దరి మధ్య డ్రామాతో ఏదైతే దర్శకుడు కథనంగా రాసుకుంటాడో అక్కడ దీని సక్సెస్ ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు స్పైడర్ సినిమానే తీసుకుందాం. హత్యలు చేసేవాడు ఎస్జె సూర్య. పట్టుకుందామని ప్రయత్నించే వాడు మహేష్ బాబు. మధ్యలో బలవుతున్నది మాములు జనం. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ని మురుగదాస్ ఎఫెక్టివ్ గా రాసుకోలేకపోవడంతో జనాన్ని మెప్పించలేక ఫెయిల్ అయ్యింది. ఎంతసేపూ విలన్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన శ్రద్ధ హీరో పాత్రని గ్లోరిఫై చేయడంలో చూపకపోవడంతో కథ దాదాపుగా విలన్ యాంగిల్ లోనే కనిపిస్తుంది. దానికి తోడు అతనెందుకు సైకోగా మారాడు అనేదాని మీద ఏకంగా అరగంట ఫ్లాష్ బ్యాక్ పెట్టడం ఫస్ట్ హాఫ్ లోనే దెబ్బ కొట్టేసింది. ఇక అతిశయోక్తిగా అనిపించే సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.అందుకే సూపర్ స్టార్ అండగా ఉన్నా క్రైమ్ ని ఎఫెక్టివ్ గా చూపలేకపోవడంతో స్పైడర్ డిజాస్టర్ గా నిలవాల్సి వచ్చింది.

ఇప్పుడు వర్క్ అవుట్ అయిన ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగు సినిమా గమనాన్ని మార్చిన సినిమాగా టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిన శివనే తీసుకుంటే నాయకుడు శివ ప్రతినాయకుడు భవానిల మధ్య కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ హాఫ్ లోనే ఓపెన్ చేస్తాడు వర్మ. ఒక స్నేహితుడిని చంపేస్తాడు.ఇంకొకడు దారుణంగా ఆసుపత్రి పాలవుతాడు. దీంతో శివ త్వరగా కార్యాచరణకు పూనుకుని భవానికి ఎదురు తిరిగే బలమైన శక్తిగా ఎదుగుతాడు. ఈ క్రమాన్ని వర్మ ఒక పద్ధతి ప్రకారం చాలా నీట్ గా నెరేట్ చేయడంతో రెండు వైపులా మర్డర్లు జరుగుతున్నా వాటికి తగిన కారణాలు చూపుతూ బలమైన నెరేషన్ ని జోడించి ప్రేక్షకుడిని స్క్రీన్ ప్లే లో లీనం చేయడంతో శివ ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇందులో ఉన్నదీ క్రైమే. సినిమా టైటిల్స్ కన్నా ముందే కాలేజీ విద్యార్థులు మీద భవాని మనషులు దాడి చేయడంతో స్టార్ట్ అవుతుంది. దర్శకుడు తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పేసి దానికి అనుగుణంగా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం అంటే ఇదే.

రవిబాబు అనసూయ లాంటి సినిమాలను కూడా ఇదే క్యాటగిరీలోకి వేయొచ్చు. సైకో కిల్లర్ ఎవరో మనకు ముందే చూపించేస్తారు. వాడిని పట్టుకునే లక్ష్యాన్ని మెయిన్ లీడ్ చేసిన భూమిక తీసుకుంటుంది. ఇక్కడ అంతా ఓపెన్. థ్రిల్ చేసే ఎలిమెంట్ ఏదీ లేదు. కానీ వీళ్లిద్దరి మధ్యా దాగుడుమూతలాటను మంచి ఇంటెన్స్ డ్రామాతో పండించడం వల్ల క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ముందే తెలిసినా ప్రేక్షకుడు చివరిదాకా ఆసక్తిగా ఎదురు చూశాడు. అందుకే అది సక్సెస్ అయ్యింది. దీన్ని ఇంతే ప్రతిభావంతంగా తెరకెక్కించడంలో తడబడటంతో రవిబాబు తర్వాతి సినిమా అమరావతి రూపంలో ఫెయిల్యూర్ చవిచూశాడు.

ఓపెన్ క్రైమ్ లోనూ చాలా రకాల సినిమాలను విభజించుకోవచ్చు. ధృవలో అరవింద్ స్వామి సృష్టించిన క్రైమ్ వరల్డ్ హీరో కన్నా ముందు ఆడియన్స్ కు పరిచయమవుతుంది. ఇప్పుడు హీరో రామ్ చరణ్ దాన్ని ఎలా కూలగొడతాడు అనే ఆసక్తిని మలచిన తీరు దాన్నో బెస్ట్ కాప్ థ్రిల్లర్ గా నిలిపింది. పోకిరిలో అలీ భాయ్ చేసేది క్రైమే. దాన్ని ఎదురుకోవడానికి పండుగాడు ఎంచుకునే దారి కూడా క్రైమే. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సూత్రం ఓపెన్ క్రైమ్ సినిమాల్లో బాగా పని చేస్తుంది. ఈ విభాగంలో చెప్పుకోవడానికి మనకు వందల్లో సినిమాలు ఉన్నాయి. కానీ స్థలాభావం వల్ల కేవలం ఉద్దేశాన్ని చెప్పేందుకు ఇక్కడ కొన్ని ఉదాహరణలు తీసుకున్నాం తప్పించి వీటికన్నా మెరుగైన ఓపెన్ క్రైమ్ సినిమా మీకు తట్టవచ్చు.

హిడెన్ క్రైమ్

ఈ క్రైమ్ లో హంతకుడు ఎవరో తెలియదు. కాని చాలా తీవ్రమైన నేరాలు చేస్తుంటాడు. హీరో / హీరొయిన్ ఎంత ప్రయత్నించినా ఆచూకి దొరకదు. అన్ని క్లూస్ కళ్ళ ముందే ఉంటాయి. కాని చిక్కుముడి విప్పడం ఎలాగో అర్థం కాక సినిమా చివరిదాకా ప్రేక్షకుడు ఉత్కంట అనుభవిస్తూనే ఉంటాడు. దాన్ని హిడెన్ క్రైమ్ గా తీసుకోవచ్చు. మంచి ఉదాహరణగా వంశీ అన్వేషణతో మొదలుపెట్టవచ్చు. ఓ మారుమూల అడవిలో పక్షుల శబ్దాల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చిన భానుప్రియకు అక్కడ పులి పేరు మీద వరసగా జరుగుతున్న హత్యలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఎవరు చేస్తున్నారో తెలుసుకుని పట్టుకునేందుకు వచ్చిన హీరో కార్తీక్ తన ఐడెంటిటీ దాచేసి భానుప్రియ వెనుక పడుతూ ఉంటాడు. ఒకపక్క మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. కారణాలు అంతుచిక్కవు. చివరి 5 నిమిషాల దాకా విలన్ ఎవరో గెస్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఒక్కో ముడిని విప్పుతూ మతిపోయే తరహాలో ఆఖరి సీన్ లో అసలు నేరస్థుడ్ని వంశీ రివీల్ చేసే తీరుకు మైండ్ పోయి ప్రేక్షకుడు బయటికి వస్తాడు. ఇంకోసారి చూసినా అదే టెంపో రేపడం అన్వేషణలో ప్రత్యేకత

ఇక ఇప్పటి ట్రెండ్ లోకి వస్తే ఆ మధ్య వచ్చిన అడవి శేష్ ఎవరుని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఓ హత్య కేసులో ఇరుక్కున్న హీరోయిన్. ఆ అమ్మాయిని రక్షించాలని వచ్సిన ఓ హీరో ఇన్స్ పెక్టర్. ఎవరు ఎందుకు చేశారో తెలియదు. రెజీనా చెప్పే వెర్షన్ కన్విన్సింగ్ గా ఉంటుంది. శేష్ ప్రశ్నల రూపంలో రేపే లాజిక్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి. స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ లాంటి ఈ కథను ఒక్కో ఎపిసోడ్ ద్వారా రాంజీ అన్ ఫోల్డ్ చేసే తీరు చివర్లో ఇచ్చే ట్విస్ట్ ఫైనల్ గా దీన్నో పైసా వసూల్ గా మార్చేశాయి. అలా అని ఇదేదో గొప్ప సినిమా అని కాదు. ఇన్ విజిబుల్ గెస్ట్ – బదలా సినిమాలను రీమేక్ చేసే ప్రయత్నం అయినప్పటికీ వాటిని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా రీ ట్యూన్ చేయడం ఇది హిట్ అవ్వడానికి ప్రధాన కారణం. ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే ఇందులో చాలా కీ రోల్ ప్లే చేసింది. ఏ మాత్రం కాస్త లోతుగా గమనించినా లెక్కలేనన్ని లోపాలు ఎవరులో ఉన్నాయి. అలాంటివాటిని మరిపించినవాడే ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనిపించుకుంటాడు. అవే సక్సెస్ అవుతాయి.

అలా అని హిడెన్ క్రైమ్ జోనర్ ఇప్పుడేదో కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వంశీ అన్వేషణ కన్నా మునుపు సూపర్ స్టార్ కృష్ణ అవే కళ్ళు ఇలాంటి సినిమాలకు మోడల్ బుక్ గా నిలిచిపోయింది. రాజశేఖర్ నటించి ప్రముఖ కెమెరామెన్ రఘు దర్శకత్వం వహించిన ఆర్తనాదం గురించి ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. నరేష్ – శోభన జంటగా రూపొందిన కోకిల చాలా స్పెషల్ మూవీ. హత్యను చూసిన కళ్ళను హీరోకు పెట్టడం ద్వారా ఏర్పడే థ్రిల్లింగ్ డ్రామాను తెరకెక్కించిన ఇప్పుడు చూసినా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వివరణలో బాలీవుడ్ మూవీస్ జోలికి వెళ్లడం లేదు. వాటిని టచ్ చేస్తే దీనికి మూడింతలు స్థాయిలో విశ్లేషణ అవసరం అవుతుంది. అందుకే తెలుగు సినిమాలకే పరిమితం చేయడం జరిగింది. మెప్పించేలా తీయాలే స్ట్రెయిట్ మూవీ అయినా రీమేక్ అయినా వర్క్ అవుట్ అవుతుందని బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు రుజువు చేసింది కదా. హారర్ మిక్స్ చేసిన క్రైమ్ క్యాటగిరీ వేరే ఉంది. వాటిని ఇందులో పొందుపరచలేదు.

చివరిగా చెప్పాలంటే

సినిమా అనే మాధ్యమం ప్రేక్షకులను చివరిదాకా రంజింపజేయడం కోసమే. అంతే తప్ప వాళ్ళకేవో చదువు చెప్పడానికో నీతులు భోదించడానికో కాదు. అది వాళ్ళు రోజూ చేస్తారు కాబట్టే తమ విలువైన సమయాన్ని వినోదం రూపంలో ఖర్చుపెట్టడం కోసం సినిమాలు చూస్తారు థియేటర్ కు వస్తారు. ఎంటర్ టైన్మెంట్ అంటే కేవలం నవ్వించడం మాత్రమే కాదుగా. భయపెట్టినా ఆలోచింపజేసినా ఉత్కంఠకు గురి చేసినా తన్మయత్వంలో మునిగేలా చేసినా స్ఫూర్తి రగిలించినా సినిమా పూర్తయ్యాక తాను పెట్టిన డబ్బుకు న్యాయం చేకూర్చమా లేదా అనేది మాత్రమే అతను చెక్ చేసుకుంటాడు. అది నెరవేర్చినప్పుడు క్రైమ్ కథలైనా కన్నార్పకుండా చూస్తాడు. కావాల్సిందల్లా దాన్ని ఓర్పుగా చూపే నైపుణ్యం.

Also Read : Magadheerudu : ఎమోషన్ ఎక్కువైన మెగాస్టార్ మూవీ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి