iDreamPost

South Movies : బంగారంలా మారబోతున్న సౌత్ మాస్

South Movies : బంగారంలా మారబోతున్న సౌత్ మాస్

పుష్ప సక్సెస్ దెబ్బకు నార్త్ మార్కెట్ లో మన మాస్ సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో అర్థమయ్యిందిగా. దీని దెబ్బకు ఇప్పుడు పాతవాటికి డిమాండ్ వచ్చి పడింది. ముఖ్యంగా రంగస్థలం హిందీ వెర్షన్ ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో అంతకంతా పెరిగిపోతోంది. అల వైకుంఠపురములో తర్వాత దీన్ని విడుదల చేసే విధంగా హక్కులు కొన్న గోల్డ్ మైన్స్ సంస్థ ప్లానింగ్ లో ఉందని ముంబై టాక్. ఇదే కాదు విజయ్ మెర్సల్, అజిత్ విశ్వాసంలను కూడా త్వరగా డబ్బింగ్ కొట్టించి థియేటర్లలో వదిలితే ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఆ మేరకు ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.

ఇలా జరగడానికి కారణం ఉంది. జనవరిలో బాలీవుడ్ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. వచ్చే ఫిబ్రవరి దాకా పరిస్థితి ఇంచుమించు ఇలాగే కొనసాగుతుంది తప్ప పెద్దగా మార్పు ఉండదు. సగం ఆక్యుపెన్సీ, రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు ఎన్ని ఉన్నా థియేటర్లను ఎక్కడా పూర్తిగా మూసేయలేదు. ఏదోలా నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా సింగల్ స్క్రీన్లకు కంటెంట్ ఫీడింగ్ చాలా అవసరం. పాత సినిమాలు వేస్తే జనం రారు. అన్నీ ఓటిటిలో దొరుకుతున్నాయి. పోనీ మొన్నా అటు మొన్న సంవత్సరం ఆడినవి వేసుకుందామా అంటే కరెంట్ బిల్లులు కూడా రావు. ఈ నేపథ్యంలో సౌత్ నుంచి తెచ్చుకున్న డబ్బింగ్ సినిమాల కన్నా ఉత్తమ మార్గం మరొకటి లేదు.

అందుకే రంగస్థలం లాంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఇవి ఆన్ లైన్ లో లేవని కాదు. కానీ అందరూ సబ్ టైటిల్స్ తో అర్థం చేసుకుని చూసేంత ఓపిక కలిగి ఉండరు. ఏదైనా వాళ్ళ భాషలో వస్తేనే కిక్కు. యూట్యూబ్ లో మన డబ్బింగ్ సినిమాలతో కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించిన గోల్డ్ మైన్స్ ఛానల్ పుష్పతోనే థియేటర్ డిస్ట్రిబ్యూషన్ లోకి దిగింది. ఇది సక్సెస్ కావడంతో యుఎఫ్ఓ చార్జీల భారం ఎక్కువ పడకుండా ఎగ్జిబిటర్లకు లాభం కలిగేలా రెవిన్యూ మోడల్ ని రూపొందిస్తోందట. ఇదే కనక జరిగితే రాబోయే కాలంలో తెలుగు తమిళ సినిమాలకు విపరీతమమైన డిమాండ్ ఏర్పడి వేలం పాటలు పాడుకున్నా ఆశ్చర్యం లేదు

Also Read : Divorces : సినిమాను మించిపోతున్న డైవోర్స్ కథలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి