iDreamPost

కొనసాగుతున్న వైసీపీ విజయపరంపర.. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

కొనసాగుతున్న వైసీపీ విజయపరంపర.. ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

వైసీపీ విజయపరంపర కొనసాగుతోంది. ఎన్నిక ఏదైనా విజయం వైసీపీదేననేలా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శాసన సభ్యుల కోటాలో భాగంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సుబ్బారెడ్డి డిక్లరేషన్‌ పత్రాలు ఇచ్చారు.

వైసీపీ తరఫున సి.రామచంద్రయ్య, మహ్మద్‌ ఇక్భాల్, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నిసాలు ఈ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేశారు. 175 ఎమ్మెల్యేలు ఉన్న ఏపీ శాసన సభలో వైసీపీకి 151 ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన ఏకైక ఎమ్మెల్యే కూడా వైసీపీకి మద్ధతు తెలపడంతో పోటీ మాటే వినపడలేదు. బలం లేకపోయినా గత ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్య చేత పోటీ చేయించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ సారి ఆ సాహసం చేయలేదు.

తాజాగా ఎన్నికైన ఎమ్మెల్సీలతో 58 స్థానాలు గల మండలిలో వైసీపీ బలం 18కి చేరుకుంది. రాబోయే జూన్‌ నాటికి పెద్దల సభలో వైసీపీకి పూర్తిగా మెజారిటీ రాబోతోంది. మే నెలలో శాసన సభ్యుల కోటాలో మూడు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. టీడీపీకి చెందిన ఎంఏ షరీఫ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, వైసీపీకి చెందిన దేవసాని చిన్న గోవింద రెడ్డిల పదవీ ఈ నెల మార్చి 24వ తేదీన ముగియబోతోంది. ఈ మూడు స్థానాలూ అధికారపార్టీ ఖాతాలో చేరడం లాంఛనమే.

ఈ ఏడాది జూన్‌ 18వ తేదీన స్థానిక సంస్థల కోటాలో మరో 11 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. వీటిలో ఇప్పటికే మూడు ఖాళీగా ఉండగా, ఏడుగురు టీడీపీ సభ్యులు, ఒక వైసీపీ సభ్యుడి పదవీ కాలం ముగుస్తుంది. టీడీపీకి చెందిన ద్వారపూడి జగదీశ్వరరావు, గాలి సరస్వతి, రెడ్డి సుబ్రమణ్యం, బుద్దా వెంకన్న, వైవీ బాబూ రాజేంద్రప్రసాద్, పప్పాల చలపతిరావు, బి.నాగజగదీశ్వరరావులు, వైసీపీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటికి జూన్‌ 18వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీనే మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతున్న తరుణంలో ఈ 11 ఎమ్మెల్సీ స్థానాలు ఆ పార్టీ గెలుచుకోవడం సులభతరమవుతుంది.

గవర్నర్‌ కోటాలో 8 స్థానాలు ఉండగా.. నాలుగు స్థానాలు ఈ ఏడాది జూన్‌ 18వ తేదీన ఖాళీ కాబోతున్నాయి. ఇటీవల వైసీపీలో చేరిన పమిడి సమంతకమణి, టీడీపీకి చెందిన గౌనివాని శ్రీనివాసులు, బీద రవిచంద్ర, టీడీ జనార్థన్‌లు పదవీ విమరణ చేయబోతున్నారు. ఈ నాలుగు స్థానాలలో ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు కొత్త వారిని గవర్నర్‌ నామినేట్‌ చేయడం లాంఛనమే. మొత్తం మీద జూన్‌ తర్వాత రెండు చట్టసభల్లోనూ వైసీపీదే ఆధిపత్యమవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి