iDreamPost

మనోభావాలకు దొరికిన సెన్సిటివ్ దర్శకుడు

మనోభావాలకు దొరికిన సెన్సిటివ్ దర్శకుడు

ఇటీవలి కాలంలో సినిమాలకు సంబంధించి ఎక్కువ వినపడని పదం మనోభావాలు. ఆ మధ్య ఫలానా చిత్రంలో మా సామాజిక వర్గాన్ని గాయపరిచారనో లేదా మా నాయకుడిని కించపరిచారనో రకరకాలుగా వివాదాలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య వీటి తాకిడి తగ్గింది కానీ అసలు ఇలాంటి వాటికి దూరంగా ఉండే శేఖర్ కమ్ములకు కూడా ఈ సెగ తగిలే అవకాశం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. మొన్న రిలీజైన లవ్ స్టోరీ ట్రైలర్లో నాగ చైతన్య చెప్పే డైలాగ్ ఒకటుంది. గొర్రెలు కాసుకునేటోడికి గొర్రెలిస్తే ఏం జేస్తడు అదే చేస్తడు అని చెప్తాడు. నిజానికిది చాలా క్యాజువల్ గా క్యారెక్టర్ సిచువేషన్ ప్రకారం చెప్పించిన మాట. అది తెలుస్తోంది కూడా.

కానీ ఇది గొర్రెలనే ఉపాధిగా మలుచుకున్న వాళ్ళను గాయపరిచేదిగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా కొందరు నిరసన వ్యక్తం చేయడంతో ఇది కాస్తా వైరల్ గా మారిపోయి కొందరు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా దీని గురించి చర్చించుకుంటున్నారు. కుల వృత్తులు తగ్గిపోయి చదువు మీద అవగాహన పెరిగిపోయి ఉపాధి కోసం విదేశాలకు సైతం అన్ని సామజిక వర్గాల వారు వెళ్తున్నారని ఇలా గొర్రెలు కాసుకునే వాళ్ళను తక్కువ చేయడం ఏమిటని సదరు మనోభావాల గురించి అడుగుతున్న వాళ్ళ ప్రశ్న. దీని మీద శేఖర్ కమ్ముల వద్ద ఏ సమాధానం ఉందో తెలియదు కానీ మొత్తానికి మరోసారి హాట్ టాపిక్ గా మారిందీ సినిమా.

గతంలోనూ సారంగదరియా ఎంత రచ్చ చేసిందో లవ్ స్టోరీ టీమ్ ఇంకా మర్చిపోలేదు. కాకపోతే అది నెగటివ్ గా కన్నా పాజిటివ్ మైలేజ్ కు పనికొచ్చింది. ఇప్పుడిది ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. ఈ నెల 24న భారీ విడుదలకు లవ్ స్టోరీ సిద్ధమయ్యింది. చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ దక్కబోతోంది. చాలా చోట్ల ఉదయం 8 లోపే షోలు మొదలుపెట్టబోతున్నారు. ఇలాంటి బెనిఫిట్ షోలు నాగ చైతన్యకు ఈ స్థాయిలో గత కొన్ని సినిమాలకు జరగలేదు. 2 గంటల 45 నిమిషాల సుదీర్ఘ నిడివితో రాబోతున్న లవ్ స్టోరీ ఖచ్చితంగా ఫిదాని మించే రేంజ్ లో ఉంటుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి వాళ్ళ అంచనాలను ఎలా నిలబెట్టుకుంటుందో

Also Read: ఆరుకి చేరుతున్న చిరంజీవి కౌంట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి