iDreamPost

కేంద్రం సంచలన నిర్ణయం.. బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు చెల్లు చీటీ!

  • Author singhj Published - 03:41 PM, Fri - 11 August 23
  • Author singhj Published - 03:41 PM, Fri - 11 August 23
కేంద్రం సంచలన నిర్ణయం.. బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు చెల్లు చీటీ!

ఇండియాలో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో కీలకమైన ఐపీసీతో పాటు సీఆర్​పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే నూతన చట్టాలతో భర్తీ చేయనుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్​సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్​ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023 అనే మూడు కొత్త చట్టాలను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని అమిత్​ షా తెలిపారు.

ఐపీసీతో పాటు సీఆర్​పీసీ, ఎవిడెన్స్ యాక్ట్​లు బ్రిటీష్ కాలం నాటివని అమిత్ షా చెప్పారు. ఆంగ్లేయులు తమ పాలనను రక్షించుకోవడం, బలోపేతం చేయడంతో పాటు శిక్షించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ చట్టాలను ప్రవేశపెట్టారని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడం వీటి ఉద్దేశం కాదన్నారు. అందుకే ఈ చట్టాల స్థానంలో కొత్తగా మూడు చట్టాలను తీసుకొచ్చామని.. ఇవి భారత పౌరుల హక్కులను రక్షిస్తాయని లోక్​సభలో అమిత్ షా పేర్కొన్నారు. శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడమే ఈ నూతన చట్టాల లక్ష్యమన్నారు. న్యాయం అందించడమే లక్ష్యమైనా నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయన్నారు అమిత్ షా.

కొత్త చట్టాల వల్ల 90 శాతానికి పైగా నేరస్థులకు శిక్ష పడటం ఖాయమని అమిత్ షా చెప్పుకొచ్చారు. రాజద్రోహం లాంటి చట్టాలను తొలగిస్తున్నామని ఆయన ప్రకటించారు. కాగా, దేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలకుల కాలంలో తీసుకొచ్చిన సీఆర్​పీసీ, స్వాతంత్ర్యం తర్వాత తెచ్చిన ఐపీసీ చట్టాల ద్వారానే ఇప్పటిదాకా నేరస్థులకు కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. అయితే చాలాసార్లు దేశంలోని అత్యున్నత ధర్మాసనమైన సుప్రీంకోర్టు సహా వివిధ హైకోర్టులు.. ఈ కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించాయి. ఎట్టకేలకు బ్రిటిషర్ల కాలం నాటి ఈ చట్టాలకు చెల్లుచీటీ పాడాలని కేంద్రం నిర్ణయించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి