iDreamPost

ఏపీలో జులై 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం.. దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల క్యాలెండర్ విడుదల

ఏపీలో జులై 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం.. దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల క్యాలెండర్ విడుదల

ఏపీలో ఈ ఏడాది జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్ సీ ఈఆర్టీ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ ఏడాది జులై 5వ తేదీ నుంచి 2023 ఏప్రిల్ 29వ తేదీ వరకూ పాఠశాలలు జరగనున్నాయి. పాఠశాలలకు ఉండే మూడు స్థానిక సెలవులను ఉపయోగించుకుంటే.. వాటి స్థానంలో అదే నెలలో రెండో శనివారం, ఆదివారం పాఠశాలలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా జూన్ 12వ తేదీ నుంచే పాఠశాలలు పునః ప్రారంభమై ఏప్రిల్ 23 వరకూ జరిగేవి. కానీ.. ఈ ఏడాది పాఠశాలల పునః ప్రారంభ సమయం మారింది.

2022-23 విద్యాసంవత్సరంలో పాఠశాలలో 220 రోజులు పనిచేయనున్నాయి. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ సమ్మెటివ్ 2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయి. ఎస్ సీ ఈఆర్టీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38-39 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. 1 నుంచి 5 తరగతులకు మొదటి 40 రోజులు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి వరకూ 30 రోజులపాటు విద్యార్థులను సంసిద్ధం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి వరకూ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 వరకూ జరుగుతాయి. 3.30 నుంచి 4 గంటల వరకూ ఆటలకు కేటాయిస్తారు.

ప్రీ హై స్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించాల్సి ఉంటుంది. 4 నుంచి 5 గంటల వరకూ ఆటలు, పునశ్చరణ తరగతులు నిర్వహిస్తారు. వారంలో ఒకరోజు నో బ్యాగ్ డే ఉంటుంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకూ పాఠశాలలకు దసరా సెలవులుంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు దసరా సెలవులు అక్టోబర్ 1 నుంచి 6 వరకూ ఉంటాయి. అలాగే క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ ఇస్తారు. 2023లో సంక్రాంతి సెలవులు జనవరి 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ ఉంటాయి.

పరీక్షల విషయానికొస్తే.. ఫార్మెటివ్ 1 పరీక్షలు సెప్టెంబర్ 7-9 తేదీల్లో, ఫార్మెటివ్ 2 పరీక్షలు అక్టోబర్ 13-15 తేదీల్లో నిర్వహిస్తారు. అలాగే సమ్మెటివ్ 1 పరీక్షలు నవంబర్ 21 నుంచి 30 వరకూ, ఫార్మెటివ్ 3 2023 జనవరి 19 నుంచి 21 వరకూ, ఫార్మెటివ్ 4 పరీక్షలు ఫిబ్రవరి 6-8 తేదీల్లో నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకూ ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయి. 1-9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 13 నుంచి 27వ తేదీ వరకూ ఫైనల్ పరీక్షల నిర్వహణ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి