iDreamPost

Satyameva Jayathe : సత్యమేవ జయతే 2 రిపోర్ట్

Satyameva Jayathe : సత్యమేవ జయతే 2 రిపోర్ట్

సూర్యవంశీ కలెక్షన్ల పరంగా ఇచ్చిన నమ్మకంతో బాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరుగా తమ సినిమాలను థియేటర్లలోకి తెస్తున్నారు. అందులో భాగంగానే ఒక్క రోజు గ్యాప్ తో సల్మాన్ ఖాన్ లెన్త్ ఎక్కువ ఉన్న క్యామియో చేసిన అంతిమ్, జాన్ అబ్రహం సత్యమేవ జయతే 2 విడుదలయ్యాయి. హిందీ బాక్సాఫీస్ వీటితో గట్టిగా నిలబడిపోతుందన్న నమ్మకం ట్రేడ్ లో వ్యక్తమయ్యింది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు కంటెంట్ పరంగా పలు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి ఏదో అద్భుతం చేయకపోదా అనే ఆశలు లేకపోలేదు. మరి ఈ సత్యమేవ జయతే సీక్వెల్ దానికి తగ్గట్టు ఉందో లేదో రిపోర్ట్ లో చూద్దాం

హీరో ఇందులో ఏకంగా ట్రిపుల్ రోల్ చేయడం పెద్ద ట్విస్టు. దాదా సాహెబ్ బలరాం ఆజాద్(జాన్ అబ్రహం 1)కు ఇద్దరు కొడుకులు. ఒకడు హోమ్ మినిస్టర్ సత్య(జాన్ 2)కాగా మరొకడు పోలీస్ ఆఫీసర్ జయ్(జాన్ 3). ఈ మూడు పాత్రలను లింక్ చేస్తూ దేశంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ చిన్నా పెద్దా తేడా లేకుండా అన్నీ వాడేసుకున్నాడు దర్శకుడు కం రచయిత మిలప్ ఝవేరి. ఎప్పుడో 80ల కాలంలో వచ్చిన అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ఫార్ములాని మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేయాలని కాబోలు అరిగిపోయిన కథాకథనాలతో థియేటర్లో కూర్చుకున్న ప్రేక్షకుడికి నవరసాలకు బదులు నవనరకాలు చూపించే ప్రయత్నం చేయడం విశేషం

బిర్యానీలో మసాలా బాగుందని ఎవరైనా మెచ్చుకుంటే అది ఇంకా బాగా రావాలని దానికి మూడింతలు మసాలా ఎక్కువ వేస్తే అది కాస్తా వికారాలకు దారి తీస్తుంది. సత్యమేవజయతే 2లో జరిగింది ఇదే. ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక పిల్లలు చనిపోవడం, ఫ్లై ఓవర్ కూలిపోయి అమ్మాయి మరణించడం, ఒక రాజకీయనాయకుడి కొడుకు యువతిని మానభంగం చేయడం ఇలా న్యూస్ పేపర్ కటింగ్స్ అన్నీ ప్రాపర్ రైటింగ్ లేకుండా సినిమాగా తీస్తే అది అచ్చం ఇలాగే ఉంటుంది. ఈ మధ్య ఎందుకనో ముంబై సాగతో మొదలుపెట్టి జాన్ అబ్రహంలో ఓవర్ యాక్షన్ పాలు ఎక్కువగా కనిపిస్తోంది. అసలేదీ ఆశించకపోయినా ఈ కళాఖండం నిరాశ పరచడం ఖాయం

Also Read : RRR : ప్రేక్షకుల టైంని డిమాండ్ చేస్తున్న రాజమౌళి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి