iDreamPost

కోటప్పకొండ తిరునాళ్ళ – సైరా చిన్నప రెడ్డి వీరగాధ

కోటప్పకొండ తిరునాళ్ళ – సైరా చిన్నప రెడ్డి వీరగాధ

ఒక మహాశివరాత్రి నాడు కోటప్పకొండ తిరునాళ్లలో జరిగిన ఘటన స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది . గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకాలోని రెడ్డిపాలెం కి చెందిన చిన్నపరెడ్డి వీరగాధగా ప్రసిద్ధిగాంచింది. గాదె చిన్నపరెడ్డి లింగమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు ఉన్న నలుగురి కుమారుల్లో నాలుగోవాడు. వీరు ప్రకాశం జిల్లా నుండి నర్సరావుపేట తాలూకాలోని రెడ్డిపాలెం గ్రామానికి తమ పూర్వీకుల కాలంలోనే వలసవచ్చిన వారిగా చెబుతారు.

చిన్నపరెడ్డి స్వతహాగా స్వేచ్చా ప్రవృత్తి, స్వాతంత్ర కాంక్ష కలవాడు అవ్వడంతో బ్రిటీష్ ప్రభుత్వ శాసనాలను లెక్కచెయకుండా ఎప్పటికప్పుడు దిక్కార స్వరం వినిపిస్తు ఉండేవాడు. 1909వ సంవత్సరం శివరాత్రి పండుగకి ముందు రోజు చిన్నపరెడ్డి తన గ్రామంలో ప్రభ కట్టి తన పందెపు ఎడ్లను కట్టుకుని కోటప్పకొండకు చేరుకోగానే ఎద్దులు తిరునాళ్ళో కోలాహళంగా ఉన్న ప్రజలను చూసి , అక్కడ జరుగుతున్న సంబరాల మోతకి బెదిరి గందరగోళాన్ని సృష్టించాయి. దీంతో అక్కడ కాపలా ఉన్న పోలీసులు ఆ ఎడ్లను నిలిపివేయమన్నారు లేకుంటే ఎడ్లను కాల్చి చంపుతాం అనేసరికి చిన్నపరెడ్డి పోలీసులకు ఎదురుతిరిగాడు . చేతనైతే ముందు నన్ను చంపు ఆ తరువాత నా ఎడ్లను చంపమని పోలీస్ తుపాకులకు రొమ్ము చూపాడు. కానీ ఆనాటి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆరణి సుబ్బారావు ఆజ్ఞ ప్రకారం పోలీసులు చిన్నపరెడ్డి ఎద్దులని కాల్చి చంపారు.

ఈ ఘటనతో కోపోదృక్తుడైన చిన్నపరెడ్డి తన వెంట ఉన్న ప్రజలతో కలిసి అక్కడే పోలీసులపై తిరగబడ్డాడు . వందేమాతరం – మనదే రాజ్యం అంటూ పోలీసులపై ఇనుపకడ్డీలతో దాడి చేసి హెడ్ కానిస్టేబుల్ , కానిస్టేబుల్ను మంటల్లో వేసి కాల్చి చంపారు . తక్కిన పోలీసు వారిని , మెజిస్ట్రేట్ ను, బ్రిటీష్ అధికారుల్ని తరిమి కొట్టారు. ఈ ఘటన జరిగిన వెంటనే చిన్నపరెడ్డి నరసరావుపేట వచ్చి జరిగిన విషయాన్ని తహసీల్దార్ కు చెప్పగా తహసీల్దార్ చిన్నపరెడ్డినే తప్పు పట్టి కేసు కట్టి అక్కడికక్కడే అరెస్టు చేయించాడు. ఈ కేసు గుంటూరు అదనపు సెషన్ న్యాయస్థానంలో క్రిమినల్ కేసు నెంబర్ 27/1909 గా నమోదైంది.

ఐషర్ కార్షన్ అనే న్యాయాధిపతి చిన్నపరెడ్డికి ఉరిశిక్షను, నలుగురు అనుచరులకు యావజ్జీవ కారాగార శిక్షను, 16మందికి సాదారణ జైలు శిక్షను విధించారు . దీంతో చిన్నపరెడ్డిని బ్రిటీష్ ప్రభుత్వం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉరితీసి చంపారు. చిన్నపరెడ్డి ఉరితీత ఘటనతో నాటి ఆంధ్రుల్లో స్వాభిమానంతో పాటు దేశ భక్తి, స్వాతంత్ర కాంక్ష మరింత పెరిగి ,నాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేలా చేశాయి . దీంతో అల్లూరి సీతారామ రాజు, కన్నెగంటి హనుమంతు లాంటి వారు స్వరాజ్య సమరాల్లో అగ్రశ్రేణిలో నిలిచి పోరాడారు. సైరా చిన్నపరెడ్డి నీ పేరే బంగరు కడ్డి అనే జానపద గీతాలు ఇప్పటికీ గుంటూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నాలుకల మీద ఆడుతూ ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి