iDreamPost

Police Story : జాతకాలు మార్చేసిన పవర్ఫుల్ పోలీస్ సినిమా – Nostalgia

Police Story : జాతకాలు మార్చేసిన పవర్ఫుల్ పోలీస్ సినిమా – Nostalgia

1995. కన్నడలో దేవరాజ్ హీరోగా రూపొందుతున్న ‘సర్కిల్ ఇన్స్ పెక్టర్’ షూటింగ్ జరుగుతోంది. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు నేతృత్వంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి కుమార్ చనిపోయే సీన్ షూట్ చేస్తున్నారు. అప్పటికే మంజు తన దర్శకత్వ తెరంగేట్రం కోసం డేవిడ్ అనే రచయిత రాసిన కథతో ‘పోలీస్ స్టోరీ’ టైటిల్ పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. తమ బడ్జెట్ కు తగ్గ కథానాయకుడి కోసం వెతుకుతున్నారు. ముందు స్టార్స్ తో తీద్దాం అనుకుంటే రెమ్యునరేషన్ కే డబ్బులన్నీ పోయేలా ఉన్నాయి. దాంతో ఆ ఆప్షన్ వద్దనుకున్నారు. కుమార్ గోవింద్ అనే మీడియం రేంజ్ హీరోతో మాట్లాడితే డేట్లు లేవు. ఎట్టి పరిస్థితుల్లో 1996 జనవరి 26 షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. పైన చెప్పిన షూటింగ్ స్పాట్ లోనే సాయికుమార్ స్పార్క్ చూసి ఇతన్నే హీరోగా పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యారు థ్రిల్లర్ మంజు. మొదట కథ విన్న డైలాగ్ కింగ్ ఇందులో ఏదైనా హీరో తమ్ముడో అన్నయ్యో పాత్ర దొరికితే చాలు అనుకున్నారు. కానీ ఏకంగా హీరో అనగానే కన్నీళ్లు ఆగలేదు. మంజు కాళ్ళ మీద పడినంత పని చేశారు.

అనుకున్న టైం డేట్ కే ప్రారంభోత్సవం చేశారు. అగ్ని ఐపిఎస్ గా సాయికుమార్ విశ్వరూపానికి సెట్ లో ఎవరికీ మాటలు రావడం లేదు. సగ భాగం అయ్యాక నిర్మాత దగ్గర సొమ్ములు ఖాళీ. బయట ట్రై చేశారు. పది రూపాయలు వడ్డీ అన్నారు. కంటెంట్ మీద నమ్మకంతో సరే అన్నారు. ఒక ఫైట్ కోసం సామానుకు డబ్బులు లేక రౌడీలు హీరో మాట్లాడుకుంటూ కొట్టుకునేలా అప్పటికప్పుడు ఆ సీన్లో మార్పు చేశారు. ఇలాంటివి ఎన్నో. వడ్డీకి ఓకే చెప్పాక సొమ్ము వచ్చేసింది. సాయికుమార్ పారితోషికం 50 వేలు. అన్ని ఖర్చులు కలుపుకుని ఫైనల్ గా సినిమా బడ్జెట్ 39 లక్షల దాకా తేలింది. బెంగుళూరు థియేటర్ లో ప్రివ్యూ వేస్తే పెద్దవాళ్ళు వచ్చారు. కానీ ఏమి మాట్లాడలేదు. బాగుందా బాలేదా చెప్పకుండా వెళ్లిపోయారు. ఒకరిద్దరు మాత్రం కొంత ఓవర్ అయిందేమో అన్నారు. 1996 ఆగస్ట్ 16 పోలీస్ స్టోరీ కర్ణాటక మొత్తం రిలీజయ్యింది. టెన్షన్ తో థ్రిల్లర్ మంజు బృందం రూమ్ లోనే దుప్పట్లు కప్పుకుని పడుకున్నారు.

సాయికుమార్ చెన్నై వెళ్లిపోయారు. ఆయన తమ్ముడు అయ్యప్ప పి శర్మ, మరో అసిస్టెంట్ డైరెక్టర్ థియేటర్ల వద్దకు వెళ్లారు. బయటికి వచ్చిన ప్రతిఒక్కరి మొహంలో ఆనందం ఉద్వేగం స్పష్టంగా కనిపించింది. అంతే సూపర్ హిట్ అని అర్థమైపోయింది. విషయం తెలిసి సాయి ఫ్యామిలీతో సహా ఆదివారం బెంగళూరు వచ్చేశారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే. కట్ చేస్తే ఒక్క కర్ణాటకలోనే 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వంద రోజుల తర్వాత తెలుగు డబ్బింగ్ విడుదల చేస్తే ఇక్కడా 7 కోట్లకు పైనే వచ్చాయి. హిందీ తమిళం మరో 6 కోట్లు, ఇతరత్రా ఆదాయాలు అన్నీ కలిపి పాతిక కోట్ల దాకా వసూలు చేసింది పోలీస్ స్టోరీ. పెట్టింది 40 లక్షలు వచ్చింది 25 కోట్లు. ఈ సక్సెస్ కిక్కుకి సినిమాకు పనిచేసిన వారందరి జాతకాలు మారిపోయాయి. సాయికుమార్ ఖాకీ దుస్తుల్లో ఎన్ని సినిమాలు చేశారో ఆయనకే కౌంట్ లేదు. థ్రిల్లర్ మంజు దగ్గర ఖాళీ చెక్కులతో ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. ఆ తర్వాత ఎన్నో మూవీస్ వచ్చాయి కానీ పోలీస్ స్టోరీ మాత్రం ఒక క్లాసిక్. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అనే డైలాగ్ శాశ్వతంగా నిలిచిపోయింది.

Also Read : Andarivaadu : కొందరికే నచ్చిన అందరివాడు – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి