iDreamPost

పాక్‌పై సచిన్ శివతాండవానికి 21 ఏళ్లు! క్రికెట్ దేవుడు మూడో కన్ను తెరిచిన రోజు!

  • Published Mar 01, 2024 | 12:36 PMUpdated Mar 01, 2024 | 12:41 PM

Sachin Tendulkar 98 Runs vs Pakistan: పాకిస్థాన్‌పై సచిన్‌ శివతాండవం చేసిన మ్యాచ్‌ జరిగి నేటికి 21 ఏళ్లు పూర్తి అయ్యాయి. కానీ, ఆ మ్యాచ్‌లో సచిన్‌ సృష్టించిన విధ్వంసం గురించి తెలుసుకుంటే.. ఇప్పటికీ గూస్‌బమ్స్‌ పక్కా.. ఆ ఇన్నింగ్స్‌కు మరోసారి గుర్తుచేసుకుందాం..

Sachin Tendulkar 98 Runs vs Pakistan: పాకిస్థాన్‌పై సచిన్‌ శివతాండవం చేసిన మ్యాచ్‌ జరిగి నేటికి 21 ఏళ్లు పూర్తి అయ్యాయి. కానీ, ఆ మ్యాచ్‌లో సచిన్‌ సృష్టించిన విధ్వంసం గురించి తెలుసుకుంటే.. ఇప్పటికీ గూస్‌బమ్స్‌ పక్కా.. ఆ ఇన్నింగ్స్‌కు మరోసారి గుర్తుచేసుకుందాం..

  • Published Mar 01, 2024 | 12:36 PMUpdated Mar 01, 2024 | 12:41 PM
పాక్‌పై సచిన్ శివతాండవానికి 21 ఏళ్లు! క్రికెట్ దేవుడు మూడో కన్ను తెరిచిన రోజు!

క్రికెట్‌ దేవుడు సచిన్‌కే సవాలు విసిరాడు షోయబ్‌ అక్తర్‌. బౌన్సర్లు వేసి.. సచిన్‌ని భయపెట్టి, అవుట్‌ చేస్తానంటూ.. మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌ స్పీడ్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ కాస్త ఓవర్‌ కామెంట్స్‌ చేశాడు. అది కూడా వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీలో మ్యాచ్‌కి ముందు చెప్పాడు. శత్రుదేశంలోని ఓ కుర్ర బౌలర్‌ ఇలా తనకే సవాలు విసరడం సచిన్‌కు కోపం తెప్పించింది. అయితే.. తన కోపాన్ని మాటల్లో కాకుండా గ్రౌండ్‌లో తనకు అలవాటైన బ్యాటింగ్‌తోనే చూపించాడు క్రికెట్‌ దేవుడు. మూడో కన్ను తెరిచిన శివుడిలా.. పాకిస్థాన్‌పై విలయ తాండవం చేస్తూ.. షోయబ్‌ అక్తర్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. ఈ విధ్వంసానికి నేటితో 21 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై క్రికెట్‌ దేవుడి శివతాండవం గురించి మరోసారి గుర్తు చేసుకుందాం..

2003 వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా.. మార్చి 1న ఇండియా-పాకిస్థాన్‌. అదే రోజు శివరాత్రి కూడా కావడం విశేషం. అసలే ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఎలాంటి క్రేజ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే.. పైగా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ కావడంతో ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఆ హీట్‌ను మరింత పెంచుతూ.. పాకిస్థాన్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ తన నోటి దురుసు చూపించాడు. సచిన్‌ని ఉద్దేశిస్తూ.. తన బౌన్సర్లతో భయపెట్టి అవుట్‌ చేస్తానంటూ ఒక స్టేట్‌మెంట్‌ పాస్‌ చేశాడు. దీంతో.. అందరిలో ఇండియా-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. చూస్తుండగానే మ్యాచ్‌ మొదలైంది.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు ఫైటింగ్‌ టోటల్‌ను సెట్‌ చేసింది. పాక్‌ ఓపెనర్‌ సయీద్‌ అన్వర్‌ 101 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇక 274 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా. సెహ్వాగ్‌తో కలిసి సచిన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. రావడం రావడంతోనే పాకిస్థాన్‌పై జూలువిదిల్చిన సింహంలా విరుచుకుపడ్డాడు సచిన్‌. సాధారణంగా సెహ్వాగ్‌ వేగంగా ఆడుతూ.. సచిన్‌ టైమ్‌ తీసుకుని ఆడే సచిన్‌.. ఏదో పూనకం వచ్చినట్లు పాక్‌ బౌలర్లను టార్గెట్‌ చేసి మరీ కొడుతుంటే.. అంతా ఆశ్చర్యపోయారు. మ్యాచ్‌కి ముందు అక్తర్‌ చేసిన కామెంట్స్‌తో సచిన్‌కి కోపం వచ్చిందని.. అతని బ్యాటింగ్‌ చూసిన వాళ్లకి అర్థమైపోయింది. అక్తర్‌ బౌన్సర్లు వేస్తుంటే.. వాటిని బౌండరీలకు తరలిస్తూ.. సచిన్‌ అంటే అక్తర్‌కు చూపించాడు. టీ20 క్రికెట్‌ అంటే ఏంటో కూడా తెలియని రోజులు అవి.. ఆ టైమ్‌లోనే సచిన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకు ముందు షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ విధ్వంసం చూసిన ఫ్యాన్స్‌.. మళ్లీ అంతటి అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ను చూశారు.

సచిన్‌ దెబ్బకు బౌలింగ్‌కు పెట్టింది పేరైన పాకిస్థాన్‌ జట్టు వణికిపోయింది. ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ లాంటి దిగ్గజాలతో పాటు షోయబ్‌ అక్తర్‌, అబ్దుల్‌ రజాక్‌ లాంటి బౌలింగ్‌ టీమ్‌ను సచిన్‌ పిచ్చికొట్టుడు కొట్టాడు. కేవలం 75 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 98 పరుగులు చేసి.. సెంచరీకి కేవలం 2 పరుగుల దూరంలో అవుట్‌ అయ్యాడు. ఆ రోజు సచిన్‌ చేసిన శివతాండవంతో.. ఇండియాకు శివరాత్రి, పాకిస్థాన్‌కు కాలరాత్రిగా చరిత్రలో నిలిచిపోయింది. సచిన్‌ విధ్వంసానికి తోడు.. రాహుల్‌ ద్రవిడ్‌, యువరాజ్‌ సింగ్‌ రాణించడంతో 274 పరుగుల టార్గెట్‌ను టీమిండియా కేవలం 45.4 ఓవర్లలోనే ఊదిపారేసింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్‌ ఈ జనరేషన్‌కు వండర్‌ అయితే.. పాత తరానికి సచిన్‌ 2003 వన్డే వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌పై ఆడిన 98 పరుగుల ఇన్నింగ్స్‌ అత్యాద్భుతం. మరి పాక్‌పై సచిన్‌ మూడో కన్ను తెరిచిన శివుడిలా శివరాత్రి రోజే విరుచుకుపడిన ఇన్నింగ్స్‌కే 21 ఏళ్లు పూర్తి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి