iDreamPost

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలపై క్లారిటీ

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలపై క్లారిటీ

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన అంతర్రాష్ట ఆర్టీసీ సేవలపై ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులు ఈ రోజు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగి బస్సు సర్వీసులు ప్రారంభించడంపై ఓ స్పష్టతకు వచ్చారు. మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని నిశ్చయానికొచ్చారు. అయితే వారం రోజుల లోపు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలనే నిర్ణయానికి వచ్చారు.

దేశ వ్యాప్తంగా మార్చి 24వ తేదీ అర్థరాత్రి నుంచి లాక్‌డౌన్‌ విధించగా.. తెలుగు రాష్ట్రాలు మాత్రం రెండు రోజులు ముందుగానే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. 22వ తేదీన జనతా కర్ఫ్యూ జరగగా ఆ రోజు సాయంత్రమే ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. అయితే దాదాపు రెండున్నర నెలల తర్వాత ఈ నెల 8వ తేదీన అంతర్రాష్ట బస్సు సర్వీసులు నడుపుకునేందుకు కేంద్రప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. అయితే తుది నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టంది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతో సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిశాతోపాటు మహారాష్ట్రకు బస్సు సర్వీసులు నడిపేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బస్సు సర్వీసులు తిప్పడంపై ఆయా రాష్ట్రాలకు లేఖలు రాశారు. పరిస్థితులను బట్టీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వీసులు తిప్పడంపై నిర్ణయానికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కర్ణాటకకు సర్వీసులు తిప్పడంపై అనుమతి లభించింది. ఆ మేరకు కర్ణాటకకు బస్సు సర్వీసులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. తెలంగాణకు వచ్చే వారంలో సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ రోజు ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలను బట్టీ తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి