iDreamPost

విపత్కర సమయంలో ఆంధ్రజ్యోతికి ఎందుకింత విద్వేషం?

విపత్కర సమయంలో ఆంధ్రజ్యోతికి ఎందుకింత విద్వేషం?

రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీపై ఉన్నంత అభిమానం చంద్రబాబు నాయుడుకి కూడా ఉండకపోవచ్చు.రాధా కృష్ణకు జగన్ మీద ఉన్నంత ద్వేషం ఏ తెలుగుదేశం నాయకుడికి కూడా ఉండకపోవచ్చు . ఈ విషయం ఇప్పటికి అనేక సందర్భాల్లో ఋజువయ్యింది. ఈ రోజు మరోసారి ఋజువయింది.

రాష్ట్రం, యావత్ భారత దేశం ఆ మాటకొస్తే యావత్ ప్రపంచం, యావత్ మానవ జాతి కరోనా వ్యాధితో విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ప్రపంచ దేశాలు ఈ విపత్తును ఎదురుకునేందుకు అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా ఈ విపత్తును ఎదుర్కొనేందుకు తమవంతు చర్యలు తీసుకుంటాన్నాయి.

కరోనా వ్యాధి విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు భారత దేశం మొత్తం ఆదివారంనాడు స్వచ్చంద కర్ఫ్యూ పాటించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రజలు స్వచ్చందంగా కర్ఫ్యూ పాటించి వ్యాధి విస్తరించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

మొత్తంగా ఆదివారం నాటి కర్ఫ్యూ విజయవంతం అయింది. ఈ కర్ఫ్యూ లేదా అందుకు సమానమైన చర్యలు ఇంకోవారం పాటు కొనసాగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలు రెండూ తమ రాష్ట్రాల సరిహద్దులు మూసేశాయి. రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు రద్దు చేశాయి. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే మార్కెట్లు, విద్యాసంస్థలు, హోటళ్ళు తదితరమైనవి అన్నీ మరో వారం పాటు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ విషయాలు వెల్లడించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో చంద్రబాబు అనుసరించిన పద్ధతినే జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే మీడియాను తన సమావేశానికి ఆహ్వానించలేదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కొన్ని మీడియా సంస్థలపై, ప్రత్యేకించి సాక్షి మీడియా సంస్థలపై నిషేధం విధించినప్పుడు నోరు మెదపని ఈనాడు రామోజీరావు, ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు అదే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని మీడియా సంస్థలను తన అధికారిక సమావేశాలకు ఆహ్వానించకపోతే గొంతు చించుకుంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తయితే, నిన్నటి మీడియా సమావేశానికి ఆంధ్రజ్యోతిని జగన్మోహన్ రెడ్డి అనుమతించకపోవడం పట్ల రాధాకృష్ణ విషం కక్కుతూ ఒక వార్త లాంటి సంపాదకీయం లేదా తన తరహాలో వారాంతంలో రాసుకునే “కొత్తపలుకు” వంటకం వండి వార్చారు.

“విపత్కర సమయంలోనూ జగన్ కు అదే కసి” అనే శీర్షికతో ఒక వార్త రాశారు. విపత్తు సమయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్త చర్యలు ప్రజలకు చేరాల్సి ఉందని, అలాంటి సమయంలో మీడియాను ఆహ్వానించి ఆ వివరాలు తెలపాల్సి ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్షపాతంతో అలోచించి, మీడియాపట్ల వివక్ష ప్రదర్శించి, కసితో కొన్ని మీడియా సంస్థలను దూరం పెట్టి, తన అనుకూల మీడియాను మాత్రమే ఆహ్వానించారని విమర్శించారు.

మీడియాను ముఖ్యమంత్రి సమంగా చూడకపోవడం, ఇలాంటి సమయాల్లో వివక్ష కొనసాగించడం వరకు మాత్రమే రాధాకృష్ణ ప్రస్తావించి ఉంటే ఆ వార్తకు కొంత విలువ కనిపించేది. కానీ, స్వతహాగా కుల పిచ్చి, తెలుగు దేశం పార్టీ పిచ్చి ఉన్న రాధాకృష్ణ తన అసలు కుట్రను ఈ వార్తలో బయట పెట్టారు. మీడియా అంతటినీ ఆహ్వానించి ఉంటే తనకు ఇబ్బందికరమైన ప్రశ్నలు వచ్చేవని జగన్మోహన్ రెడ్డి భావించారని అందుకే అనుకూల మీడియాను మాత్రమే పిలుచుకున్నారని రాధాకృష్ణ చెప్పడంలో ఆయన వక్ర ఆలోచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వేళ ముఖ్యమంత్రి మీడియా అందరినీ ఆహ్వానించి ఉంటే ఇబ్బంది పెట్టే ప్రశ్నలు తన మీడియా ప్రతినిధుల ద్వారా వేద్దామని రాధాకృష్ణ భావించినట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది.

ఇంతటితో ఆగకుండా రాధాకృష్ణ మరో అడుగు ముందుకేసి ఒక వేళ జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశానికి అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానిస్తే ఎలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాలో చెప్పేశారు.

“ఎన్నికల కమిషనర్ మీ ఒత్తిడికి తలొగ్గి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?” అనే ప్రశ్న అడగవచ్చు అని తన మనసులో మాట చెప్పుకున్నాడు రాధాకృష్ణ. ఈ ప్రశ్నతో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చని అనుకున్నాడు. అదే ఆయన ఈ రోజు రాసుకున్నాడు.

అలాగే “స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే 14వ ఆర్ధిక సంఘం నిధులు రావన్నారు. నిధులు రాకుండా కుట్ర చేస్తున్నారన్నారు. మరి ఎన్నికలు వాయిదా పడినా ఆ నిధులు వచ్చేస్తున్నాయి కదా… దీనికేమంటారు?” అనే మరో ప్రశ్న కూడా రాధాకృష్ణ సిద్ధం చేసుకున్నారు.

మీడియా సమావేశంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని జగన్మోహన్ రెడ్డి అన్ని మీడియా సంస్థలను తన సమావేశానికి రానివ్వలేదని, కేవలం అనుకూల మీడియా ప్రతినిధులనే ఆహ్వానించుకున్నారని రాధాకృష్ణ రాసుకున్నాడు.

జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించకపోయినా ఈ ప్రశ్నలు సిద్ధం చేసుకుని ఏకంగా వార్త కూడా రాసేసుకున్నాడు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే విషయం ముఖ్యమంత్రి చెప్పదలచిన సమావేశానికి ఇలాంటి ఎజెండాతో వెళ్ళాలని రాధాకృష్ణ అనుకోవడం, అలాంటి ప్రశ్నలు అడగాలని అనుకోవడం, అడిగే అవకాశం రాకున్నా పత్రికలో రాసుకోవడం చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో రాధాకృష్ణ లాంటి వాళ్ళను ప్రత్యేకంగా చూడాల్సి వస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి