iDreamPost

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం

డ్యాంలు బద్ధలవడం, గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోవడం, వందలాది మంది జల సమాధి అవడం.. ఇలాంటి దృశ్యాలు హాలివుడ్‌ సినిమాల్లో చూస్తుంటాం. సినిమాల్లోనే కాదు.. వాస్తవంగా ఇలాంటి ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. అదీ మన దేశంలోనే. హిమాలయ పర్వతాలను అనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా మృతి చెందారు. ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న ఒక గ్రామం కొట్టుకుపోయింది.

మంచుచరియలు విరిగిపడడంతో చమోలీ జిఆ్లలోని ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడడంతో నదిలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. ఫలితంగా రైనీ గ్రామం తపోవన్‌ వద్ద ఉన్న రుషిగంగా పవర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. నీటి ప్రవాహం ధాటికి ఆనకట్ట బద్ధలైంది. పవర్‌ ప్రాజెక్టులో పని చేస్తున్న 150 మంది కార్మికులు మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యమైనట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ తెలిపారు.

ఆనకట్ట బద్ధలవడంతో నీటి ప్రవాహం ధాటికి నదీ తీర గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. పలు గ్రామాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నదీ తీర గ్రామాలను ఖాళీ చేయించింది. గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర, జాతీయ విపత్తు బృందాలతోపాటు, ఇండో టిబెటిన్‌ సరిహద్దు సిబ్బంది (ఐటీబీపీ), భారత నౌకాదళం సహాచక చర్యలు చేపట్టాయి. తపోవన్‌ వద్ద సొరంగంలో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ రక్షించింది.

ముందు జాగ్రత్త చర్యగా ధౌళీగంగా నదికి ఎగువన ఉన్న భగీరథీ నది ప్రవాహాన్ని నిలిపివేశారు. అలకనంద నదీ ప్రవాహాన్ని నిలువరించేందుకు శ్రీనగర్, రిషిగంగా ఆనకట్టలను ఖాళీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి