iDreamPost

స్కంద మూవీ రివ్యూ! రామ్ – బోయపాటిల మాస్ ఎలా ఉందంటే..

స్కంద మూవీ రివ్యూ! రామ్ – బోయపాటిల మాస్ ఎలా ఉందంటే..

టాలీవుడ్ లో మాస్ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేనితో తాజాగా స్కంద తెరకెక్కించాడు. బోయపాటి సినిమా అంటే.. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. స్కందలో కూడా రామ్ తో ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్ లు ల, డైలాగ్స్, ఫైట్స్ చేయించినట్లు ట్రైలర్ తోనే హింట్ ఇచ్చేశాడు. ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన స్కంద.. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్స్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా కోసం రామ్ నెక్స్ట్ లెవెల్ లో కష్టపడ్డాడని అర్ధమవుతుంది. మరి బోయపాటి రామ్ తో ఎలాంటి మాస్ మ్యాజిక్ చేసాడో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!

కథ:

ఆంధ్రప్రదేశ్ సీఎం (అజయ్ పుర్కర్) కూతురు పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతుంటాయి. సరిగ్గా ముహూర్తం సమయానికి అమ్మాయి తెలంగాణ సీఎం కొడుకుతో లేచిపోతుంది. అలా ఇద్దరు సీఎంల మధ్య స్నేహం కాస్త వైరంగా మారుతుంది. కట్ చేస్తే.. వెళ్ళిపోయిన కూతురిని తీసుకొని రావడానికి భాస్కర్(రామ్)ని సెట్ చేస్తాడు ఏపీ సీఎం. అప్పటికి తెలంగాణ సీఎం కొడుకుతో ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతుంటాయి. అదే రోజు తెలంగాణ సీఎం కూతురు(శ్రీలీల)ని తీసుకెళ్తాడు భాస్కర్. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరు సీఎంల మధ్య వైరం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? భాస్కర్ శ్రీలీలని అడ్డు పెట్టుకొని ఏం చేశాడు? ఏపీ సీఎంకి, భాస్కర్ కి ఉన్న లింక్ ఏంటి అనేది తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

బోయపాటి సినిమాలంటే.. మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. భారీ ఎత్తున యాక్షన్ సీక్వెన్స్ లు.. ఒక్కోసారి ఊహలకు కూడా అందని రేంజ్ లో చూపించి, మెప్పించగల సత్తా ఉంది. అయితే.. బోయపాటి సినిమాలలో కథలు మాత్రం అంత క్లిష్టంగా ఉండవు. ఫస్టాఫ్ లోనే లీడ్ క్యారెక్టర్స్ కి టార్గెట్ ఫిక్స్ చేస్తాడు.. ఆ తర్వాత టార్గెట్ వైపుగా క్యారెక్టర్స్ ని డ్రైవ్ చేస్తూ.. స్క్రీన్ ప్లే నడిపిస్తుంటాడు. సేమ్ స్కంద విషయంలో కూడా అదే ఫాలో అయ్యాడు బోయపాటి. అసలు రెండు రాష్ట్రాల సీఎంలను ఇన్వాల్వ్ చేసి.. కథను ఆరంభించిన తీరు ఫస్ట్ లోనే ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది. మరి సినిమా ఎలా సాగిందంటే..

బోయపాటి మాస్ పల్స్ గురించి మాట్లాడుకోవాలంటే.. భద్ర, సింహా, లెజెండ్, సరైనోడు, అఖండ లాంటి సినిమాలు గుర్తు చేసుకుంటే సరిపోతుంది. ఆ సినిమాలు అంతటి భారీ విజయాలు అందుకున్నాయంటే.. బోయపాటి మాస్ మ్యాజిక్ అనే చెప్పాలి. స్కందలోను అదే మాస్ ఫార్ములా అప్లై చేశాడు బోయపాటి. సినిమా మొదలైన పది నిముషాలకే బిగ్ టార్గెట్ సెట్ అవుతుందని హింట్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత భాస్కర్ క్యారెక్టర్ లో రామ్ ఇంట్రడక్షన్.. అక్కడినుండి సీఎం ఆర్డర్ తో భాస్కర్ తెలంగాణ సీఎం దగ్గరికి వెళ్లడం.. ఆ ప్లేస్ నుండి షాకిస్తూ సీఎం కూతురు శ్రీలీలను తీసుకెళ్లిపోవడం చకచకా జరిగిపోతుంటాయి.

అలా ఒక్కో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయ్యాక.. స్కందలో అసలు లక్ష్యం ఏంటనేది ప్రేక్షకులకు అర్ధమవుతుంది. బోయపాటి భారీ తనంతో పాటు.. యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అయితే.. మాస్ యాక్షన్ సీన్స్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు. అలా ఫస్టాఫ్ లో సీరియస్ సీన్స్ తో పాటు శ్రీలీలతో, రామ్ మధ్య ఫన్ ట్రాక్ బాగుంది. సెకండాఫ్ లో మాత్రం బిగ్గెస్ట్ వార్ జరగబోతుందని ఆడియన్స్ కి ఇంటర్వెల్ టైమ్ లోనే అర్ధమవుతుంది. సెకండాఫ్ లో సినిమా టార్గెట్ ఒక్కటే కాబట్టి.. స్క్రీన్ ప్లే ఆ వైపుగా వెళ్తుంది. కానీ.. పెద్దగా ట్విస్టు ఇచ్చే విధంగా స్క్రీన్ ప్లే లేకపోవడం తెలుస్తుంది. అక్కడక్కడా ఎమోషన్స్ కూడా సరిగా పండకపోగా.. సాంగ్స్ ప్లేస్ మెంట్ సెట్ కాలేదేమో అనిపిస్తుంది.

బోయపాటి గత సినిమాల మ్యాజిక్ ఇందులో రిపీట్ కాలేదు. ఎందుకంటే.. కథాకథనాలు బలంగా ఉంటే.. ఆటోమేటిక్ గా స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులలో ఆసక్తి క్రియేట్ చేయవచ్చు. పైగా బోయపాటి సినిమాలలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవ ఉండదు. కాబట్టి.. లాజిక్స్ పై దృష్టి పెడితే నిరాశకు గురయ్యే అవకాశం లేకపోలేదు. కొన్ని సీన్స్ అలా ఎలా సాధ్యం అనిపించేస్తుంటాయి. సీఎం ఇంటికి హీరో ట్రాక్టర్ పై వెళ్లడం.. ఆ యాక్షన్ సీన్స్ ఆ లెవల్ లో అవసరమా? అనే సందేహాలు రాకమానవు. రక్తం ఏరులై పారుతుంటే.. బోయపాటి మ్యాజిక్ ని ఎంజాయ్ చేయాలని మరోసారి గుర్తు చేశారు మేకర్స్. ఈ క్రమంలో ఏదో ఎక్స్ పెక్ట్ చేసి వస్తే మాత్రం.. తెరపై విధ్వంసానికి నిరాశ పడక తప్పదు.

ఒక రకంగా చెప్పాలంటే.. బోయపాటి రెగ్యులర్ తరహా మాస్ మసాలానే స్కంద. కాకపోతే హీరో మారాడని అనుకోవచ్చు. ఇక రామ్ ని మాస్ మాస్ హీరోగా పరిచయం చేయడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు. రామ్ తన వంద శాతం ఎఫర్ట్స్ పెట్టేశాడు. ఫిజికల్ గా మాత్రం రామ్ ఎంత కష్టపడ్డాడు అనేది యాక్షన్, ఫైట్ సీన్స్ లో తెలుస్తుంది. రామ్ తన క్యారెక్టర్ ని రఫ్ఫాడించేసాడు. శ్రీలీల క్యారెక్టర్ అంత గొప్పగా ఏం లేదు. బట్ రామ్ తో పెయిర్ బాగుంది. డాన్స్ లు మాత్రం అదరగొట్టింది. మిగతా నటులంతా వారి పాత్రల పరిధిమేరా నటించారు. తమన్ సాంగ్స్ పర్వాలేదు.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎండింగ్ లో ట్విస్టు ఆశ్చర్యం కలిగించవచ్చు. అది మీరే థియేటర్ లో చూడండి.

ప్లస్ లు:

  • రామ్ పెర్ఫార్మన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ లు:

  • వీక్ ఎమోషన్స్
  • బలమైన కథ లేకపోవడం
  • లాజిక్స్ మిస్సింగ్

చివరిమాట: స్కంద.. నో లాజిక్స్- ఓన్లీ యాక్షన్!

రేటింగ్: 2/5

(గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి